School Fees: స్వేచ్చ బ్యూరో: తెలంగాణలో ప్రైవేట్ పాఠశాలల ఫీజుల నియంత్రణపై ప్రభుత్వం స్పష్టమైన చర్యలు తీసుకోకపోవడంతో ఈ విద్యాసంవత్సరం కూడా తల్లిదండ్రులకు భారీ వడ్డన తప్పేలా లేదు. మరో రెండు వారాల్లో కొత్త విద్యాసంవత్సరం(2026-27) ప్రారంభం కానుండటంతో, స్కూల్ ఫీజుల దోపిడీపై సర్కార్ చేతులెత్తేసిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అటు విద్యాశాఖ, ఇటు తెలంగాణ విద్యా కమిషన్ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికలు అందించినప్పటికీ ఈ సమస్య ఇంకా కొలిక్కి రాలేదు. రాష్ట్రంలో వేసవి సెలవులు ముగిసి, మరో రెండు వారాల్లో కొత్త విద్యాసంవత్సరం ప్రారంభం కానుంది. విద్యాసంవత్సరం మొదలవుతుండటంతో ప్రైవేట్ విద్యాసంస్థలు అడ్మిషన్లు, రీ-అడ్మిషన్ల పేరుతో ఫీజుల బాదుడును అప్పుడే మొదలుపెట్టాయి. గతేడాదితో పోలిస్తే ఈసారి ఫీజులను 20 నుంచి 30 శాతం వరకు పెంచేసినట్లు తెలుస్తోంది. ట్యూషన్ ఫీజులతో పాటు బుక్స్, యూనిఫార్మ్స్, రవాణా ఖర్చుల రూపంలో వేలాది రూపాయలు డిమాండ్ చేస్తుండటంతో సామాన్య, మధ్యతరగతి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. దీంతో తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజుల నియంత్రణకు సంబంధించి విద్యాశాఖ గతంలోనే ఒక సమగ్ర నివేదికను రూపొందించి ప్రభుత్వానికి సమర్పించింది. ఫీజుల ఖరారుకు గైడ్‌లైన్స్ సైతం రూపొందించింది. స్కూళ్లలోని మౌలిక సదుపాయాలు, ఉపాధ్యాయుల జీతభత్యాలు, ఇతర ఖర్చుల ఆధారంగా గరిష్ట ఫీజు పరిమితిని నిర్ణయించాలని విద్యాశాఖ ఆ నివేదికలో సూచించింది. అంతేకాకుండా ప్రతి ఏటా ప్రైవేట్ పాఠశాలల ఆదాయ, వ్యయాలపై ఆడిటింగ్ నిర్వహించి, లాభాపేక్ష లేకుండా విద్యాసంస్థలు నడిచేలా చూడాలని ప్రతిపాదించింది. ఇదిలా ఉండగా రాష్ట్రంలో విద్యా వ్యవస్థను బలోపేతం చేసేందుకు ఏర్పాటైన తెలంగాణ విద్యా కమిషన్ సైతం ఫీజుల నియంత్రణ అంశాన్ని తీవ్రంగా పరిగణించింది. తెలంగాణ విద్యా కమిషన్ సైతం సర్కార్ కు నివేదిక అందించింది. పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటక తరహాలో తెలంగాణలోనూ ఒక ప్రత్యేక ‘ఫీజు నియంత్రణ కమిటీ’ని ఏర్పాటు చేయాలని తెలంగాణ విద్యా కమిషన్ ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. అక్రమంగా ఫీజులు వసూలు చేసే స్కూళ్ల గుర్తింపు రద్దు చేయడంతో పాటు, భారీ జరిమానాలు విధించేలా చట్ట సవరణలు చేయాలని స్పష్టం చేసింది. అయినా ఇప్పటికీ ఈ అంశంపై ఎలాంటి స్పష్టత రాలేదు.
Also Read: మోడీ స్టేడియంలో గుజరాత్ కుట్రలు..RCB గుండెల్లో రైళ్లు, ఇక సగం మ్యాచ్ దొబ్బినట్టే
విద్యాశాఖ నుంచి నివేదికలు, తెలంగాణ విద్యా కమిషన్ నుంచి బలమైన సూచనలు అందినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం దీనిపై ఎలాంటి తుది నిర్ణయం తీసుకోకపోవడం గమనార్హం. కొత్త విద్యాసంవత్సరం ముంగిట ఉన్నా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పష్టమైన జీవో కానీ.. మార్గదర్శకాలు కానీ విడుదల కాలేదు. ప్రైవేట్ యాజమాన్యాల ఒత్తిళ్లకు తలొగ్గి ప్రభుత్వం ఈ విషయాన్ని పక్కన పెట్టిందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అధికారుల ఉదాసీనత వల్లే ఫీజుల దోపిడీకి అడ్డుకట్ట పడటం లేదని విద్యా రంగా నిపుణులు మండిపడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వ తీరు చూస్తుంటే సర్కార్ ఈ అంశంపై చేతులెత్తేసినట్లుగానే ఉందంటూ విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వం తక్షణమే స్పందించి ప్రత్యేక ఆర్డినెన్స్ లేదా జీవో ద్వారా ఫీజుల నియంత్రణ కమిటీని అమలు చేయాలని విద్యార్థి సంఘాలు, బహుజన సంఘాలు మరియు పేరెంట్స్ అసోసియేషన్లు డిమాండ్ చేస్తున్నాయి. లేదంటే ఈ విద్యాసంవత్సరం కూడా ప్రైవేట్ స్కూళ్ల యాజమాన్యాలదే రాజ్యంగా మారి, సామాన్యుడికి చదువు మరింత దూరం కాక తప్పదని పలువురు భావిస్తున్నారు. ఇప్పటికైనా రాషట్ర ప్రభుత్వం స్పందించి ఈ నిర్ణయంపై స్పష్టత ఇస్తుందా? లేదా అనేది చూడాలి.
Also read: ఎన్ని కష్టాలొచ్చినా ఎందుకు కొందరు భయపడరు.. చాణక్యుడు ఇందుకు చెప్పిన కారణాలు ఇవే