రియల్ ఎస్టేట్ కంపెనీల నిర్లక్ష్యం, లాభార్జనే ధ్యేయంగా కొంతమంది యజమానులు చేసే మోసాలతో ఎంతోమంది బాధితులుగా మారుతుంటారు. రూపాయి రూపాయి పోగేసి సొంత ఇంటి కలను నెరవేర్చుకోవాలనుకునేవారు ఆయా సంస్థలు చేసే మోసంతో విలవిల్లాడుతుంటారు. అలాంటి వారికి తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (RERA) అండగా నిలుస్తోంది. తాజాగా ఇద్దరు బాధితులకు ఊరటనిచ్చేలా రెరా నిర్ణయం తీసుకుంది. వారిని ఇబ్బంది పెట్టిన ఆశ్రిత గ్రూప్ ని మందలించడంతోపాటు బాధితులకు న్యాయం జరిగేలా ఉత్తర్వులిచ్చింది. అంతే కాదు ఆశ్రిత గ్రూప్ కి భారీ జరిమానా కూడా విధించింది. ఇటీవల కాలంలో రెరా ఇచ్చిన ఉత్తర్వుల్లో ఇవి అత్యంత కీలకమైనవిగా భావిస్తున్నారు.
అసలేం జరిగింది..?
HMDA ఆమోదంతో జూబ్లీహిల్స్ లో ‘జ్యువెల్స్ కౌంటీ’ అనే ప్రాజెక్ట్ ని ప్రారంభించింది ఆశ్రిత గ్రూప్. RERAలో కూడా ఈ ప్రాజెక్ట్ ని నమోదు చేయించారు. ఈ భారీ అపార్ట్ మెంట్ లో మియాపూర్ కి చెందిన బోడే శ్రీనివాసులు, సి.మల్లేశ్వరి నందిరెడ్డి అనే ఇద్దరు కూడా ప్లాట్ లు కొనుగోలు చేయాలనుకున్నారు. 2021లో సేల్ అగ్రిమెంట్ కూడా రాసుకున్నారు. ఆశ్రిత గ్రూప్ బ్రాండ్ ఇమేజ్ తో వారు సంతోషపడ్డారు. సమయానికి తమకు ఫ్లాట్ లు అప్పగిస్తారని ఆశించారు. కానీ ఆ తర్వాత వ్యవహారం తేడాకొట్టింది. మిగిలిన అందరికీ ఫ్లాట్ లు అందించిన ఆశ్రిత గ్రూప్ ఈ ఇద్దరి విషయంలో కొర్రీలు పెట్టింది. ఫిర్యాదుదారులు చెల్లింపుల్లో డిఫాల్ట్ అయ్యారంటూ అగ్రిమెంట్లు క్యాన్సిల్ చేసింది. దీంతో వారిద్దరూ రెరాని ఆశ్రయించారు. చెల్లింపుల విషయంలో ఆశ్రిత గ్రూప్ యాజమాన్యం గందరగోళం సృష్టించిందని, తమకు అన్యాయం జరిగిందని వారు ఫిర్యాదు చేశారు. దీంతో రెరా విచారణ చేపట్టింది.
ఆశ్రిత గ్రూప్ వాదన ఏంటి..?
ఫిర్యాదుదారులు ఇద్దరూ చెల్లింపులు ఆలస్యం చేశారని, డిఫాల్ట్ అయ్యారని ఆశ్రిత గ్రూప్ వాదించింది. అందుకే వారి అగ్రిమెంట్లు క్యాన్సిల్ చేశామని చెప్పింది. అంతే కాదు. వారు చెల్లించిన సొమ్ము వాపసు ఇచ్చామని ఇక వారితో తమకు ఎలాంటి సంబంధం లేదని అంటోంది. వారికి నష్టపరిహారం కూడా ఇవ్వాల్సిన పని లేదన్నది. కానీ రెరా ఈ విషయంలో పూర్తి స్థాయి విచారణ జరిపి బాధితుల పక్షాన న్యాయం ఉన్నట్టు తేల్చింది. నిబంధనలను గౌరవించడంలో బిల్డర్ విఫలమయ్యారని నిర్థారించింది. బాధితులకు వెంటనే రెండు ఫ్లాట్లు బదిలీ చేయాలని ఆశ్రిత గ్రూప్ కి సూచించింది. TG RERA 2016 RE(R&D) చట్టంలోని సెక్షన్ 11(5) ప్రకారం అశ్రిత గ్రూప్ కి కీలక ఆదేశాలిచ్చింది. అంగీకరించిన ప్రకారం బాధితులు పూర్తిగా చెల్లింపులు జరిపిన తర్వాత వారికి కేటాయించిన ఫ్లాట్ లను రిజిస్టర్ చేయాలని చెప్పింది. అదే సమయంలో ఆశ్రిత గ్రూప్ కి భారీ జరిమానా కూడా విధించింది రెరా. రూ.3 లక్షల రూపాయల పెనాల్టీ చెల్లించాలని ఆదేశించింది.
రెరా ఉత్తర్వులతో బాధితులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 2021లో ఒప్పందం చేసుకున్నా తమను వివిధ కారణాలతో ఇబ్బంది పెట్టారని, చివరకు ఫ్లాట్ లు కేటాయించకుండా మానసికంగా వేధించారని అన్నారు. ఒప్పందం రద్దు చేస్తామని తమను పలుమార్లు వారు బెదిరించారని, చివరకు రద్దు చేశారని ఆరోపించారు. రెరా ఉత్తర్వులు తమకు ఊరటనిచ్చాయని వారు చెబుతున్నారు.