Indoor Plants: మీ ఇంటిని కేవలం నివాస స్థలంగా కాకుండా, సంపద, సానుకూలత, మంచి శక్తిని ఆకర్షించే పవిత్ర స్థలంగా మార్చాలని అనుకుంటున్నారా ? అయితే కొన్ని రకాల ఇండోర్ ప్లాంట్స్ మీ కలలను నెరవేరుస్తాయి. ఇవి కేవలం ఇంటి అందాన్ని పెంచడమే కాకుండా, వాస్తు, ఫెంగ్ షుయ్ సూత్రాల ప్రకారం శ్రేయస్సును, ఆనందాన్ని మీ దరికి చేర్చుతాయి. 20 రకాల ఇండోర్ ప్లాంట్స్ పెంచడం ద్వారా ప్రకృతిలోని పచ్చదనాన్ని మీ ఇంట్లోకి ఆహ్వానించడం మాత్రమే కాకుండా ఇంట్లో డబ్బుకు లోటు లేకుండా ఉండొచ్చు. ఇంతకీ ఆ మొక్కలు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.
సంపద, అదృష్టాన్ని అందించే మొక్కలు:
లక్కీ బాంబూ : ఇది దీర్ఘాయువు, ఆరోగ్యం, సంపదకు ప్రతీకగా చెబుతారు. ఈ మొక్క యొక్క కాండాల సంఖ్యను బట్టి ప్రయోజనాలు లభిస్తాయని నమ్ముతారు. ఉదాహరణకు, 3 సంపద, ఆరు అదృష్టం, ఏడు ఆరోగ్యాన్ని సూచిస్తాయని చెబుతారు. ఈ మొక్కలను ఇంటికి తూర్పు దిశలో ఉంచడం శ్రేయస్కరం.
మనీ ప్లాంట్ : పేరులోనే సంపదను సూచించే ఈ మొక్కను ఇంటికి అదృష్టాన్ని తెచ్చేదిగా నమ్ముతారు. ఇది ఆకుపచ్చని ఆకులతో, తీగలాగా పెరుగుతుంది. దీనిని ఇంటి ఆగ్నేయ దిశలో ఉంచడం ద్వారా ఆర్థిక వృద్ధి ఉంటుందని నమ్ముతారు. ఇంట్లోని గాలి నాణ్యతను పెంచడంలో కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది.
జాస్మిన్ : జాస్మిన్ ఇంటికి సంపదను తెస్తుందని నమ్ముతారు. బాల్కనీ, కిటికీలు, పూజా స్థలాల్లో ఈ మొక్కలు పెంచడం మంచిది. జాస్మిన్ యొక్క వాసన ఆందోళనను తగ్గిస్తుందని పలు అధ్యయనాల్లో కూడా రుజువైంది. మానసిక స్థితిని మెరుగుపరచడంలో కూడా జాస్మిన్ ఉపయోగపడుతుంది.
స్నేక్ ప్లాంట్ : ఇది ఇంట్లో నుంచి విష వాయువులను తొలగించి, సానుకూల శక్తిని పెంచుతుంది. రాత్రిపూట ఆక్సిజన్‌ను విడుదల చేస్తుంది. ఫలితంగా మెరుగైన ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది.
తులసి: హిందూ సంప్రదాయంలో తులసికి ప్రత్యేక స్థానం ఉంది. ఇది కేవలం ఔషధ గుణాలను కలిగి ఉండటమే కాకుండా.. ఇంట్లో సానుకూల శక్తిని, ఆధ్యాత్మిక వాతావరణాన్ని సృష్టిస్తుందని నమ్ముతారు. దీనిని ఇంటి ముందు భాగంలో లేదా తూర్పు దిశలో ఉంచడం శ్రేయస్కరం.
సిట్రస్ ట్రీ : కుండీలలో పెంచే నిమ్మ, నారింజ వంటి సిట్రస్ మొక్కలు ఇంట్లోకి అదృష్టాన్ని, సంపదను ఆకర్షిస్తాయని ఫెంగ్ షుయ్ చెబుతుంది. పండ్లతో నిండిన మొక్కలు సమృద్ధికి ప్రతీకగా భావిస్తారు.
రబ్బర్ ప్లాంట్ : ఇది సంపదను, శ్రేయస్సును సూచించే మొక్క. దీని గుండ్రని ఆకులు అదృష్టాన్ని, సమృద్ధిని ఆకర్షిస్తాయని నమ్ముతారు. ఇది గాలిని శుభ్రపరచడంలో కూడా సహాయపడుతుంది.
పోథోస్ : మనీ ప్లాంట్ లాగానే పోథోస్ కూడా అదృష్టాన్ని, సంపదను ఆకర్షిస్తుందని నమ్ముతారు. ఇది చాలా సులభంగా, తక్కువ వెలుతురులో కూడా పెరుగుతుంది.
అలోవెరా : అలోవెరా ఔషధ గుణాలతో పాటు, ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తులను దూరం చేసి, సానుకూల శక్తిని ఆకర్షిస్తుందని నమ్ముతారు.
ఆఫ్రికన్ వయోలెట్ : ఈ మొక్క ఇంట్లో ఐశ్వర్యాన్ని, సంపదను ఆకర్షిస్తుందని చెబుతారు. దీని చిన్న, గుండ్రని ఆకులు సంపదకు ప్రతీకలుగా భావిస్తారు.
క్రిస్మస్ క్రాక్టస్ : ఇది దీర్ఘాయువు, సంపదను ఆకర్షిస్తుందని నమ్ముతారు. ప్రత్యేకించి ఇది పూలు పూసినప్పుడు అద్భుతమైన ప్రయోజనాలను అందిస్తుందని చెబుతారు .
ఆర్కిడ్స్ : ఆర్కిడ్స్ ప్రేమ, అందం, సంపద, సంతానోత్పత్తికి ప్రతీకలు. ఇవి ఇంట్లో సానుకూల శక్తిని నింపుతాయి.
స్పైడర్ ప్లాంట్ : స్పైడర్ ప్లాంట్ గాలిని శుభ్రపరచడంలో అద్భుతంగా పనిచేస్తుంది. ఇది ఇంట్లో సానుకూల శక్తిని ప్రోత్సహిస్తుంది. అంతే కాకుండా ప్రశాంతమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది.
రోజ్మేరీ : రోజ్మేరీ మెదడు పనితీరును మెరుగుపరుస్తుందని, మానసిక ఒత్తిడిని తగ్గిస్తుందని నమ్ముతారు. ఇంట్లో దీని సువాసన సానుకూలతను పెంచుతుంది.
ఫిలోడెండ్రాన్ : ఫిలోడెండ్రాన్ మొక్కలు ప్రేమ, సమృద్ధిని ఆకర్షిస్తాయని నమ్ముతారు. ఇవి తక్కువ నిర్వహణతో ఇంట్లో పచ్చదనాన్ని అందిస్తాయి.
Also Read: తరచూ అబద్ధాలు చెప్పే వారికి నరకంలో పడే శిక్ష ఇదే, వింటేనే భయం పుడుతుంది
స్విస్ ఛీజ్ ప్లాంట్ : ఈ మొక్క ఇంట్లో శ్రేయస్సును, వృద్ధిని సూచిస్తుంది. దీని ప్రత్యేకమైన ఆకులు ఆకర్షణీయంగా ఉంటాయి.
క్లోవర్ : నాలుగు ఆకుల క్లోవర్ అదృష్టానికి ప్రతీకగా ప్రపంచ వ్యాప్తంగా నమ్ముతారు. చిన్న కుండీలలో క్లోవర్ మొక్కలను పెంచడం మంచిది.
బేసిల్ : తులసి లాగానే బేసిల్ కూడా సానుకూలతను ఆకర్షించి, చెడు శక్తులను దూరం చేస్తుందని నమ్ముతారు. ఇది జీర్ణక్రియకు కూడా మంచిది.
తామర : బురదలో నుంచి అద్భుతంగా వికసించే తామర పువ్వు పవిత్రత, జ్ఞానం , జ్ఞానోదయానికి ప్రతీక. చిన్న కుండీలలో లేదా ఇండోర్ వాటర్ గార్డెన్‌లో తామరను పెంచడం ఇంటికి సానుకూల శక్తిని ఆకర్షిస్తుంది.
జేడ్ ప్లాంట్ : ‘డాలర్ ప్లాంట్’ అని కూడా పిలువబడే జేడ్ ప్లాంట్ సంపదను, శ్రేయస్సును ఆకర్షిస్తుందని నమ్ముతారు. దీని గుండ్రని, మందపాటి ఆకులు నాణాలను పోలి ఉంటాయి. దీనిని ఇంటి ప్రవేశ ద్వారం వద్ద లేదా ఆగ్నేయ దిశలో ఉంచడం మంచిది.