CM Revanth Reddy: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి వైపు దూసుకెళ్తోంది. రేవంత్ సర్కార్ అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేస్తూ.. గొప్ప పథకాలను అమలు చేస్తున్నారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అన్ని హామీలను అమలు చేస్తు ప్రజా ప్రభుత్వం ముందుకెళ్తోంది. గొప్ప గొప్ప పథకాలను అమలు చేస్తోంది. మహాలక్ష్మీ పథకం తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ఒక ప్రతిష్టాత్మక కార్యక్రమం. దీని కింద మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణిస్తున్న విషయం తెలిసిందే..
పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో రాష్ట్రవ్యాప్తంగా ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తారు. ఆధార్ కార్డు లేదా ఇతర గుర్తింపు కార్డు చూపించి జీరో టికెట్‌తో బస్సు్ల్లో ప్రయాణించవచ్చు. ఈ పథకం ద్వారా 2025 జూలై వరకు 200 కోట్ల జీరో టికెట్ల మైలురాయిని దాటింది. రోజుకు సగటున 30 లక్షల మంది ఈ సౌకర్యాన్ని వినియోగిస్తున్నారు. ఈ పథకం రాష్ట్రంలో విజయవంతంగా అమలు చేస్తున్నారు. పేద మహిళలు ఉచిత బస్సు ప్రయాణాన్ని వినియోగించుకుని ఉద్యోగాలు కూడా చేస్తున్నారు. ఈ పథకం మహిళల ఆర్థిక భారాన్ని తగ్గించి, వారి సాధికారతకు దోహదపడుతోంది. 200 కోట్ల జీరో టికెట్ మైలు రాయిని దాటిన విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు.
18 నెలల ప్రజా పాలనలో…
200 కోట్ల జీరో టికెట్ల మైలురాయిని దాటి…
ఆడబిడ్డల ఉచిత బస్సు ప్రయాణ పథకం
విజయవంతంగా కొనసాగుతుండటం…
ఆనందంగా ఉంది…
ఈ పథకంలో లబ్ధిదారులైన…
ప్రతి ఆడబిడ్డకు నా అభినందనలు.
ఈ పథకాన్ని…
దిగ్విజయంగా అమలు చేయడంలో…
భాగస్వాములైన…
ఆర్టీసీ కార్మికులు, సిబ్బంది,
యాజమాన్యానికి
ప్రత్యేక అభినందనలు… అని సీఎం రేవంత్ రెడ్డి ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.
ఇప్పటి వరకు మొత్తం 200 కోట్ల మంది మహిళలు ఉచిత ప్రయాణ సదుపాయాన్ని ఉపయోగించుకున్నారని తెలంగాణ ఆర్టీసీ కూడా తెలిపింది. రాష్ట్రంలో ఈ ఉచిత ప్రయాణాల విలువ మొత్తంగా రూ.6,700 కోట్లుగా నమోదు అయినట్లు వెల్లడించింది. ఉచిత బస్సు సేవలు కొనసాగించేందుకు అవసరమైన నిధులను తెలంగాణ ప్రభుత్వం ఎప్పటికప్పుడు విడుదల చేస్తోందని పేర్కొంది. 200 కోట్ల జీరో టికెట్ మైలు రాయిని దాటిన సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను కీలక ఆదేశాలు జారీ చేశారు. రేపు రాష్ట్రవ్యాప్తంగా 97 ఆర్టీసీ డిపోలలో, 341 బస్ స్టేషన్‌లలో వేడుకలు నిర్వహించాలని ఆదేశించారు.
ALSO READ: Heavy Rain: రెడ్ అలర్ట్.. రాష్ట్రంలో అత్యంత భారీ వర్షాలు.. పిడుగుల వాన కమ్ముకొస్తోంది..