Hyderabad News: దాదాపు దశాబ్దం తర్వాత తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రయాణికులకు షాక్ ఇచ్చింది.గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వివిధ రకాల బస్‌పాస్‌ల ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. పెంచిన ఛార్జీలు సోమవారం (జూన్ 9) నుంచి అమల్లోకి రానున్నాయి. సాధారణ ప్రయాణికులతోపాటు విద్యార్థుల బస్సు పాస్‌ల ధరలు పెరిగాయి.
పెట్రోలు, డీజిల్ ధరల పెరుగుదల, ఇతర ఖర్చుల వంటి కారణాలతో తెలంగాణ ఆర్టీసీ ఆర్థికంగా ఒత్తిడిని ఎదుర్కొంటోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆదాయాన్ని పెంచుకోవాలని నిర్ణయించింది. ఈ క్రమంలో బస్ పాస్ రేట్లను దాదాపు 20 శాతం పెంచింది. ఈ పెంపు తక్షణమే అమల్లోకి రానుంది. 2016 తర్వాత గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పెంపు ఇదేసారి.
పెరిగిన ఛార్జీల ధరలు మధ్యతరగతి వర్గంపై తీవ్ర ప్రభావం పడనుంది. సాధారణ ప్రయాణికులు ఆర్డినరీ బస్‌పాస్ ధర నెలకు ఇప్పటివరకు రూ. 1,150 ఉండేది. పెరిగిన రేట్లతో దీన్ని రూ. 1,400కు పెంచారు. ఇక మెట్రో ఎక్స్‌ప్రెస్ పాస్ ధర ఒకప్పుడు నెలకు రూ. 1,300 కాగా, పెరిగిన రేట్లతో ఇప్పుడు రూ.1,600కు చేరింది. మెట్రో డీలక్స్ పాస్ ధర రూ. 1,450 కాగా, తాజాగా రేట్లతో రూ. 1,800కు చేరింది.
ధరల పెంపుతో ప్రజల్లో అసంతృప్తి మొదలైంది. ఇప్పటికే ఖర్చులు పెరిగాయని, దీనికి బస్సు ఛార్జీలు తోడయ్యాయని వాపోతున్నారు సామాన్యులు. ప్రస్తుతం పరిస్థితుల్లో ప్రజలపై భారం తగ్గించేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి కోరుతున్నారు. బస్ పాస్‌లపై తిరిగి పునరాలోచన చేయాలని ప్రయాణికులు, విద్యార్థులు, ఉద్యోగులు కోరుతున్నాయి.
ALSO READ: జస్ట్ 40 మినిట్స్.. హరీష్ రావు చాప్టర్ క్లోజ్
బస్సు పాస్ ధరలు పెరగడం వల్ల లక్షలాది మంది సామాన్య ప్రయాణికులకు భారం కానుంది. ధరల పెంపును వెంటనే ఉపసంహరించాలని డిమాండ్ చేస్తున్నారు సామాన్యులు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వినియోగించే అన్ని రకాల బస్సు పాస్‌ల ధరలను టీజీ ఆర్టీసీ సవరించింది.
ఇటీవల హైదరాబాద్ మెట్రో టిక్కెట్ ధరను పెంచింది. ఏడేళ్ల తర్వాత ధరల పెంపును ఎల్ అండ్ టీ మెట్రో రైల్ లిమిటెడ్ మే 17న అమల్లోకి వచ్చింది. తొలుత 20 శాతం టిక్కెట్ ధరలను పెంచిన ఎల్ అండ్ టీ, ఆ తర్వాత 10 శాతం తగ్గించిన విషయం తెల్సిందే.