TGTET Results: తెలంగాణ టెట్ ఫలితాలను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి యోగిత ఫలితాలను విడుదల చేశారు. గత ఏడాది నవంబర్ 4వ తేదీన టెట్ పరీక్ష నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ ఏడాది జనవరి 2 వ తేదీ నుండి 20వ తేదీ వరకు 20 సెషన్ లలో ఆన్లైన్ విధానం ద్వారా పరీక్షలను ప్రభుత్వం పకడ్బందీగా నిర్వహించింది. త్వరలో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన నేపథ్యంలో, అభ్యర్థులు పెద్ద ఎత్తున టెట్ పరీక్షలో పాల్గొనేందుకు ఆసక్తి చూపారు.
సాధారణంగా టెట్ పరీక్షలో అర్హత సాధించిన వారే డీఎస్సీ పరీక్షకు అర్హులుగా పరిగణించబడతారు. అందుకే టెట్ పరీక్షలు రాసేందుకు తెలంగాణకు చెందిన అభ్యర్థులు ఆసక్తి చూపడంతో, పరీక్షలకు అభ్యర్థులు భారీగానే హాజరయ్యారు. మొత్తం 2,75,753 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. అందులో 2,05,278 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు.
Also Read: Pawan Kalyan: రేపటి కేబినెట్ సమావేశానికి పవన్ గైర్హాజరు.. కారణం ఇదే!
పేపర్ – 1 పరీక్షను 8 సెషన్ లలో ఏడు భాషలలో నిర్వహించారు. పేపర్ – 2 పరీక్షను 12 సెషన్ లలో ఏడు భాషల్లో నిర్వహించినట్లు పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. పేపర్ – 1 పరీక్షకు సంబంధించి 69,476 మంది పరీక్షకు హాజరు కాగా.. 41,327 మంది అర్హత సాధించగా 59.48 శాతం ఉత్తీర్ణత సాధించారు. అలాగే పేపర్ – 2 పరీక్షకు సంబంధించి మొత్తం 1,35,802 మంది హాజరు కాగా 42,384 మంది ఉత్తీర్ణత సాధించగా 31.21 శాతం అర్హత సాధించినట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ ఫలితాలను అభ్యర్థులు http://schooledu.telangana.gov.in వెబ్ సైట్ లో చూసుకునే అవకాశాన్ని కల్పించినట్లు పాఠశాల విద్యాశాఖ తెలిపింది. అలాగే టెట్ ఉత్తీర్ణత సాధించిన వారికి ప్రభుత్వం అభినందనలు తెలిపింది.
తెలంగాణ TET ఫలితాలు విడుదల
పేపర్ – 1లో 59.48%, పేపర్-2లో 31.21% అర్హత సాధించిన అభ్యర్థులు pic.twitter.com/3aqulooE7K
— BIG TV Breaking News (@bigtvtelugu) February 5, 2025