MeeSeva: రాష్ట్రంలోని ప్రతి మీ సేవా కేంద్రాన్ని డిజిటల్ మార్కెటింగ్ హబ్‌గా తీర్చిదిద్దనున్నట్లు మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తెలిపారు. స్థానిక వ్యాపారులకు డిజిటల్ ప్రచార అవకాశాలను చేరువ చేయడమే లక్ష్యంగా మీ సేవా–మెటా సంయుక్త కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తున్నట్లు తెలిపారు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఓ హోటల్‌లో బుధవారం మీ సేవా డిజిటల్ మార్కెటింగ్ శిక్షణ రెండో దశ కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి 140 మందికి పైగా మీ సేవా విలేజ్ లెవల్ ఎంటర్‌ప్రెన్యూర్లు (వీఎల్‌ఈలు) హాజరుకాగా ‘డిజిటల్ బిజినెస్ అంబాసిడర్లుగా’ ప్రత్యేక శిక్షణ ఇచ్చారు.
ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ కొత్త సాంకేతికతను స్వీకరించడంలో తెలంగాణ ఎప్పుడూ ముందుంటుందన్నారు. సమర్థవంతమైన పౌర సేవలను అందించడంలో రాష్ట్రం ప్రత్యేక గుర్తింపు సాధించిందని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 5 వేలకు పైగా మీ సేవా కేంద్రాలు ఉన్నాయని వివరించారు. వీటి ద్వారా స్వీట్ షాపుల నుంచి టెక్స్ టైల్ స్టోర్స్, నైపుణ్య వృత్తిదారులు, ఇతర చిన్న వ్యాపారులకు డిజిటల్ మార్కెటింగ్ అవకాశాలను చేరువ చేయవచ్చని వెల్లడించారు.
వ్యాపారులు తమ ఆదాయాన్ని పెంచుకునేందుకు ఈ సేవ ఉపయోగపడుతుందని మంత్రి స్పష్టం చేశారు. మీ సేవా కేంద్రాలు పౌర సేవలకే పరిమితం కాకుండా ప్రజలకు డిజిటల్ అవగాహన కల్పించి ఆదాయ అవకాశాలను పెంచే వేదికలుగా మారాలని తెలిపారు. కొత్త ఆలోచనలు, సేవలు, వ్యాపార అవకాశాలను తెలంగాణ ఎప్పుడూ స్వాగతిస్తుందని వెల్లడించారు. ప్రజల ఆదాయం, దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధికి ఇవి దోహదపడతాయని తెలిపారు.శిక్షణ పొందిన వీఎల్‌ఈలు తమ జిల్లాల్లో ‘డిజిటల్ బిజినెస్ అంబాసిడర్లుగా’ పనిచేస్తారన్నారు.
Also Read: ఫిలిప్స్ నుంచి అదిరిపోయే 5G ఫోన్.. ఫీచర్లు చూస్తే వావ్ అనాల్సిందే!
అంతకుముందు ఎలక్ట్రానిక్ సర్వీస్ డెలివరీ (ఈఎస్‌డీ), ఐటీ అండ్ సీ శాఖ, మెటా సంస్థ మధ్య మంత్రి సమక్షంలో అవగాహన ఒప్పందం కుదిరింది. మీ సేవా డిజిటల్ మార్కెటింగ్ కార్యక్రమంలో రెండు సంస్థల భాగస్వామ్యం అధికారికంగా ప్రారంభమైంది. స్థానిక వ్యాపారులు మీ సేవా ద్వారా నేరుగా డిజిటల్ మార్కెటింగ్ సహాయం కోరేలా పోర్టల్ ను మంత్రి శ్రీధర్‌బాబు ప్రారంభించారు. meeseva.telangana.gov.in, టోల్‌ఫ్రీ నంబర్లు 1100 / 1800-425-1110 ప్రకటించారు. ఈ సేవతో వ్యాపారులకు అందుబాటు ధరల్లో డిజిటల్ మార్కెటింగ్ అవకాశాలు లభిస్తాయని, వినియోగదారులు తమ ప్రాంతంలోని ఉత్పత్తులు, సేవలను సులభంగా గుర్తించగలుగుతారని అన్నారు. వీఎల్‌ఈలకు అదనపు ఆదాయ మార్గం ఏర్పడుతుందని, రాష్ట్రంలో డిజిటల్ వ్యాపార వ్యవస్థ మరింత బలోపేతం కానుందన్నారు.
Also Read: నేపాల్ విపత్తు.. ఈషా ఫౌండేషన్‌కు చెందిన 77 మంది భక్తుల గల్లంతు