TG Heavy Rains: తెలంగాణ వ్యాప్తంగా జోరందుకున్న వర్షాలు. హైదరాబాద్ సహా అన్ని జిల్లాల్లో విస్తారంగా వానలు పడుతున్నాయి. రెండు, మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు వాగులు పొంగిపొర్లుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా చెరువులు మత్తళ్లు దుంకుతున్నాయి. వరద ప్రవాహం పెరుగుతుండటంతో ప్రాజెక్టులకు నిండుకుండలా మారాయి. మరో ఐదు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణశాఖ తెలిపింది. ఇవాళ, రేపు తెలంగాణ మొత్తానికి రెడ్ అలర్ట్ జారీ చేసింది. కొద్ది సమయంలోనే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో తెలంగాణలో భారీ వర్షాలు పడనున్నాయని, మరో ఐదు రోజులపాటు భారీ వర్షాలకు తోడు అతి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. వచ్చే రెండ్రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, నార్త్ హైదరాబాద్, సికింద్రాబాద్ వైపు ఏకంగా 20 సెంటిమీటర్ల వర్షం పడే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఇవాళ, రేపు కూడా సిటీకి భారీ వర్ష సూచనతో జీహెచ్ఎంసీ, జల మండలి, విద్యుత్, హైడ్రా లాంటి సిబ్బంది అన్ని క్యాటగిరీలకు సెలవులు రద్దు చేస్తూ కమిషనర్ కర్ణన్, కలెక్టర్ హరిచందన ఆదేశాలు జారీ చేశారు.
ఇప్పటికే రుతుపవన ద్రోణి, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో వర్షాలు దంచికొడుతున్నాయి. వీటికి తోడు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. మరో 24 గంటల్లో అల్పపీడనం.. మరింత బలపడే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇవాళ జీహెచ్ఎంసీ పరిధిలో రెడ్ అలర్ట్.. రేపు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. తెలంగాణలో ఐదు రోజుల పాటు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, ఉత్తర తెలంగాణలో 17న వర్ష తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని వెల్లడించింది.
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కరవనున్నాయి. ములుగు, కొత్తగూడెం జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు ఇచ్చారు. అక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఓవరాల్ గా రాష్ట్ర వ్యాప్తంగా మరో మూడు రోజులు వర్షాలు దంచికొట్టనున్నాయి. జనాలు అత్యవసరం అయితే తప్ప బయటకు రాకూడదని వాతావరణ శాఖ అధికారులు వార్న్ చేస్తున్నారు. తెలంగాణలో మరో రెండు రోజులు అత్యంత భారీ వర్షాలు నమోదు కానున్నాయి.
నిన్న తెలంగాణ వ్యాప్తంగా గ్యాప్ లేకుండా కుండపోత వర్షం కురిసింది. దీంతో హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో భారీ వర్షపాతం నమోదైంది. చెరువులు, వాగులు, వంకలు పొంగి పొర్లడంతో రాకపోకలు స్తంభించి పోయాయి. పల్లె, పట్టణమనే తేడా లేకుండా చాలా చోట్ల రోడ్లు, కాలనీల పైకి వరద నీరు చేరడంతో జనజీవనం అతలాకుతలమైంది. ప్రధానంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో జోరు వాన కురిసింది.
దీంతో మంచిర్యాల జిల్లా కన్నె పల్లిలో అత్యధికంగా 23.3 సెంమీ. వర్షపాతం నమోదైంది. భీమిని 22.6, రెబ్బెనలో 22 సెంమీ. వర్షం పడింది. ఉత్తర తెలంగాణలో 17వ తేదీన వర్షపాతం అధికంగా ఉండే అవకాశం ఉందని వెల్లడించారు. మెదక్, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కరుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించడంతో ఆ జిల్లాల్లో గురువారం ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలన్నిటికీ సెలవు ప్రకటిస్తూ విద్యాశాఖ ప్రధాన అధికారి డాక్టర్ నవీన్ నికోలస్ ఉత్తర్వులు జారీ చేశారు.