Organ Donation: తెలంగాణ రాష్ట్రం అవయవ దానంలో దేశంలో మొదటి స్థానంలో నిలిచింది, 2024లో ప్రతి 10 లక్షల జనాభాకు 4.88 అవయవ దానాల సగటుతో జాతీయ సగటు 0.8 కంటే గణనీయంగా ఎక్కువ సాధించింది. ఈ విశేష కృషికి గుర్తింపుగా.. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా ఢిల్లీలో జరిగిన 15వ జాతీయ అవయవ దాన దినోత్సవంలో తెలంగాణ జీవన్‌దాన్ కార్యక్రమ ప్రతినిధులకు జాతీయ అవార్డును అందజేశారు. ఈ కార్యక్రమాన్ని నేషనల్ ఆర్గాన్ అండ్ టిష్యూ ట్రాన్స్‌ప్లాంట్ ఆర్గనైజేషన్ (NOTTO) నిర్వహించింది.
జీవన్‌దాన్ కార్యక్రమం 2012లో ఏకీకృత ఆంధ్రప్రదేశ్‌లో ప్రారంభమైంది. అంతేకాకుండా తెలంగాణ ఏర్పాటు తర్వాత కూడా దీనిని కొనసాగించారు. 2024లో, 188 మంది బ్రెయిన్-డెడ్ డోనర్ల నుంచి 725 మందికి అవయవ మార్పిడి ద్వారా జీవన రక్షణ జరిగిందని చెప్పారు. జనవరి నుంచి జులై 2024 వరకు, 103 మంది డోనర్ల నుంచి 421 అవయవాలు (170 కిడ్నీలు, 100 లివర్లు, 15 హృదయాలు, 94 కార్నియాలు, 42 ఊపిరితిత్తులు) సేకరించబడ్డాయి. 2013 నుంచి జులై 2024 వరకు, జీవన్‌దాన్ 1,465 మంది డోనర్ల నుంచి 5,541 అవయవాలు, కణజాలాలను సేకరించి, 550 ఉచిత అవయవ మార్పిడులను ఆరోగ్యశ్రీ పథకం కింద నిర్వహించిందని తెలిపారు.
తెలంగాణ ప్రభుత్వం ట్రాన్స్‌ప్లాంటేషన్ ఆఫ్ హ్యూమన్ ఆర్గాన్స్ అండ్ టిష్యూస్ యాక్ట్ (THOTA)ని అమలు చేసి, ఆర్థిక స్థితితో సంబంధం లేకుండా అవయవాల సమాన పంపిణీని నిర్దారించింది. రాష్ట్రంలో 40 ఆసుపత్రులు, నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (NIMS), ఉస్మానియా జనరల్ హాస్పిటల్, గాంధీ హాస్పిటల్ వంటి ప్రభుత్వ ఆసుపత్రులతో సహా, కాడవర్ ట్రాన్స్‌ప్లాంటేషన్‌లకు అధికారం కలిగి ఉన్నాయి. NIMS 452 ట్రాన్స్‌ప్లాంటేషన్‌లతో అగ్రస్థానంలో ఉంది.
Also Read: ఉద్యమ నేత, మాజీ సీఎం కన్నుమూత
ఈ విజయం వెనుక ఆసుపత్రి నిర్వహణ, ట్రాన్స్‌ప్లాంట్ కోఆర్డినేటర్లు, ఆరోగ్య సిబ్బంది, NGOలు, డోనర్ కుటుంబాల కృషి ఉంది. తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఈ గుర్తింపుపై హర్షం వ్యక్తం చేస్తూ, బ్రెయిన్ డెత్ సందర్భాల్లో అవయవ దానం కోసం ప్రజలను ప్రోత్సహించారు. ఈ కార్యక్రమం దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తూ, అవయవ దానం పట్ల అవగాహనను పెంచడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి.