Telangana Tourism: స్వేచ్ఛ బ్యూరో: టూరిజం డెవలప్ మెంట్ కార్పొరేషన్ లో గందరగోళ పరిస్థితి నెలకొంది. అభివృద్ధి పనులను పక్కనబెట్టి రాజకీయాలకే ప్రాధాన్యం ఇస్తున్నారనే ప్రచారం జరుగుతుంది. సాపీగా సాగుతుందనుకున్న సమయంలోనే కార్పొరేషన్ లో ఈడీగా పనిచేస్తున్న వ్యక్తిని బదిలీ చేయడం, ఆ స్థానం కోసం ఇద్దరు అధికారులు పోటీ పడుతుండం, వారికి శాఖ ఉన్నతాధికారులు ఒకరికి, మరొకరికి శాఖ మంత్రికి సంబంధించిన వారు సపోర్టు చేస్తుండటంతో రసవత్తరంగా మారింది. ఇప్పటికేశాఖ ఈడీగా పనిచేసిన వ్యక్తిపై ఆరోపణలు ఉన్నాయి.. మరో వ్యక్తిపైనా సరిగ్గా పనిచేయడానికి వ్యక్తిగతంగానే ప్రాధాన్యత ఇస్తారనే విమర్శలు ఉన్నాయి. అయితే ఎవరికి పోస్టింగ్ ఇస్తారు.. వీరుకాకుండా మరోవ్యక్తిని నియమిస్తారా? అనేది ఉద్యోగుల్లోనే తీవ్ర చర్చజరుగుతుంది.
తెలంగాణ టూరిజంశాఖ ఇప్పుడిప్పుడే అభివృద్ధి జరుగుతుంది. పేరు వస్తుంది. పర్యాటకుల సంఖ్య సైతం పెరిగింది. అయితే శాఖలో మాత్రం గందరగోళ పరిస్థితి నెలకొంది. ఈడీని బదిలీ చేయడంతోనే అసలు కధ మొదలైంది. శాఖకు చెందిన ఇద్దరు ఉన్నతాధికారులు కలిసి పనిచేస్తున్న ఈడీని కావాలని పంపించారనే ప్రచారం జరుగుతుంది. అయితే ఈ పోస్టుకోసం శాఖకు చెందిన ఓ ఉన్నతాధికారి జీహెచ్ఎంసీలో పనిచేస్తున్న వేణుగోపాల్ రెడ్డిని తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. కానీ ఆయన రావడంతో శాఖ మంత్రికి చెందిన కొంతమందికి ఇష్టం లేదనే ప్రచారంజరుగుతుంది. మంత్రికి సంబంధించిన విజయ్ ను తీసుకొచ్చేందుకు పావులు కదుపుతున్నారు. దీంతో ఓ ఉన్నతాధికారి సిఫార్సు చేసిన వేణుగోపాల్ రెడ్డి పైల్ ను పెండింగ్ లో పెట్టారు. గతంలో ఈడీగా పనిచేసిన విజయ్ ను తిరిగి తీసుకొచ్చేందుకు మంత్రికి చెందినవారు ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. అయితే ఎవరికి వారుగా ఈడీ పోస్టులో తమకు చెందినవారికి పోస్టింగ్ ఇప్పించుకునే పనిలో నిమగ్నమయ్యారు.
శాఖలో ఈడీగా విజయ్ పనిచేశారు. ఆయన మాతృసంస్థ ఎక్సైజ్ శాఖ నుంచి డిప్యూటేషన్ పై టూరిజంశాఖ ఈడీ(ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్)గా పనిచేశారు. అయితే గతేడాది రాష్ట్ర ప్రభుత్వం మిస్ వరల్డ్ పోటీలను నిర్వహించిన విషయం తెలిసిందే. ఆ సమయంలో పర్యాటక , సంస్కృతి శాఖ కార్యదర్శిగా స్మీతాసబర్వాల్ పనిచేశారు. వీరితో పాటు ఇంకా కొంతమంది అధికారులు సైతం స్పాన్సర్లను తీసుకురావడంలో విఫలం అయ్యారనే ఆరోపణలు వచ్చాయి. దీంతో ఆ అధికారులను బదిలీ చేశారు. అందులో విజయ్ సైతం ఉన్నారు. సొంతశాఖ ఎక్సైజ్ శాఖకు గతేడాది మే 14న తిరిగిపంపారు. కొంతమంది బ్యాంకు అధికారులు పోటీల్లో స్పాన్సర్లుగా ముందుకు వచ్చినా వారితో సరిగ్గా డీల్ చేయలేదని, ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాన్ని కోల్సోవల్సి వచ్చిందని ప్రభుత్వం సైతం సీరియస్ అయినట్లు సమాచారం.
అంతేకాదు విజయ్ ఈడీగా పనిచేసిన సమయంలో టూరిజంలో జరుగుతున్న కీలక సమాచారానికి ప్రధానప్రతిపక్షం బీఆర్ఎస్ నేతలకు చేరవేస్తున్నారనే ఆరోపణలు సైతం వచ్చాయి. దీనిపై కూడా ప్రభుత్వం సీరియస్ కావడంతో పాటు విజిలెన్స్ విచారణకు సైతం ఆదేశించింది. ఆ విచారణ కొనసాగుతుంది. ఈ సమయంలోనే మళ్లీ విజయ్ ను టూరిజం ఈడీగా వచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారని, అందుకు మంత్రి పేచీ నుంచి కూడా సహకారం ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. అయితే ఆరోపణలు ఉన్నవ్యక్తిని మళ్లీ ఎలా నియమిస్తారనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
ఇది ఇలా ఉంటే ఇప్పటికే పర్యాటకశాఖ కార్యదర్శి, ఎండీలు ఇప్పటికే ఈడీ పదవికి వేణుగోపాల్ రెడ్డిని సిఫార్సు చేయడం, మంత్రి ఆమోదం కోసం పంపారు. అయితే ఈ పదవికోసం గతంలో పనిచేసిన విజయ్ ని మాతృశాఖకు పంపి మళ్లీ అదే అధికారిని నియమించే ప్రయత్నాలు జరుగుతుండటం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. అసలు ఎందుకు ఈడీ పోస్టుకోసం ఇంత పోటీ పడుతుండటం అనేది ఉద్యోగుల్లోనూ చర్చనీయాంశమైంది. ఈ ప్రయత్నాలు చేస్తున్న ఉన్నతాధికారులు ప్రజలకు ఏం సంకేతం ఇస్తున్నారనేది కూడా చర్చజరుగుతుంది.
ఇలాంటి సిఫార్సులు పరిపాలనా క్రమశిక్షణను దెబ్బతీస్తాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. అంతేకాదు ఇలాంటి ఘటనలు ప్రభుత్వ విశ్వసనీయతను ప్రజల్లోని విశ్వాసంపై ప్రతికూలంగా ప్రభావితం చేస్తాయనే ప్రచారం ఊపందుకుంది. పైరవీలకు తావివ్వకుండా ఉద్యోగుల పనితనం, పారదర్శకత, మెరిట్ ఆధారిత పద్దతిలో నియామకం జరిగేలా చూడాలని పలువురు అభిప్రాయపడుతుంది. ప్రభుత్వ నిర్ణయం కూడా స్పష్టంగా చెప్పాలని, ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలకు చెక్ పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఏది ఏమైనప్పటికీ టూరిజంశాఖలో ఈడీ పోస్టు మాత్రం ఆసక్తికరంగా, రసవత్తరంగా మారింది. ఇంతకు ఇద్దరిలో ఎవరిని నియమిస్తారు? లేకుంటే మరో అధికారికి ఈడీ పోస్టు ఇచ్చి ఇద్దరికి చెక్ పెడతారా అనేది చూడాలి.
Also Read: Crime Drama OTT: డబ్బు కోసం ఎంతకైనా… మైండ్ బ్లాక్ చేసే మోసాలు… ఫ్యూజులు అవుటయ్యే క్లైమాక్స్