Temple Development: స్వేచ్చ బ్యూరో: తెలంగాణలోని ఆధ్యాత్మిక వైభవానికి సరికొత్త కాంతులు అద్దేందుకు ప్రభుత్వం నడుం బిగించింది. రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలను అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దేందుకు, భక్తులకు అత్యుత్తమ వసతులు కల్పించేందుకు భారీ ‘మాస్టర్ ప్లాన్’కు రూపకల్పన చేసింది. ఇందుకు సంబంధించి వందల కోట్ల రూపాయల నిధులను మంజూరు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. జ్ఞాన సరస్వతి నిలయం బాసర, దక్షిణ కాశీగా పేరొందిన కాళేశ్వరం, భద్రాచలం రామయ్య సన్నిధితో పాటు యాదాద్రి, వేములవాడ క్షేత్రాల సమగ్ర అభివృద్ధికి నిధుల వరద పారించింది. దీనికి సంబంధించిన సమగ్ర కార్యాచరణ ప్రణాళికను ప్రభుత్వం సిద్ధం చేసింది. పనులు వేగవంతం చేయనుంది.
ఆధ్యాత్మికంగా ఎంతో ప్రాముఖ్యత కలిగిన బాసర, కాళేశ్వరం, భద్రాచలం, మేడారం, కొండగట్టు, కీసర, చెరువుగట్టు,జోగులాంబ బాలబ్రహ్మేశ్వరస్వామి, ధర్మపురి, భద్రకాళిదేవస్థానం ఆలయాల క్షేత్రాల ముఖచిత్రాన్ని మార్చడానికి ప్రభుత్వం భారీగా నిధులను మంజూరు చేసింది.
అక్షరాభ్యాసాలకు నిలయమైన బాసర క్షేత్రాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేయనున్నారు. గోదావరి ఘాట్ల ఆధునీకరణ, క్యూలైన్ల క్రమబద్ధీకరణ, వేద పాఠశాలల విస్తరణ, భక్తుల బస కోసం ఆధునిక కాటేజీల నిర్మాణానికి ఈ నిధులను ఖర్చు చేయనున్నారు.
కాళేశ్వరం (త్రిలింగ క్షేత్రం) – ₹200 కోట్లు: కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయ ప్రాంగణాన్ని విస్తరించనున్నారు. ప్రాణహిత-గోదావరి సంగమ తీరంలో శాశ్వత పుష్కర ఘాట్ల నిర్మాణం, వరద రక్షణ గోడలు, విఐపి వసతి గృహాలు, నిత్య కల్యాణ మండపం ఏర్పాటు చేయనున్నారు.
భద్రాద్రి (రామాలయం) – ₹276 కోట్లు: దక్షిణ అయోధ్యగా పిలిచే భద్రాచల క్షేత్రానికి మాస్టర్ ప్లాన్ ద్వారా మహర్దశ పట్టనుంది. ఆలయ ప్రధాన ప్రాకారాల అభివృద్ధి, ‘పర్ణశాల’ పర్యాటక ప్రాంతంగా మార్పు, సువిశాలమైన రథ వీధుల నిర్మాణం, యాత్రికుల సౌకర్యార్థం మల్టీ లెవెల్ పార్కింగ్ కాంప్లెక్స్‌లను నిర్మిస్తారు. శ్రీలక్ష్మివెంకటేశ్వరస్వామిదేవస్థానం(కురుమూర్తి) ఆలయఅభివృద్ధిలోభాగంగాప్రభుత్వం, రూ.110.00 కోట్లు ఘాట్రోడ్ ల నిర్మాణానికి ఎలివేషన్ కారిడార్ కు ,కొండపైనభక్తులకుసౌకర్యాలుఏర్పాటుచేసేందుకు ఆర్&బిశాఖద్వారా పనులు చేపడుతున్నారు.
Also Read: డిజిటల్ డిస్‌ప్లేతో వచ్చే.. బెస్ట్ బడ్జెట్ సైడ్-బై-సైడ్ ఫ్రిజ్‌లు.. ఇంకెందుకు ఆలస్యం
దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ రాజన్న క్షేత్రానికి రూ. 76 కోట్లతో పునర్నిర్మాణ పనులు చేపట్టారు. శృంగేరి పీఠాధిపతుల మార్గదర్శకత్వంలో ఈ పనులు జరుగుతున్నాయి. ఇక్కడ రూ. 35.25 కోట్లతో అధునాతన అన్నదాన సత్రాన్ని నిర్మిస్తున్నారు. నిత్యం వేలాది మందికి నాణ్యమైన, రుచికరమైన భోజనం అందించేలా అత్యాధునిక కేంద్రీకృత వంటశాల నిర్మిస్తారు. రాజన్న దర్శనానికి వచ్చే సామాన్య భక్తులకు క్యూలైన్లలోనే మంచినీరు, పాలు, ప్రసాదం అందించేలా ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు. గుడి చెరువు (కోనేరు) ఆధునీకరణతో పాటు, భక్తుల తలనీలాలు సమర్పించే కళ్యాణకట్టను పూర్తిగా హైటెక్ శైలిలో మార్చనున్నారు. 2026 మేడారం జాతర కోసం రూ. 101 కోట్లు విడుదల చేసిన సర్కార్.. జాతర కంటే 15 రోజుల ముందే గద్దెల ప్రాంగణంలోని రాతి కట్టడాల పనులను పూర్తి చేయాలని డెడ్‌లైన్ విధించింది.
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి క్షేత్రం మరో అరుదైన ఆధ్యాత్మిక ఘనతకు వేదిక కాబోతోంది.ఆధ్యాత్మికతతో పాటు వేద విద్యను అందించేందుకు కంచి కామకోటి పీఠం ఆధ్వర్యంలో 17 ఎకరాల్లో రూ. 43.79 కోట్లతో వేద పాఠశాలను నిర్మిస్తున్నారు. యాదద్రి కొండపై లేదా అనుబంధ ప్రాంగణంలో ఒకేచోట నాలుగు వేదాల (రుగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణవేదం) అధ్యయన పాఠశాలను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేయనుంది. దేశంలోనే అత్యుత్తమ వేద పండితుల పర్యవేక్షణలో ఈ పాఠశాల నడుస్తుంది. ఇక్కడ చదువుకునే విద్యార్థులకు ఉచిత వసతి, భోజన సదుపాయాలతో పాటు వేద విద్య ముగిశాక ఉపాధి అవకాశాలు కూడా కల్పించేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి విమాన గోపురానికి సుమారు 63 కిలోల బంగారంతో పూత పూసే పనులు తుది దశకు చేరాయి.
ఈ మాస్టర్ ప్లాన్ కేవలం కాగితాలకే పరిమితం కాకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఆయా జిల్లాల కలెక్టర్లు, దేవాదాయ శాఖ ఉన్నతాధికారులతో ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేసి, గడువులోగా పనులు పూర్తి చేసేలా పర్యవేక్షించనున్నారు. ఈ నిధుల వరదతో తెలంగాణలో ఆధ్యాత్మిక పర్యాటకం సరికొత్త శిఖరాలకు చేరడం ఖాయంగా కనిపిస్తోంది.
Also read: Gypsum Benefits: తెలంగాణ రైతులకు బంపర్ ఆఫర్.. ఆ రకం నేలల పునరుద్ధరణకు 90% సబ్సిడీ..?