TG Assembly Sessions: తెలంగాణ అసెంబ్లీ మంగళవారం వాడివేడిగా సాగింది. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అసెంబ్లీ భగ్గుమనడంతో, బీఆర్ఎస్ ఎమ్మేల్యేలు సైతం సైలెంట్ అయ్యారు. ఈసారి భట్టి విక్రమార్క తనదైన శైలిలో విరుచుకు పడడంతో అసెంబ్లీ కామ్ గా కనిపించింది.
రైతు కూలీల కోసం భూమి లేని వారికి ఏడాదికి రూ. 12 వేలు పథకంను ప్రభుత్వం ప్రవేశపెడుతున్న విషయం తెలిసిందే. ఈ పథకం అమల్లోకి తెచ్చేందుకు సీఎం రేవంత్ సర్కార్ అంతా సిద్దం చేస్తోంది. ఈ విషయాన్ని ఖమ్మం పర్యటనలో ఉన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు. మీరు రైతులకే పథకాలు వర్తింప జేస్తున్నారు, రైతు కూలీలకు ఏమి లేవా అనడంతో భట్టి ఖమ్మంలో ఏ మాట చెప్పాల్సి వచ్చింది. అయితే ఇదే విషయంపై బీఆర్ఎస్ ఎమ్మేల్యేలు ప్రివిలేజ్ మోషన్ చేయాలంటూ గగ్గోలు పెట్టారు.
ఈ విషయంపై స్పందించిన భట్టి విక్రమార్క మైక్ అందుకొని మాటలకు పదును పెట్టారు. ఏమి మీ భూస్వామ్య రాజ్యం, తట్టుకోలేక పోతున్నారా, రైతులతో పాటు కూలీలకు తాము పథకాలు ప్రవేశ పెడుతున్నామన్నారు. అది కూడా ఓర్వలేక బీఆర్ఎస్ పథకం అమలుకు అడ్డు తగిలేందుకు విశ్వ ప్రయత్నం చేస్తుందన్నారు. అలాగే పదేళ్లు అప్పులు మిగిల్చి, ఇప్పుడు కాంగ్రెస్ సుపరిపాలన అందించడం ఏమాత్రం బీఆర్ఎస్ కు రుచించడం లేదని భట్టి ఆగ్రహం వ్యక్తం చేశారు.
అసెంబ్లీ రూల్స్ బుక్ పై భట్టి మాట్లాడుతూ.. గత బీఆర్ఎస్ ప్రభుత్వం అసెంబ్లీ రూల్స్ బుక్ ను ఇష్టారీతిన మార్చిందని, ఆ రూల్స్ ఇప్పటికీ అమలవుతున్నాయన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అసెంబ్లీలో ప్లకార్డులు ప్రదర్శించరాదని రూల్స్ మార్చారని, కానీ ఇప్పుడు మాత్రం బీఆర్ఎస్ రూల్స్ పాటించడం లేదన్నారు.
నాడు మీ స్వార్థం కోసం ఎన్ని మార్పులైనా చేస్తారు, నేడు ప్రభుత్వం మారితే అవి పాటించరా అంటూ భట్టి ప్రశ్నించారు. మొత్తం మీద మంగళవారం జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో భట్టి విక్రమార్క కాస్త సీరియస్ కామెంట్స్ చేశారని చెప్పవచ్చు. భట్టి మాట్లాడుతున్నంత సేపు బీఆర్ఎస్ ఎమ్మేల్యేలు గప్ చుప్ కాగా, అసెంబ్లీ సైలెంట్ అయింది.