Roads In Telangana : మౌలిక వసతులపై భారీగా ఖర్చు పెడుతున్న తెలంగాణ ప్రభుత్వం.. రాష్ట్ర వ్యాప్తంగా కీలక రోడ్లను రెండు లైన్లల్లో నిర్మించాలని నిర్ణయించింది. ఇప్పటికే.. రహదారుల విస్తరణ, కొత్త రోడ్ల నిర్మాణంపై దృష్టిపెట్టిన తెలంగాణ ప్రభుత్వం… తాజాగా రాష్ట్రంలోని అన్ని మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాలకు వెళ్లే రహదారులను రెండు వరుసలకు విస్తరించేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. ఇప్పటికే.. ఈ ప్రణాళికలు తుది రూపునకు వచ్చినట్లుగా తెలుస్తోంది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత అనేక మండలాలు నూతనంగా ఏర్పడ్డాయి. మరికొన్ని గతంలోనే ఉన్నా.. ఆయా మండలాల నుంచి జిల్లా కేంద్రానికి వెళ్లాలంటే సింగిల్ రోడ్లే దిక్కు. అలాంటి.. రోడ్లపై దృష్టి పెట్టిన రాష్ట్ర ప్రభుత్వ.. వాటికి నూతన మహర్ధశ రానుంది.
తెలంగాణ రాష్ట్రంలో రోడ్డు, రవాణా శాఖ గణాంకాల ప్రకారం.. నాలుగు వరుసల్లో రహదారులు 1,151 కి.మీ మేర ఉండగా, రెండు వరుసల్లోని రహదారులు దాదాపు 13 వేల కిలోమీటర్లు ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఒకే వరుసలో ఉన్న రహదారులు 16 వేల కిలోమీటర్లకు పైగా ఉన్నట్లు తెలుస్తోంది. వీటన్నింటిలో.. మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాలకు చేరుకునేందుకు ఉన్న సింగిల్ రోడ్ల లెక్కలు తేల్చిన ప్రభుత్వం.. దాదాపు 900 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్నట్లు వెల్లడించింది. తాజా ఆలోచనల్లో భాగంగా.. తొలి ప్రాధాన్యం కింద.. ఈ సింగిల్ రోడ్లను రెండు వరుసల్లో విస్తరించేందుకు ప్రణాళికలు రూపొందించాలని అధికారులకు ప్రభుత్వ పెద్దల నుంచి ఆదేశాలు అందాయి. దాంతో.. అధికారులు పూర్తి స్థాయిలో వివరాలు సేకరిస్తూ.. ఆయా రోడ్ల నిర్మాణానికి ఎంత ఖర్చు అవుతుంది, ఆయా దారుల్లో నిర్మించాల్సిన ఇతర నిర్మాణాల సంగతేంటి వంటి వివరాల్ని ప్రభుత్వానికి అందించనున్నారు.
కొత్త జిల్లాల్లు ఏర్పడిన తర్వాత.. ఆయా జిల్లాల పరిధిలోని మండల కేంద్రాల నుంచి దూరం అయితే తగ్గింది కానీ, సరైన రవాణా సదుపాయాలు లేకుండా పోయాయి. గతంలోని సింగిల్ రోడ్లే ఇప్పటికీ వినియోగించాల్సిన పరిస్థితి. జిల్లా కేంద్రాలు ఏర్పడిన ప్రాంతాలతో అనేక అవసరాల నిమిత్తం.. రోజూ వేల మంది రాకపోకలు సాగిస్తుంటారు. ముఖ్యంగా.. పరిసర గ్రామాల నుంచి వచ్చే వారీ సంఖ్యా గణనీయంగానే ఉంటుంది. అలాంటి వారందరి ప్రయాణాలతో మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాలకు రాకపోకలు సాగించాలంటే అనేక ఇబ్బందులు పడాల్సిన పరిస్థితులు. అత్యవసర సమయాల్లో వెళ్లాలంటే మరింత ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఈ విషయాన్ని గుర్తించిన ప్రభుత్వ నేతలు.. రాష్ట్రంలోని అన్ని మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాలకు డబుల్ రోడ్లు నిర్మించాలని నిర్ణయించింది. విద్యా, వైద్యం, ఉపాధీ వంటి అనేక పనులపై రోజూ జిల్లా కేంద్రాలకు వచ్చే వారికి అనుకూలంగా ఉండడం, పెరుగుతున్న రవాణాకు తగ్గట్టుగా రహదారి సౌకర్యాల్ని విస్తరించేందుకు భారీ ప్లాన్ రూపొందించింది. అందులో భాగంగా వట్టే నాలుగేళ్లల్లోనే రాష్ట్రవ్యాప్త రహదారుల అనుసంధానత పెంచాలని అనుకుంటోంది.
ఈ నియోజకవర్గాల్లోనే అధికం
మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాలకు చేపట్టనున్న రోడ్ల విస్తరణలో.. ఉమ్మడి నల్లొండ జిల్లా పరిధిలోని దేవరకొండలో 21 కిలో మీటర్లు, భువనగిరిలో 20.90 కి.మీ. అందుబాటులోకి నూతన రహదారులు రానుండగా.. ఆలేరులో 22.5 కి.మీ. నూతన డబుల్ లైన్ రోడ్లు రానున్నాయి. అలాగే.. ములుగులో 38 కి.మీ., ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పెద్దపల్లిలో 53 కి.మీ., వేములవాడలో 45 కి.మీ. మేర నూతన డబుల్ లైన్ రోడ్ల నిర్మాణాలకు ప్రభుత్వం కార్యచరణ రూపొందించింది.
Also Read : ఫ్యూచర్ AIదే.. హైదరాబాద్ జర్నీలో మైక్రోసాఫ్ట్ ఇదొక మైలురాయి – సీఎం రేవంత్
వీటితో పాటే.. నూతనంగా మండలాలు ఏర్పాడిన జిల్లాలైన మహబూబ్‌నగర్ జిల్లా పరిధిలోని అచ్చంపేటలో 54.40 కి.మీ., అలంపూర్‌లో 36.80 కి.మీ., గద్వాలలో 27.30 కి.మీ. మేర రోడ్లను విస్తరించనుండగా, మెదక్ జిల్లా పరిధిలోని నారాయణఖేడ్‌లో 35.80 కి.మీ., నర్సాపూర్‌లో 39.00 కి.మీ రోడ్లను వెడల్పు చేయాల్సిందిగా అధికారులు ప్రతిపాదనలు పంపించారు. అలాగే.. దుబ్బాకలో 50.86 కి.మీ. పాత రంగారెడ్డి జిల్లా పరిధిలోని వికారాబాద్‌లో 38 కి.మీ., పరిగిలో 22 కి.మీ. మేర రోడ్లకు మోక్షం కలగనుంది. వాటితో పాటుగా.. నిజామాబాద్ లోని ఎల్లారెడ్డిలో 13.82 కి.మీ., కామారెడ్డి జిల్లాలో 7 కి.మీ. మేర, పాత ఆదిలాబాద్ జిల్లాలోని ఆసిఫాబాద్ నియోజకవర్గంలో 88 కి.మీ రోడ్ల విస్తరణకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కార్యచరణ ప్రారంభించింది.