Local Body Elections : తెలంగాణలో త్వరలోనే ఎన్నికల నగారా మోగనుంది. చాన్నాళ్లుగా ఎదురుచూస్తున్న స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలని భావిస్తున్న తెలంగాణ ప్రభుత్వం.. ఇప్పటికే కసరత్తు ప్రారంభించినట్లు సమాచారం. కాగా.. ఈ సారి నిర్వహించనున్న ఎన్నికల్లో కొన్ని ముఖ్యమైన సవరణలు చేయాలని భావిస్తున్నారు. గ్రామాల అభివృద్ధికి కీలకమైన పంచాయతీ రాజ్ విభాగంలో కొన్ని మార్పు చేర్పులు అవసరమని భావిస్తుండగా.. ఏపీ ఇటీవల చేసిన కొన్ని సవరణలను సైతం పరిశీలిస్తున్నారు.
ఉత్తరాది రాష్ట్రాలతో పోల్చితే తలసరి అభివృద్ధిలో దక్షిణాది రాష్ట్రాలు మెరుగ్గానే ఉన్నాయి. కానీ.. సంతానోత్పత్తి విషయంలో మాత్రం వెనుకబడిపోయింది. ఈ కారణంగానే.. కేంద్రం జనాభా ప్రాతిపదికన కేటాయించే నిధులతో పాటు రానున్న దశాబ్దంలో పనిచేసే యువత సంఖ్య తగ్గుతుందని ఏపీ ప్రభుత్వం ఆలోచించింది. ఈ కారణంగానే.. చాన్నాళ్లుగా అమల్లో ఉన్న ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ ఉన్న వారు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి అనర్హులు నిబంధనని తొలగించింది. ఇకపై.. ఇద్దరుకంటే ఎక్కువ మంది పిల్లలున్న వాళ్లు కూడా నిరభ్యంతరంగా పోటీలో నిలబడవచ్చంటూ సవరణ చేసింది. తెలంగాణ ప్రభుత్వం సైతం ఇలాంటి నిబంధననే అమలు చేయాలని భావిస్తోంది. అందుకే.. తెలంగాణ పంచాయతీరాజ్ చట్టానికి సవరణలు చేయాలని చూస్తోంది. దాంతో పాటే..
ఇప్పటి వరకు అనుసరిస్తున్న ఎంపీటీసీలు, ఎంపీపీల ఏర్పాటు విధానంలోనూ గణనీయమైన మార్పులు చేయనున్నారు. ప్రస్తుతం కొన్ని మండలాల్లో ముగ్గురు ఎంపీటీసీలతోనే ఒక ఛైర్మన్, ఒక వైస్ ఛైర్మన్ విధానాన్ని అవలంభిస్తున్నారు. ఇకపై.. కనీసం ఐదుగురు ఎంపీటీసీలతో ఒక ఎంపీపీ ఏర్పాటు అయ్యే విధంగా సవరణ చేయనున్నట్లు సమాచారం. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ఎంపీపీ బిల్లును ప్రవేశపెట్టే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది.
Also Read : ఏదో ఒకటి మాట్లాడడం.. వార్తల్లో నిలవడం.. ఇదే కేటీఆర్ నైజమా? కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఫైర్
కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ సూచనల మేరకు తెలంగాణలో కుల గణన చేపట్టింది. కులాల జనాభా నిష్పత్తి ఆధారంగా సీట్ల కేటాయింపులు చేయాలని భావిస్తోంది. ఈ క్రమంలోనే రాష్ట్రంలో చేపట్టిన సర్వే దాదాపు ఓ కొలిక్కి వచ్చింది. దాంతో.. ఆయా సమాచారం అధారంగా పంచాయతీ ఎన్నికలకు సిద్ధమవ్వాలని భావిస్తోంది. ఇప్పటికే.. ఈ విషయమై కసరత్త పూర్తి చేసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం.. జనవరి 14వ తేదీన స్థానిక సంస్థల నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంది. ఫిబ్రవరి రెండో వారంలో ఎన్నికలు నిర్వహించనుండగా, మొత్తం మూడు దశల్లో పంచాయితీ ఎన్నికలు నిర్వహణ చేపట్టాలని నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.