Kishan Reddy: బీఆర్ఎస్ పార్టీ వ్యవహరిస్తున్న తీరును చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారని, పదేళ్ల పాటు బీఆర్ఎస్ అనుసరించిన మోసపూరిత విధానాలను ప్రజలు ఇంకా మరచిపోలేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. మాజీ మంత్రి కేటీఆర్ తాజాగా తెలంగాణ బీజేపీ నేతలను టార్గెట్ చేస్తూ చేసిన విమర్శలపై కిషన్ రెడ్డి ట్వీట్ చేశారు. ఈ సంధర్భంగా బీఆర్ఎస్ లక్ష్యంగా పలు సంచలన కామెంట్స్ చేశారు కిషన్ రెడ్డి.
ఇటీవల ప్రధాని మోడీని బీజేపీ నేతలు కలిసిన సమయంలో పలు సూచనలు చేశారు. తెలంగాణలో పార్టీ బలోపేతానికి అందరూ సమిష్టిగా కృషి చేయాలని, అలాగే జనవరి నెలలో కొత్త పార్టీ అధ్యక్షుడిని ప్రకటిస్తున్నట్లు వారితో ప్రధాని తెలిపారు. ప్రధాని చేసిన ఈ సూచనలపై కేటీఆర్ ఓ ట్వీట్ చేశారు. మోడీజీ.. కలిసికట్టుగానే పని చేస్తున్నారు మీ కమలంనేతలు, కాంగ్రెస్ నేతలతో కలిసిపోయి మరీ పని చేస్తున్నారు. చోటేభాయ్ కు వ్యూహకర్తగా, కాంగ్రెస్ కట్టర్ కార్యకర్తలుగా విశ్రమించకుండా పని చేస్తున్నారన్నారు.
చీకటి రాజకీయ ప్రయోజనాల కోసం చేతులు కలుపుతూ చోటే భాయ్ కోసం కలిసి పని చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఎన్ని అరాచకాలు జరిగినా ఒక్కరూ నోరుమెదపరని, తెలంగాణ సీఎం రేవంత్ మీద ఈగ వాలకుండా కాపాడుకుంటారంటూ విమర్శించారు. హైడ్రా మంచిదంటారు, మూసీ కావాలంటారు, ఏమన్నా అంటే నిద్ర నటిస్తారంటూ ఇటీవల బీజేపీ నేతలు మూసీ పరీవాహక ప్రాంతంలో నిద్ర చేయడాన్ని ఉద్దేశించి తెలిపారు. పిల్లలు చనిపోయినా, రైతు గుండె పగిలినా, గిరిజనులను చెరపట్టినా, చప్పట్లు కొడతారని కేటీఆర్ ట్వీట్ చేశారు.
ఈ ట్వీట్ పై కిషన్ రెడ్డి కాస్త ఘాటుగా స్పందించారు. గురివింద గింజ తరహాలో బీఆర్ఎస్ పార్టీ వ్యవహరిస్తున్న తీరును చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారని, బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన వారికి కాంగ్రెస్ లోకి, చేతి గుర్తుపై గెలిచిన వారికి గులాబీ పార్టీలోకి పంపించుకుని, మంత్రిపదవులు తీసుకున్నప్పడు ఎవరు? ఎవరితో కలిసినట్లో కేటీఆర్ చెప్పాలన్నారు. మేం గిల్లినట్లు చేస్తాను.. మీరు ఏడ్చినట్లు చేయండన్న తెరచాటు ఒప్పందంతో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు సంయుక్తంగా పనిచేస్తున్నాయని కిషన్ రెడ్డి విమర్శించారు.
Also Read: SSC Exams : పదో తరగతి పరీక్షల్లో మార్పులు.. ప్రాక్టికల్స్ రద్దు చేస్తూ నిర్ణయం
పదేళ్ల పాటు బీఆర్ఎస్ అనుసరించిన మోసపూరిత విధానాలను ప్రజలు విస్మరించలేదని, కాళేశ్వరం, ఫోన్ ట్యాపింగ్ మొదలైన బీఆర్ఎస్ ప్రభుత్వదంలో జరిగిన కుంభకోణాలు, కేసుల విషయంలో పురోగతి లేదన్నారు. రైతులను మోసం చేయడంలో, నిరుద్యోగ యువతను నడిరోడ్డుపై నిలబెట్టడంలో, ప్రజల మధ్య విభేదాలు రెచ్చగొట్టడంలో, హిందూ సమాజాన్ని నిట్టనిలువునా చీల్చడంలో, కుటుంబ పాలనను ప్రోత్సహించడంలో.. అవినీతిని పెంచి పోషించడంలో.. బీఆర్ఎస్ ఆలోచన ఉందంటూ కిషన్ రెడ్డి అన్నారు. బీజేపీ ఒక సిద్ధాంతం ఆధారంగా ఎదిగిన పార్టీ అని, జాతీయవాదం, అంత్యోదయ వంటి నినాదాలతో పనిచేసే పార్టీగా వర్ణిస్తూ ట్వీట్ చేశారు. రాజకీయ అస్తిత్వాన్ని కోల్పోతున్న సందర్భంలో.. ఏదో ఒకటి మాట్లాడి వార్తల్లో ఉండాలనుకునే మనస్తత్వాలకు ప్రజలే సరైన బుద్ధి చెబుతారని కేటీఆర్ లక్ష్యంగా కిషన్ రెడ్డి అన్నారు.