Formula E Race Case : హైదరాబాద్ లో గతేడాది నిర్వహించిన ఫార్ములా ఈ-కార్ రేసుల్లో అవకతవకలపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో ప్రభుత్వంలోని కీలక నాయకుల ప్రమేయం ఉందన్న ప్రచారం నేపథ్యంలో ప్రభుత్వ చర్య ఆ అనుమానాలకు మరింత బలం చేకూర్చేలా చేసింది. ఈ కేసు విచారణలో ప్రీవెన్షన్ ఆఫ్ కరెప్షన్ (PC) చట్టం అమలు చేసేందుకుకు అవకాశం ఉందన్న ప్రభుత్వం.. గవర్నర్ ముందస్తు అనుమతి కోసం లేఖ రాసింది. దీంతో.. రానున్న రోజుల్లో ఈ- కార్ రేస్ వ్యవహారం ఎలాంటి మలుపులు తిరగబోతుందో అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
గత ప్రభుత్వ నిర్ణయాలపై రేవంత్ సర్కార్ నియమించిన విచారణ కమిటీలు సైలెంట్ గా తమ పని తాము చేసుకుంటూ పోతున్నాయి. విషయాన్ని లోతుగా అధ్యయనం చేస్తూ.. అన్ని లోగుట్టు వ్యవహారాల్ని కూపి లాగుతున్నాయి. ఆ తర్వాతే, పూర్తిస్థాయి చర్యలకు దిగుతున్నాయి. ఇందులో భాగంగానే.. ఈ కేసులో విచారణకు గవర్నర్ ముందస్తు అనుమతి కావాలని తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసింది. ప్రభుత్వంలోని కీలక స్థానాలైన మంత్రి పదవుల్లో ఉండి, అవినీతికి పాల్పడ్డారనే అరోపణల్లో దర్యాప్తు చేయాల్సి వస్తే.. అందుకు గవర్నర్ సమ్మతి తెలపాల్సి ఉంటుంది.
అవినీతి నిరోధక చట్టం (PC Act) 1988 లోని సెక్షన్ 17A ప్రకారం ప్రభుత్వ ఉన్నతాధికారులు, మంత్రుల వంటి పోస్టుల్లో ఉండి విధానపరమైన నిర్ణయాలు తీసుకున్న వారిపై దర్యాప్తు సంస్థలు విచారణ చేపట్టాలంటే సంబంధిత అధిపతుల నుంచి ముందుస్తు అనుమతి తప్పనిసరి. దీంతో.. ప్రభుత్వానికి గవర్నర్ అధిపతి కావడంతో.. గవర్నర్ కు ప్రభుత్వం లేఖ రాసింది.
ప్రభుత్వం నుంచి లేఖ పంపిన నేపథ్యంలో ప్రభుత్వాధినేతగా మూడు నెలల్లో నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. గ్రేస్ పిరియడ్ గా మరో నెల రోజుల గడువు తీసుకునే వెసులుబాటు ఉంది. గవర్నర్ కావాలనుకుంటే.. ఈ లోపుగానైనా నిర్ణయం తీసుకోవచ్చు. సాధారణంగా ఇలాంటి వ్యవహారాల్లో గవర్నర్లు.. ప్రభుత్వ, విచారణ సంస్థల విధులకు అడ్డురారు. వారి బాధ్యత ప్రకారం నడుచుకునేందుకు వీలు కల్పిస్తూ.. అనుకూలంగానే నిర్ణయం తీసుకుంటుంటారు. కాబట్టి.. ఈ లేఖపై గవర్నర్ సానుకూలంగానే నిర్ణయం తీసుకోవచ్చని భావిస్తున్నారు.
Also Read : ఈ వ్యూహం కలిసొస్తుందా? అధికారం దక్కాలంటే.. అదొక్కటే మార్గమా? కేటీఆర్ ప్లాన్ ఇదేనా!
గవర్నర్ నిర్ణయం తర్వాత కేసు నమోదు చేయనున్న ఏసీబీ.. ఈ విషయంలో తనదగ్గరున్న ఆధారల మేరకు రాష్ట్రంలోని కీలక నాయకులపై కేసులు నమోదు చేసి విచారణ చేపట్టే అవకాశం ఉంది.