TG Schemes: మీరు వ్యవసాయ కూలీనా.. అయితే తెలంగాణ ప్రభుత్వం త్వరలో ప్రవేశపెట్టనున్న ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం ద్వారా లబ్ధి పొందాలని అనుకుంటున్నారా.. అయితే ఈ నిబంధనలు తప్పక తెలుసుకోవాల్సిందే. భూమిలేని వ్యవసాయ కూలీలకు సైతం ఆర్థిక భరోసాను కల్పించేందుకు సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్న విషయం అందరికీ తెలిసిందే.
జనవరి 26వ తేదీన బృహత్తర పథకాలకు తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. అందులో భాగంగా రైతు భరోసాతో పాటు, వ్యవసాయ కూలీలకు కూడా లబ్ధి చేకూర్చేందుకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా ఎన్నాళ్ళనుండో కొత్త రేషన్ కార్డుల కోసం వేచి ఉన్న ప్రజలకు ఊరట నిచ్చేలా కీలక ప్రకటనలను సైతం జారీ చేసింది. ఈనెల 26వ తేదీ నుండి కొత్త రేషన్ కార్డులను అందించేందుకు ప్రభుత్వం ముందడుగు వేస్తోంది.
అయితే వ్యవసాయ భూమి లేని కూలీల కుటుంబాలకు ఏడాదికి రూ. 12 వేలు ప్రభుత్వం అందించనుంది. ఇప్పటికే ఆయా జిల్లాల కలెక్టర్ల సమావేశంలో అర్హులకు తప్పనిసరిగా పథకంతో లబ్ధి చేకూర్చాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. దీనితో వ్యవసాయ భూమిలేని కూలీల కుటుంబాలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అందించేందుకు మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేసింది.
ఉపాధి హామీ జాబ్ కార్డు తప్పనిసరిగా కలిగి ఉండాలని, 2023-24 ఆర్థిక సంవత్సరంలో కనీసం 20 రోజులు పనులు చేసిన వారు పథకం ద్వారా లబ్ధి పొందేందుకు అర్హులుగా ప్రభుత్వం ప్రకటించింది. అలాగే ఆధార్, రేషన్ కార్డుల ద్వారా కూలీల కుటుంబాలను యూనిట్ గా అధికారులు గుర్తిస్తారు. ఈ పథకం ద్వారా లబ్ధి పొందాలంటే కుటుంబంలో ఎవరికీ వ్యవసాయ భూమి ఉండకూడదని నిబంధన ఉంది.
Also Read: Telangana Govt: ఏపీలో మొండిచేయి.. తెలంగాణలో ఆ పథకానికి శ్రీకారం.. డోంట్ మిస్!
అదే రేషన్ కార్డులో ఉన్న వ్యక్తికి వ్యవసాయ భూమి ఉంటే ఈ పథకానికి అనర్హులుగా పరిగణిస్తారు. ఏడాదికి రెండు విడతల్లో రూ. 6 వేల చొప్పున రూ. 12 వేలు ప్రభుత్వం వీరికి ఆర్థిక సహకారాన్ని అందించనుంది. సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన ముగించుకుని వచ్చిన అనంతరం ఈనెల 26వ తేదీన తొలి విడత నగదును అర్హులకు అందజేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. మరి మీకు ఈ పథకం వర్తించాలంటే ఈ అర్హతలు ఉన్నాయో, లేవో ఒకసారి సరిచూసుకోండి.