Telangana Govt: ఏపీలో ఆ పథకం ప్రారంభమయ్యేందుకు ఎన్నో అడ్డంకులు వచ్చాయి. అంతేకాదు కార్యరూపం దాల్చడం దేవుడెరుగు, ఆదిలోనే ఇక్కట్లు తప్పలేదు గత వైసీపీ ప్రభుత్వానికి. అదే పథకాన్ని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకొని, అమలు చేసేందుకు సిద్ధమయ్యారు. ఎప్పుడెప్పుడా అంటూ తెలంగాణ ప్రజలు ఎదురుచూపుల్లో ఉన్న క్రమంలో తెలంగాణ సర్కార్ శుభవార్త చెప్పింది.
ఏపీలో గత వైసీపీ ప్రభుత్వం సన్న బియ్యం పై పలుమార్లు ప్రకటనలు చేసింది. ఆ తర్వాత అది సాధ్యం కాదని అనుకుందో ఏమో కానీ, సన్న బియ్యం పై వెనుకడుగు వేసింది. రేషన్ కార్డుదారులందరికీ సన్న బియ్యం పంపిణీ చేస్తామని ప్రకటించినప్పటికీ, ఆ తర్వాత అది సాధ్యపడలేదు. కానీ తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ ఇచ్చిన మాటకు కట్టుబడి సన్న బియ్యం పంపిణీ చేసేందుకు సిద్ధమవుతోంది. అది కూడా ఉగాది నుండి పూర్తిస్థాయిలో కార్యరూపం దాల్చాలని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.
ఇటీవల సన్న బియ్యం సాగుచేసిన రైతులకు ప్రభుత్వ ధరతో పాటు అదనంగా రూ. 500 నగదును అందించిన విషయం తెలిసిందే. ఆ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రైతులు సన్నబియ్యాన్ని సాగు చేస్తే అదే బియ్యాన్ని తెలంగాణ ప్రజలకు అందించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అంతేకాదు గురుకుల పాఠశాలల విద్యార్థులకు సైతం సన్న బియ్యం అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఆ హామీనే నెరవేర్చేందుకు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ముందడుగు వేసింది.
ఉగాది నుండి సన్నబియ్యాన్ని పంపిణీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. రేషన్ కార్డు గల ప్రతి ఒక్కరికి సన్నబియ్యం అందించడమే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. రేషన్ కార్డులో గల ప్రతి ఒక్కరికి ఆరు కేజీల చొప్పున సన్న బియ్యం పంపిణీ చేసేందుకు సిద్ధమవుతున్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. దీనివల్ల ప్రభుత్వంపై రూ. 12 వేలకోట్ల వరకు భారం పడుతుందని, ఈ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం వెనకడుగు వేసే ప్రసక్తే లేదంటూ మంత్రి స్పష్టం చేశారు.
Also Read: Central Govt: మీరు ఇలా చేస్తే నేరుగా మీ ఖాతాలోకి డబ్బు.. అది కూడ ఏకంగా రూ. 25 వేలు..
కాగా ఈనెల 26 నుండి కొత్త రేషన్ కార్డులను మంజూరు చేస్తున్న విషయం మనకు తెలిసిందే. ప్రభుత్వం తీసుకున్న సన్నబియ్యం పంపిణీ నిర్ణయంతో కొత్త రేషన్ కార్డుదారులకు కూడా సన్నబియ్యం అందనుంది. ఏపీలో సాధ్యం కానప్పటికీ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం సన్న బియ్యం పంపిణీకి చర్యలు తీసుకోవడంపై తెలంగాణ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.