DAV School : తెలంగాణ విద్యాశాఖ ఆదేశాలతో హైదరాబాద్ బంజారాహిల్స్ డీఏవీ పాఠశాల తిరిగి ప్రారంభమైంది. తమకు న్యాయం జరగకుండా పాఠశాల ఎలా తెరుస్తారని బాధిత చిన్నారి తల్లిదండ్రులు ప్రశ్నించారు. డీఏవీ స్కూల్ వద్ద ఆందోళనకు దిగారు. తమకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా పాఠశాలను ఎలా తెరుస్తారంటూ పాఠశాల ముందు బైఠాయించారు. తమను ఎవరూ సంప్రదించలేదని కనీసం అభిప్రాయం అడగలేదని బాధిత తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. తమ బాధను ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. నిందితులకు శిక్ష పడే వరకు పాఠశాల మూసివేయాల్సిందేనని బాధిత చిన్నారి తల్లిదండ్రులు స్పష్టం చేశారు.
ఇదే స్కూల్ లో నాలుగేళ్ల చిన్నారిపై లైంగిక దాడి జరగడంతో ప్రభుత్వం పాఠశాల గుర్తింపును రద్దు చేసింది. అయితే ఈ విద్యా సంవత్సరానికి ప్రవేశాలు ముగిసినందున.. పాఠశాలను పునఃప్రారంభించాలని విద్యార్థుల తల్లిదండ్రులు లిఖితపూర్వకంగా విద్యాశాఖకు వినతి పత్రాలు ఇచ్చారు. ఈ నేపథ్యంలో విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఈ విద్యా సంవత్సరం వరకు విద్యాశాఖ అనుమతి ఇచ్చింది.