New Ration Cards: తెలంగాణ ప్రభుత్వం నూతన రేషన్ కార్డులను మంజూరు చేస్తున్న విషయం తెలిసిందే. జనవరి 26 వ తేదీన ఈ కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అయితే రేషన్ కార్డు దరఖాస్తుపై ప్రజలకు ఉన్న అనుమానాలను నివృతి చేస్తూ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. మీసేవ వద్దకు వెళ్లే అర్హులు పలు ధృవీకరణ పత్రాలను తీసుకెళ్లినట్లయితే, దరఖాస్తు విధానం సులభతరం కానుంది.
రేషన్ కార్డు లేకుంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే ఏ పథకం వర్తించదు. అంతెందుకు ఏ ఉద్యోగానికి అప్లై చేయాలన్నా, మన ఆదాయ స్థితిగతులను తెలియజేసేదే రేషన్ కార్డు. అంతేకాదు ప్రతి నెలా సామాన్య కుటుంబాలకు రేషన్ కూడా ఈ కార్డు ఉంటేనే అందిస్తారు. సామాజిక పింఛన్ మంజూరు కావాలన్నా, ఇలా ఏ పథకం ద్వారానైనా లబ్దిపొందాలంటే రేషన్ కార్డు ఉండాల్సిందే. కొందరు ఇతర ప్రాంతాలకు వలస వెళ్ళిన సమయంలో వారి కార్డును గతంలో తొలగించారు.
అందుకు ప్రధాన కారణం వారు ఇక్కడ నివాసం లేరన్న ఆ ఒక్క కారణంతో వారిని అనర్హులుగా అధికారులు గుర్తించి జాబితా నుండి తొలగించారు. అటువంటి వారికి ఇప్పుడు ఇబ్బందులు తప్పని పరిస్థితి. అర్హత ఉండి కూడా రేషన్ కార్డు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారు ఎందరో రాష్ట్రంలో ఉన్నారన్నది ప్రభుత్వం వద్ద ఉన్న సమాచారం. అందుకే సీఎం రేవంత్ సర్కార్ నూతన రేషన్ కార్డు ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. ప్రజాపాలన, ప్రజావాణి కార్యక్రమాల ద్వార నూతన రేషన్ కార్డుల కొరకు ప్రభుత్వం దరఖాస్తులు స్వీకరించింది.
అయితే ఇటీవల మీసేవా కేంద్రాలలో కూడ దరఖాస్తు చేసుకొనే వీలును ప్రభుత్వం కల్పించింది. దీనితో మీసేవ సెంటర్లు దరఖాస్తుదారులతో కిటకిటలాడుతున్నాయి. అర్హత ఒక్కటే ప్రామాణికంగా నూతన కార్డు మంజూరవుతుందని, ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొనవద్దంటూ ప్రభుత్వం పేర్కొంది. అయితే మీసేవ కేంద్రాలకు వెళ్ళేవారు సంబంధిత పత్రాలు తీసుకెళ్లినట్లయితే చకచకా పని సాగిపోతుంది. కానీ కొందరు అవగాహన లేక ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మీసేవ సెంటర్లకు కొత్త రేషన్ కార్డుకై దరఖాస్తు కోసం వెళ్ళేవారు.. తప్పనిసరిగా తమ కుటుంబసభ్యుల ఆధార్ కార్డులతో పాటు కరెంట్ బిల్లులను తప్పనిసరిగా తీసుకెళ్లాలి. ఇంతకు మునుపే రేషన్ కార్డు ఉండి ఫ్యామిలీలోని ఇతరుల పేర్లను జత చేయాలనుకుంటే వారి ఆధార్ కార్డులు తప్పనిసరిగా ఇవ్వాలి. అందుకు అప్లికేషన్ ఫీజు రూ.50 లు కాగా, అంతకంటే ఎక్కువ తీసుకుంటే అధికారులకు ఫిర్యాదు చేయవచ్చు.
Also Read: తన పర్యటన అసలు గుట్టు చెప్పిన పవన్ కళ్యాణ్
మీసేవా కేంద్రాలకు కూడ దరఖాస్తు చేసుకొనే అవకాశం ఇవ్వడంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే మీసేవ కేంద్రాల వద్ద భారీ క్యూ ఉంటుండగా, కేంద్రాల నిర్వాహకులు కొంత ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితి ఉంది. మొత్తం మీద నూతన రేషన్ కార్డుల కోసం ఎందరో అర్హులు.. ప్రభుత్వం ఇచ్చే ప్రకటన కోసం ఎదురుచూపుల్లో ఉన్నారని ఈ క్యూను బట్టి చెప్పవచ్చు. కొందరు నూతన కార్డు కొరకు, మరికొందరు తమ కుటుంబ సభ్యుల పేర్ల చేర్పుల కొరకు మీసేవ దారి పట్టారు.