Bandi Sanjay Office: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కార్యాలయంలో ఓ అపరిచితుడి ఫోన్ కాల్ కలకలం రేపింది. ఆగంతకుడు తనను ప్రధానమంత్రి కార్యాలయానికి చెందిన ఆర్థిక సలహాదారుడిగా పరిచయం చేసుకుని, బెదిరింపులకు దిగాడు. కార్యాలయ సిబ్బంది తన పని చేయకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించాడు.
ఈ విషయాన్ని వెంటనే రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబుకు వారు తెలియజేశారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే చర్యలు చేపట్టారు. విచారణలో ఆ కాల్ ఆదిభట్లలోని జయసూర్యనగర్ ప్రాంతానికి చెందిన కేపీ రావు అనే వ్యక్తి నుండి వచ్చినట్లు గుర్తించారు.
అనంతరం అతడిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతానికి అతడిని విచారిస్తున్న పోలీసులు, అతని ఉద్దేశ్యం ఏమిటన్న దానిపై మరింత సమాచారం రాబట్టే పనిలో ఉన్నారు. అయితే అసలే పాకిస్తాన్, మన దేశం మధ్య ఉద్రిక్తత వాతావరణం ఏర్పడిన నేపథ్యంలో ఈ బెదిరింపు కాల్ రావడంపై మంత్రి కార్యాలయం కాస్త కంగారు పడింది. ఆ తర్వాత అసలు విషయం తెలిసి, ఊపిరి పీల్చుకున్నారు.