AP Floods: రాష్ట్రంలో విపత్తుకు ప్రధాన కారణంగా ఒక ప్రకృతి వైపరిత్యం అయితే.. మరొకటి గత ప్రభుత్వ నిర్లక్ష్యం అని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రాజెక్టుల విషయంలో గత ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యంగా వహించిందని ఫైర్ అయ్యారు. కనీసం చిన్న చిన్న ప్రాజెక్టులకు లాకులు కూడా రిపేర్ చేయించలేదని మండిపడ్డారు. అది ఆ ప్రభత్వ తీరు అంటూ విమర్శించారు. అయితే.. తాము ఇప్పుడు గత ప్రభుత్వాన్ని విమర్శిస్తే ప్రయోజనం లేదని తెలిపారు. అందుకే భవిష్యత్‌లో ఇలాంటివి జరగకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేదానిపై ఆలోచనలు చేస్తామని వివరించారు. వరదలు తగ్గిపోయాక ఇలాంటి తప్పిదాలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకుంటామని తెలిపారు.
ఇది ప్రకృతి విపత్తు అని.. వరద నీరు మరో పది, 12 వేల క్యూసెక్కులు ఎక్కువగా వచ్చి ఉంటే పరిస్థితులు వేరుగా ఉండేవని, మనం ఊహించలేని పరిస్థితులు ఉండేవని డిప్యూటీ సీఎం తెలిపారు. దేవుడి దయ వల్ల పెద్ద ప్రమాదమే తప్పిందని చెప్పారు. గత ప్రభుత్వపు తీరు వల్లే ఈ సమస్య జటిలంగా మారిందని పేర్కొన్నారు. ఈ తప్పిదాలు లేకుండా చూసుకుంటామని, భవిష్యత్‌లో వరద నీటిని ఎలా మేనేజ్ చేయాలనేదానిపై ఆలోచనలు చేసి నిర్ణయాలు తీసుకుంటామని చెప్పారు. విజయవాడలో వరద పరిస్థితులు తీవ్రంగా ఉన్నాయని వివరించారు. ఈ నగరంపై ప్రత్యేక కోణం నుంచి దృష్టి పెడుతామని తెలిపారు.భవిష్యత్‌లో వరద నీటిని మేనేజ్ చేయడం ఎలా.. ఫ్లడ్ కెనాల్స్ ఎలా నిర్మించాలనేది సీఎం చంద్రబాబు నాయుడితో చర్చించి నిర్ణయాలు తీసుకుంటామని పేర్కొన్నారు.
Also Read: Villages merged into Municipalities: 51 గ్రామాలు మున్సిపాలిటీల్లో విలీనం.. ఏ ఏ గ్రామాలయ్యాయంటే..?
ఈ వరదలతో రాష్ట్రవ్యాప్తంగా సుమారు ఒక లక్షా 70 వేల ఎకరాల పంట నష్టపోయిందని పవన్ కళ్యాణ్ తెలిపారు. ప్రాజెక్టుల్లో వరద తగ్గుతున్నదని, ప్రకాశం బ్యారేజీలో రేపటికల్లా సుమారు 5 లక్షల క్యూసెక్కుల వరద నీరు తగ్గిపోతుందని అధికారులు చెప్పారని వివరించారు. ఈ వరద కాలంలో రెస్క్యూ సిబ్బంది మంచిగా పని చేసిందని ప్రశంసించారు. ఈ కాలంలో 176 రిహాబిలిటేషన్ సెంటర్లు ఏర్పాటు చేశామని, 193 రిలీఫ్ క్యాంప్‌లను నిర్వహించామని వివరించారు. 328 ట్రైన్లు క్యాన్సిల్ అయ్యాయని తెలిపారు. ఈ వరదలతో రాష్ట్రంలో సుమారు 6 లక్షల మంది ప్రభావితం అయ్యారని డిప్యూటీ సీఎం పవన్ వెల్లడించారు.
అందుకే రాలేదు..
ఒక వైపు రాష్ట్రాన్ని వరదలు ముంచెత్తుతుంటే.. రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎక్కడా కనిపించలేదని ప్రతిపక్షాలు విమర్శలకు దిగాయి. పవన్ కళ్యాణ్ మిస్సింగ్ అంటూ పోస్టర్లు చేసి విమర్శించాయి. ఈ విమర్శలను ప్రస్తావించగా.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పారు. తనకూ వరద ప్రభావిత ప్రాంతాలకు రావాలని, బాధితులను పరామర్శించాలని ఉన్నదని తెలిపారు. కానీ, తాను వరద ప్రభావిత ప్రాంతాలకు వస్తే.. అక్కడ పరిస్థితులను అదుపు చేయలేమని, ఏమైనా జరగొచ్చని అధికారుల సూచనలు ఇచ్చారని, అందుకే తాను పర్యటించలేదని వివరించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో తాను వెళ్లితే ఒక వేళ అక్కడ కూడా కొందరు ఎగబడి మీది మీదికి వస్తే.. అది రిలీఫ్ ఆపరేషన్‌కు మరింత ఇబ్బందికరంగా మారుతుందని సూచించారని, అలాగే.. తన పర్యటన రెస్క్యూ ఆపరేషన్‌లో మునిగిన అధికారులకు అదనపు భారంగా మారుతుందని చెప్పడంతో తాను విరమించుకున్నానని తెలిపారు.