Kaushik Reddy: హుజూరాబాద్ ఎమ్మేల్యే పాడి కౌశిక్ రెడ్డిపై గ్రామస్తులు టమాటాలతో దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన హన్మకొండ మండలం కమలాపూర్ లో శుక్రవారం జరిగింది. అయితే వెంటనే పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని సద్దుమణిగించే చర్యలకు శ్రీకారం చుట్టారు. గ్రామస్తులు మాత్రం నాడు చేసిందేమి లేదు.. నేడు మాత్రం అడ్డుకోవడానికి వస్తారా అంటూ సీరియస్ కామెంట్స్ చేయడం విశేషం.
అసలేం జరిగిందంటే..
కమలాపూర్ లో ప్రభుత్వ పథకాలకు అర్హుల జాబితాను ప్రకటించేందుకు, అలాగే అర్హుల నుండి దరఖాస్తుల స్వీకరణకు గ్రామసభను శుక్రవారం ప్రారంభించారు. అలా గ్రామసభ ప్రారంభం కావడంతోటే, హుజూరాబాద్ ఎమ్మేల్యే పాడి కౌశిక్ రెడ్డి సభకు వచ్చారు. అధికారులు లబ్దిదారుల జాబితాలో ఏ మాత్రం అనుమానం ఉన్నా, తమను సంప్రదించాలని కోరారు. అంతేకాకుండ అర్హులు ఎవరైనా ఉంటే దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇందిరమ్మ గృహాల లబ్ది గురించి వివరించారు. అంతలోనే కాంగ్రెస్ నేతలు మాట్లాడిన అంశంపై ఎమ్మేల్యే కౌశిక్ రెడ్డి అడ్డు తగిలారు.
ఎమ్మేల్యే కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను అందించింది అంటూ కాంగ్రెస్ నేతలతో వాగ్వాదానికి దిగారు. దీనితో కాంగ్రెస్ నాయకులు, స్థానికులు కాస్త అసహనానికి లోనైనట్లు సమాచారం. అంతలోనే గ్రామసభకు వచ్చిన కొందరు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పై టమాటాలు విసిరారు. ఆ వెంటనే తేరుకున్న కౌశిక్ రెడ్డి అనుచరులు, ఏకంగా కుర్చీలను చేతబట్టి కాంగ్రెస్ శ్రేణులపై దాడికి యత్నించినట్లు కాంగ్రెస్ నాయకులు తెలిపారు.
ఇది ఇలా ఉంటే హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి బూతు పురాణం ఎత్తుకున్నారట. సభలో కౌశిక్ రెడ్డి మాట్లాడుతుండగా స్థానికులు, కాంగ్రెస్ శ్రేణులు నిరసన వ్యక్తం చేశారు. ఎమ్మేల్యే మాట్లాడుతూ.. కాంగ్రెస్ నాయకులు నకిలీ నాయకులంటూ విమర్శలు చేయడంతో పాటు, నీ అవ్వ, ఏం బతుకులు రా అంటూ నిరసనకారులపై బూతు పురాణం అందుకున్నారు. ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలపై గ్రామస్తులు విస్మయం వ్యక్తం చేశారు.
Also Read: CM Revanth Reddy: హైదరాబాద్‌కు చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. స్వాగతం అదరహో
దీనితో సవ్యంగా జరగాల్సిన గ్రామసభ కాస్త ఉద్రిక్తతకు దారితీసింది. పోలీసులు వెంటనే రంగప్రవేశం చేసి స్థానిక ప్రజలను నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు సైతం ప్రజలను నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పటికీ, నాడు ఏ మాత్రం పట్టించుకోలేదు.. నేడు ప్రభుత్వ పథకాలు అందిస్తుంటే అడ్డు తగులుతారా అంటూ కామెంట్స్ చేయడం విశేషం.