UK Rich Looted India Wealth | బ్రిటీషర్లు భారతదేశం నుంచి దోచుకొని వెళ్లిన సంపదలో సగం.. ఇప్పటికీ ఆ దేశ ధనవంతుల వద్దనే ఉందని తాజాగా ఒక సంస్థ సర్వేలో తేలింది. బ్రిటన్ దేశానికి చెందిన అత్యంత ధనవంతుల్లో కేవలం 10 శాతం మంది వద్దనే భారత సంపదలో సగం ఉందని ఈ సర్వే రిపోర్ట్ ద్వారా తెలుస్తోంది. బ్రిటన్ దేశానికి చెందిన ఆక్స్‌ఫామ్ (Oxfam) అనే సంస్థ సమాజంలో అర్థిక అసమానతలు, పేదరిక నిర్మాలన, అన్యాయానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తోంది. ఈ సంస్థ తాజాగా భారత దేశం నుంచి బ్రిటీషర్లు దోచుకొని వచ్చిన సంపద గురించి ఆరా తీయగా ఆశ్చర్యకర వివరాలు బయటపడ్డాయి.
ఈ వివరాలను ఆక్స్‌ఫామ్ సంస్థ ‘టేకర్స్ నాట్ మేకర్స్’ అనే పేరుతో ఇటీవల ప్రచురించింది. ఈ రిపోర్ట్ ప్రకారం.. భారతదేశంలో కృూరంగా పరిపాలన సాగించిన బ్రిటీషర్లు.. 1765 నుంచి 1900 మధ్య కాలంలో మొత్తం 64.82 ట్రిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో దాదాపు రూ.56 కోట్ల కోట్లు) దోచుకొని తమ దేశానికి తీసుకెళ్లారు. ఆ మొత్తంలో చాలా పెద్ద భాగం బ్రిటన్ ప్రభుత్వం చేతికి అందలేదు. బ్రిటీష్ అధికారులు తమ స్వప్రయోజనాల కోసం కాజేశారు. ఆక్స్‌ఫామ్ రిపోర్ట్ ప్రకారం.. ఇప్పుడు బ్రిటన్ దేశ సంపన్నుల్లో పది శాతం వద్ద ఆ సమయంలోని భారత సంపదలో దాదాపు 33.8 ట్రిలియన్ డాలర్లు ఉన్నాయి. ఈ ధనాన్ని బ్రిటన్ కరెన్సీ నోటు 50 పౌండ్లుగా మార్చి భూమిపై చదరంగా పరిస్తే.. నాలుగు లండన్ నగరాలకు సమానమైన భూమి కావాలని నివేదికలో ఆక్స్‌ఫామ్ పేర్కొంది.
Also Read: అమెరికాలో హాస్పిటళ్లకు క్యూ కడుతోన్న భారతీయ ‘గర్భిణీలు’ – ఇవేం కష్టాలండి బాబు!
బ్రిటీషర్ల పరిపాలనకు ముందు 1750 వరకు భారతదేశం ప్రపంచ జిడీపీలో 25 శాతం కలిగి ఉండేది. అదే 1900 దశాబ్దం నాటికి ఇది క్షీణించి కేవలం 2 శాతం మాత్రమే మిగిలింది. బ్రిటీషర్లు భారతీయులలో మతం, కులం పేరుతో విభజన తీసుకొచ్చి .. వారి సంపదను తెలివిగా హరించారు. ఆ తరువాత వారిని ఆర్థికంగా దెబ్బతీసి రాజ్యాలను హస్తగతం చేసుకున్నారు. రాజ్యాలను పరిపాలించి రాజులను కీలుబొమ్మల్లా చేసుకొని ప్రజల నుంచి ముక్కుపిండి పన్నులు వసూలు చేశారు. భారత ప్రజల సంక్షేమాన్ని పట్టించుకోకుండా వసూలు చేసిన పన్నుల ధనాన్ని మిలిటరీ కోసం ఉపయోగించి.. ఇతర దేశాలతో యుద్ధాలు చేశారు.
ఈ క్రమంలో దేశంలోని చాలా రాజ్యాలలో కరువు పరిస్థితులున్నా.. ప్రజలను ఆకలి చావులకు దిక్కులేకుండా వదిలేశారు. ఈ అంశాలన్నింటినీ ఆక్స్‌ఫామ్ రిపోర్ట్ ఎత్తి చూపింది. బ్రిటీషర్లు పరిపాలన సాగించిన అన్ని దేశాలలో ఇప్పటికీ అక్షరరాస్యత తక్కువగా ఉందని తెలిపింది. పాశ్చాత్య దేశాలతో పోలిస్తే.. బ్రిటీషర్లు పాలించిన దేశాల్లో ప్రజల ఆరోగ్య సంరక్షణ అధ్వాన స్థితిలో ఉందని తెలిపింది. ప్రపంచ వాణిజ్య సంస్థ (వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ – WTO), ప్రపంచ బ్యాంకు లాంటి సంస్థలు ఇప్పటికీ పాశ్చాత్య దేశాలకే ప్రాధాన్యం ఇస్తున్నాయని.. భారతదేశంలో కూడా వైద్య రంగంలో ప్రపంచ బ్యాంకు ప్రైవేటు వైద్య రంగానికే బాసటగా ఉందని తెలిపింది. ఈ పరిణామాలే ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అసమానతలకు కారణమని తెలిపింది.