Maoist Surrender: స్వేచ్ఛ బ్యూరో: మావోయిస్టు పార్టీలో మిగిలిన కొద్దిమంది కూడా జనజీవన స్రవంతిలోకి రావాలని డీజీపీ సీ.వీ.ఆనంద్ పిలుపునిచ్చారు. లొంగిపోయే అందరికీ ప్రభుత్వం తరపున ప్రకటించిన పునరావాస పథకాల ప్రయోజనాలను అందిస్తామని చెప్పారు. దాంతోపాటు సమాజంలో వాళ్లు గౌరవంగా బతికేందుకు పోలీసు శాఖ తరపున సహకారాన్ని అందిస్తామన్నారు. మావోయిస్టు పార్టీ సెంట్రల్ కమిటీ సభ్యుడు, బీహార్–జార్ఖండ్ స్పెషల్ ఏరియా కమిటీ కార్యదర్శి పసునూరి నరహరి అలియాస్ విశ్వనాథ్, రాష్ట్ర కమిటీ సభ్యురాలు, తన భార్య అయిన మేదర దానమ్మ అలియాస్ లత మంగళవారం డీజీపీ కార్యాలయంలో పోలీసుల ఎదుట లొంగిపోయారు.
ఈ సందర్భంగా మాట్లాడిన డీజీపీ ఆనంద్ ప్రస్తుతం దేశవ్యాప్తంగా 47మంది మావోయిస్టులు మాత్రమే అజ్ఞాతంలో ఉన్నట్టు చెప్పారు. వీరిలో తెలంగాణకు చెందిన వారు ముగ్గురు, ఆంధ్రప్రదేశ్ కు చెందిన వారు ఒకరు, ఛత్తీస్ ఘడ్ కు చెందిన వారు 15మంది, జార్ఖండ్ కు చెందిన వారు 13మంది, ఒడిశాకు చెందిన వారు 15మంది ఉన్నట్టుగా వివరించారు. 2024 నుంచి ఇప్పటివరకు తెలంగాణ పోలీసుల ఎదుట 822మంది మావోయిస్టులు లొంగిపోయినట్టు చెప్పారు. సరెండర్ అయిన వారు 334 ఆయుధాలను అప్పగించారన్నారు. మన రాష్ట్రానికి చెంది లొంగిపోయిన మావోయిస్టులను త్వరలోనే వారి ప్రాంతాలకు వెళ్లి కలుస్తానని పేర్కొన్నారు.
లొంగిపోయిన పసునూరి నరహరి తుపాకులు, మోర్టార్లు, రాకెట్ ప్రేరిత గ్రెనేడ్లు, గ్రెనెడ్ల తయారీలో సిద్ధహస్తుడని డీజీపీ చెప్పారు. దాంతోపాటు బూబీ ట్రాప్ లను అమలు పరచటంలో అతనికి మంచి నైపుణ్యం ఉందన్నారు. పార్టీలో ధీర్ఘకాలంగా పని చేసిన పసునూరి నరహరి సంస్థాగత బాధ్యతలను నిర్వర్తిస్తూనే ఆయుధాల ఉత్పత్తి, మరమ్మత్తు, నిర్వహణకు సంబంధించి పార్టీ సభ్యులకు శిక్షణ ఇస్తూ వచ్చారన్నారు. వరంగల్ లోని ఎల్బీ కాలేజీలో డిగ్రీ చదువుతున్న సమయంలో రాడికల్ స్టూడెంట్ యూనియన్ తో సంబంధాలు ఏర్పరుచుకున్నట్టు చెప్పారు. 1982లో పీపుల్స్ వార్ (ప్రస్తుత మావోయిస్టు పార్టీ) ఆంధ్రప్రదేశ్ కమిటీ కార్యదర్శి పులి అంజయ్య ప్రభావం, ప్రేరణతో అజ్ఞాతంలోకి వెళ్లినట్టు తెలియచేశారు. మొదట ఛత్తీస్ ఘడ్ రాష్ట్రం సుక్మా జిల్లా కుంట దళంలో చేరి ఆ తరువాత అంచెలంచెలుగా పార్టీ సెంట్రల్ కమిటీ సభ్యునిగా ఎదిగాడని వివరించారు.
Also Read: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో టాలీవుడ్ నిర్మాతలు భేటీ.. ఈ సారైనా..
లొంగిపోయిన పసునూరి నరహరికి 25 లక్షలు, మేదర దానమ్మకు 20 లక్షల రూపాయల డిమాండ్ డ్రాఫ్ట్ లను డీజీపీ అందచేశారు. దాంతోపాటు లొంగిపోయిన మావోయిస్టుల కోసం తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పునరావాస ప్రయోజనాలన్నీ అందిస్తామని చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ నేపథ్యంలో లొంగిపోయిన మావోయిస్టులకు హెల్త్ కార్డుల జారీ ప్రక్రియ కొనసాగుతోందన్నారు. ఎస్ఐబీ అంకితభావం…సమన్వయ కృషి వల్లనే తెలంగాణ పోలీసులు వామపక్ష తీవ్రవాదాన్ని ఎదుర్కోవటంలో గణనీయ ఫలితాలను సాధించగలిగినట్టు చెప్పారు.
ప్రస్తుతం మావోయిస్టు పార్టీలో తెలంగాణకు చెందిన కేంద్ర కమిటీ సభ్యుడు ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్ గణపతి, జాగే రత్నాభాయి అలియాస్ సుజాత, వార్త శేఖర్ అలియాస్ మంగూ కూడా జనజీవన స్రవంతిలోకి రావాలని డీజీపీ పిలుపునిచ్చారు. లొంగిపోతే ప్రభుత్వం నుంచి వచ్చే అన్ని ప్రయోజనాలను అందించటంతోపాటు సదుపాయాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు.
లొంగిపోయిన పసునూరి నరహరి మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో సాయుధ పోరాటం కష్టసాధ్యంగా మారిందని చెప్పారు. జార్ఖండ్ లోని మావోయిస్టు పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు మిసిరి బిశ్రా అనుమతి తీసుకున్నతరువాతే ప్రజా జీవితంలోకి వచ్చామని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం లొంగిపోయిన మావోయిస్టుల కోసం అమలు చేస్తున్న పునరావాస పథకాలు కూడా జనజీవన స్రవంతిలోకి రావటానికి ఒక కారణమని చెప్పారు. తెలంగాణ ప్రజల హక్కుల సాధన చట్టపరంగానే జరగాలని భావిస్తున్నానన్నారు. మావోయిస్టు అగ్రనేత ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్ గణపతి కూడా జనజీవన స్రవంతిలోకి రావాలని కోరారు. కార్యక్రమంలో అదనపు డీజీపీ మహేశ్ భగవత్, ఇంటెలిజెన్స్ ఛీఫ్ విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Also Read: బాల్క సుమన్ వ్యాఖ్యలపై.. సామ రామ్మోహన్ రెడ్డి ఫైర్..!