Big Stories

MLC Elections: సమరానికి సై అంటున్న పార్టీలు.. పట్టభద్రుల ఎన్నికలపై ఫోకస్

Telangana MLC Elections 2024: రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఉప ఎన్నికల సందడి మొదలైంది. ఈ నెల 27న వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉమ్మడి .జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఉప ఎన్నికలకు పోలింగ్ జరగనుంది. లోక్ సభ ఎన్నికలు ముగియడంతో అన్ని పార్టీలు ఎమ్మెల్సీ ఎన్నికలపై ఫోకస్ పెంచాయి. నామినేషన్ల ఉపసంహరణ అనంతరం 52 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు.

- Advertisement -

వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రల నియోజకవర్గాల్లో మొదటి నుంచి బీఆర్ఎస్ కంచుకోట. ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగిన ప్రతిసారి బీఆర్ఎస్ ఘన విజయం సాధించింది. 2007లో జరిగిన మొదటి ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా కపిలవాయి దిలీప్ కుమార్ గెలిచారు. అనంతరం తెలంగాణ రాష్ట్ర సాధనల కోసం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలతో పాటు ఎమ్మెల్సీలు రాజీనామా చేయగా, 2009లో జరిగిన ఉప ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ అభ్యర్థి దిలీప్ కుమార్ విజయం సాధించారు. ఆయన పదవీ కాలం పూర్తి కావడంతో అనంతరం జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి గెలిచారు. 2021లో జరిగిన ఎన్నికల్లోనూ రెండో సారి ఆయనే గెలిచారు. గత ఎన్నికల్లో జనగామ ఎమ్మెల్యేగా గెలుపొందడంతో ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు.

- Advertisement -

వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గం పరిధిలో 4,61,806 మంది పట్టభద్రులు ఓటర్లుగా ఉన్నారు. ఇందులో 87,887 మంది పురుషులు కాగా, 1,74, 794 మంది మహిళలు. అయితే ఈ ఉప ఎన్నికను కూడా ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఉప ఎన్నిక బరిలో 52 మంది అభ్యర్థులు ఉన్నా..ప్రధాన పోరు కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న, బీజేపీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డిల మధ్య ఉండబోతోంది.

మూడు ఉమ్మడి జిల్లాల పరిధిలో రెండు సీట్లు మినహా మిగతా స్థానాలు అన్నీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు విజయం సాధించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత జరుగుతున్న మొదటి గ్రాడ్యూవేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు కావడంతో ఎలాగైనా ఎమ్మెల్సీ స్థానాన్ని కైవసం చేసుకుని తెలంగాణలో విద్యావంతులు తమ వైపే ఉన్నారని చాటేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తోంది కాంగ్రెస్.

జిల్లాల వారీగా ఇన్ చార్జి నియామకాలు, సమావేశాలు ఏర్పాటు చేసి ప్రచారంలో దూసుకుపోతున్నారు కాంగ్రెస్ నేతలు. ఎప్పటికప్పుడు సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఇన్చార్జి దీపా దాస్ మున్షీ కూడా మానిటరింగ్ చేస్తున్నారు. 2021 ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసిన తీన్మార్ మల్లన్న రెండో స్థానంలో నిలిచారు. ఈసారి ఆయన కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో దిగారు. ఉప ఎన్నికపై మూడు జిల్లాల ముఖ్య నేతలతో సమావేశాలు కూడా పూర్తి అయ్యాయి.

పార్లమెంట్ ఎన్నికల్లోను నల్గొండ, ఖమ్మం, వరంగల్ పార్లమెంట్ పరిధిలో జరిగిన ప్రచార కార్యక్రమాల్లో సభలు సమావేశాల్లో నవీన్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారని జనాలకు పరిచయం చేశారు. దానితో అప్పటికి సగానికి పైగా ప్రచారాన్ని పూర్తి చేసుకుంది కాంగ్రెస్ పార్టీ. ఇక రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికలు పూర్తి కావడంతో పార్టీ ముఖ్య నాయకులు ఎమ్మెల్సీ ఉప ఎన్నికపై ప్రత్యేక దృష్టి పెట్టారు.

Also Read: బీఆర్ఎస్‌.. కథ అడ్డం తిరుగుతోందా..? 130 మందిని రమ్మంటే.. 30 మందే, ఎందుకిలా..?

ఎమ్మెల్సీ ఉప ఎన్నికపై బీజేపీ కూడా సీరియస్ గానే ఫోకస్ చేస్తోంది. గెలిపే లక్ష్యంగా వ్యూహాలను రచిస్తోంది. గ్రాడ్యుయేట్లను తమ వైపుకు తిప్పుకోవడానికి బీజేపీ తీవ్ర కసరత్తు చేస్తోంది. ఎన్నికల్లో సత్తా చాటాలని భావిస్తుంది. నిరుద్యోగులు ఎక్కువగా అధికారంలో ఉన్న పార్టీకి వ్యతిరేకంగా ఉంటారు కాబట్టి అంది వచ్చిన అవకాశాన్ని బీజేపీ క్యాష్ చేసుకోవాలని భావిస్తోంది. గత ఎన్నికల్లో పోటీచేసిన ప్రేమేందర్ రెడ్డినే కమలం పార్టీ మరోసారి బరిలో దింపింది. అన్ని పార్టీలు ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. అయితే ఓటర్లు ఎవరిని గెలిపిస్తారో తెలుసుకోవాలంటే మాత్రం ఫలితాలు వచ్చే వరకూ వేచిచూడాల్సిందే.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News