Allu Arjun vs Mahesh Goud: హీరో అల్లు అర్జున్ నిన్న మీడియా సమావేశంలో చేసిన ప్రకటనలపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్న పరిస్థితి తెలిసిందే. తాజాగా అల్లు అర్జున్ పై తెలంగాణ కాంగ్రెస్ పార్టీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సంచలన కామెంట్స్ చేశారు. సినిమా హీరో అంతమాత్రాన ఎవరి ప్రాణాలనైనా తీసే హక్కు ఉందా అంటూ మహేష్ గౌడు నేరుగా అల్లు అర్జున్ ను ప్రశ్నించారు.
నిజామాబాద్ పర్యటనలో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆదివారం బన్నీని ఉద్దేశించి మాట్లాడారు. మహేష్ గౌడ్ మాట్లాడుతూ.. పేద కుటుంబానికి చెందిన మహిళ చనిపోతే లేని బాధ, అల్లు అర్జున్ కేసు విషయానికి సంబంధించి అందరూ హీరోకు సానుభూతిగా మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. అల్లు అర్జున్ పై అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన తీరు సమంజసంగా ఉందని, ప్రజల్లో ప్రభుత్వం పై వస్తున్న పలు అనుమానాలను సీఎం నివృత్తి చేశారన్నారు.
కేంద్రమంత్రి బండి సంజయ్ చేసిన విమర్శలపై మహేష్ గౌడ్ శివాలెత్తారు. అల్లు అర్జున్ కు మద్దతుగా బండి సంజయ్ మాట్లాడిన తీరును తప్పు పట్టిన మహేష్ గౌడ్, సినీ పరిశ్రమపై తమకు కూడా ప్రేమ ఉందని, కానీ ప్రజల ప్రాణాలు ముఖ్యమన్న విషయాన్ని బండి సంజయ్ మరిచిపోయారన్నారు. ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకు ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయని, సంధ్యా థియేటర్ తొక్కిసలాటలో ఒక మహిళ మృతి చెంది, అభం శుభం తెలియని పాపకు తల్లి దూరమైందన్న విషయాన్ని కూడా ఎవరూ పట్టించుకోకపోవడం దారుణమన్నారు.
చిత్ర పరిశ్రమ అంటే కాంగ్రెస్ పార్టీకి అభిమానం ఉందని, మెగాస్టార్ చిరంజీవికి కేంద్రం మంత్రి పదవి ఇచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీనన్న విషయాన్ని టాలీవుడ్ పెద్దలు గుర్తించాలన్నారు. సినీ ఇండస్ట్రీ మద్రాస్ నుండి హైదరాబాద్ రావడానికి ప్రధాన కారణం కూడా కాంగ్రెస్ పార్టీగా వర్ణించిన మహేష్ గౌడ్, తమకు ఏ వ్యక్తులపై ద్వేషాలు ఉండవని, ప్రభుత్వం దృష్టిలో అందరూ సమానమే అంటూ మాట్లాడారు. ఈ కేసులో చట్టం తన పని తాను చేసుకుపోతుందని, చట్టానికి ఎవరు అతీతులు కారన్నారు.
ఇక ఫార్ములా ఈ రేసింగ్ కేసు కు సంబంధించి మహేష్ గౌడ్ మాట్లాడుతూ రాష్ట్రాన్ని పదేళ్లపాటు ఏదేక్షగా దోచుకున్న కుటుంబం కెసిఆర్ కుటుంబమంటూ విమర్శించారు. ఫార్ములా ఈ రేసింగ్ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ అడ్డంగా దొరికిపోయారన్నారు. మొన్నటి వరకు జైలుకు వెళ్లేందుకు కూడా తాను సిద్ధమంటూ చెప్పిన కేటీఆర్, ఇప్పుడు కోర్టును ఆశ్రయించడం మరెందుకంటూ మహేష్ గౌడ్ ప్రశ్నించారు.