Sandhya Theater Incident: సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగింది. ఎవరికి వారు పరుగులు పెడుతున్నారు. ఒక్కసారిగా కేకలు మార్మోగాయి. అంత మంది జనాభా మధ్య అందరినీ అప్రమత్తం చేస్తూ, ఏకంగా రెండు ప్రాణాలు కాపాడేందుకు విశ్వప్రయత్నం చేశారు వారు. వారే అప్రమత్తంగా లేకుండా ఉండి ఉంటే, అక్కడ పరిస్థితి మరోలా ఉండేది. అంతేకాదు శ్రీ తేజ్ ప్రాణానికి అడ్డుకట్ట వేసి, నేడు ఆ చిన్నారి కోలుకొనేలా చర్యలు తీసుకుంది కూడా వారే. కానీ వారి కృషి మాత్రం ఆ హీరోకు పట్టీ పట్టనట్లు ఉందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇంతకు వారెవరు? అసలేం చేశారు?
పుష్ప 2 సినిమా విడుదల సంధర్భంగా సంధ్యా థియేటర్ వద్దకు భారీగా అభిమానులు వచ్చేశారు. వారిలో రేవతి కుటుంబ సభ్యులు ఒకరు. భర్త భాస్కర్, రేవతి, ఇద్దరు చిన్నారులు సినిమా చూసేందుకు వచ్చారు. నెలకు కేవలం రూ. 30 వేల ఆదాయం పొందే భాస్కర్, కొడుకు పట్టుబట్టడంతో ఒక్కొక్క టికెట్ రూ. 1200 చొప్పున మొత్తం 3 టికెట్లను రూ. 3600 అందజేసి కొనుగోలు చేశారు. ఇక సినిమా చూసే సమయం వచ్చింది. అంతలోనే హీరో అల్లు అర్జున్ అక్కడికి వస్తున్నట్లు తెలిసి, వారు పడ్డ ఆనందం అంతా ఇంతా కాదు. కానీ అలా హీరో రావడంతో ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది.
ఆ తొక్కిసలాటలో రేవతి, కుమారుడు శ్రీ తేజ్ లు ఇరుక్కుపోయారు. ఓ వైపు భాస్కర్, తన పాపను చేతిలో పట్టుకొని భార్య, కుమారుడి కోసం వెతుకుతున్నారు. అంతలోనే రేవతి, తన కుమారుడిని పట్టుకొని ఉన్న క్రమంలో అభిమానుల ఉరుకులు పరుగులు అధికమయ్యాయి. దీనితో ఎలాగైనా తన కొడుకు ప్రాణాన్ని నిలబెట్టుకొనేందుకు తల్లిగా తన ప్రాణం అడ్డువేసి తొక్కిసలాటలో అలాగే ఉండిపోయింది రేవతి. పోలీసులు ముందే ప్రమాదాన్ని పసిగట్టి అప్రమత్తమయ్యారు.
రేవతి ప్రాణం కొట్టుమిట్టాడుతోంది. పోలీసులు సీపీఆర్ చేశారు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఆమె ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. అంతవరకు ఓకే ఇక్కడే పోలీసులు చేసిన ఓ ప్రయత్నం ఒక ప్రాణాన్ని నిలబెట్టింది. శ్రీ తేజ్ అపస్మారక స్థితికి వెళ్ళిన సమయంలో పోలీసులు ఏ మాత్రం ఆలస్యం చేయకుండా, సీపీఆర్ చేశారు. కాళ్లు , చేతులు రుద్ది తమ ప్రయత్నం సాగించారు. వెంటనే కొద్దిగా చలనం వచ్చిన వెంటనే హుటాహుటిన అంత మంది అభిమానుల సమూహంలోనూ, శ్రీతేజ్ ను హాస్పిటల్ కు తరలించారు. మొన్నటి వరకు విషమంగా ఉన్న అతని ఆరోగ్యం ఇప్పుడిప్పుడే కుదుటపడుతోంది. ఇక్కడ శ్రీ తేజ్ ప్రాణానికి రక్షణ కల్పించింది మాత్రం తెలంగాణ పోలీసులే.
Also Read: Allu Arjun Case – BRS YCP: అల్లు అర్జున్ విషయంలో బీఆర్ఎస్, వైసీపీ.. ఐటెం రాజాలు అవుతున్నారా?
అక్కడ విధుల్లో గల పోలీసులు కాస్త ఆలస్యం చేసి ఉన్నా, పరిస్థితి మరింత చేజారేదని స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మొత్తం మీద రెండు ప్రాణాలను కాపాడేందుకు పోలీసులు విశ్వ ప్రయత్నం చేసినా, దురదృష్టవశాత్తు రేవతి మృతి చెందింది. అయితే పోలీసుల ప్రథమ చికిత్సతోనే శ్రీ తేజ్ కు పెను ప్రమాదం తప్పిందని చెప్పవచ్చు. అందుకే ఈ ఘటనకు సంబంధించి తెలంగాణ పోలీసులకు ప్రజల నుండి పూర్తి మద్దతు లభిస్తోంది. అక్కడ జరగాల్సిన భారీ తొక్కిసలాటను పోలీసులు నియంత్రించడంతోనే ప్రాణనష్టం ఒక్కరితో ఆగిందన్న విషయం కూడా హీరో అల్లు అర్జున్ దృష్టికి వెళ్లిందో లేదో కానీ, ఈ ఘటన ఇప్పుడు సంచలనంగా మారింది.