TTD Good news :
⦿ రాష్ట్ర ప్రజాప్రతినిధులకు టీటీడీ శుభవార్త
⦿ వారానికి రెండుసార్లు సిఫార్సు లేఖలకు పర్మిషన్
⦿ భక్తుల పట్ల నిర్లక్ష్యం వద్దన్న మంత్రి కొండా సురేఖ
తిరుమల, స్వేచ్ఛ: ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ వేరు అయ్యాక, ఇక్కడి నేతల సిఫార్సు లేఖలు తిరుమలలో అనుమతించడం లేదు. దీనిపై ఎప్పటి నుంచో వివాదం కొనసాగుతోంది. అప్పుడప్పుడు తెలంగాణ నేతలు తిరుమలలో పర్యటిస్తూ ఈ విషయాన్ని గుర్తు చేస్తూ తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈమధ్య అయితే, ఎవరు అక్కడకు వెళ్లినా దీని గురించే ప్రస్తావిస్తున్నారు. ఈ నేపథ్యంలో టీటీడీ దీనిపై దృష్టి పెట్టి, తాజాగా కీలక ఆదేశాలు జారీ చేసింది.
వారానికి రెండుసార్లు
తెలంగాణ లీడర్ల సిఫార్సు లేఖలపై టీటీడీ బోర్డు తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. బోర్డులో మెజార్టీ సభ్యులు సిఫార్సు లేఖలను పరిగణనలోకి తీసుకోవాలని కోరడంతో, వారానికి రెండు సార్లు తెలంగాణ నేతల సిఫార్సు లేఖలు అనుమతించాలని నిర్ణయించింది.
భక్తులపై నిర్లక్ష్యం వద్దు – కొండా సురేఖ
శుక్రవారం మంత్రి కొండా సురేఖ శ్రీశైలం మల్లికార్జున స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. దర్శనం తర్వాత మీడియాతో మాట్లాడుతూ, తమ దురదృష్టం వల్ల శ్రీశైలం క్షేత్రాన్ని కోల్పోయామని అన్నారు. తిరుమలలో తెలంగాణ భక్తుల పట్ల గత ప్రభుత్వం నుంచే నిర్లక్ష్యం వహిస్తున్నారని మండిపడ్డారు. దీనిపై ప్రస్తుత ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నట్టు తెలిపారు. తెలంగాణ వారికి గతంలో దక్కిన విధంగానే ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. అలాగే, తెలంగాణలో ఆలయాలు, కల్యాణ మండపాల నిర్మాణం కోసం టీటీడీ ముందుకు రావాలని కోరారు మంత్రి.