TVVP Directorate: స్వేచ్చ బ్యూరో: తెలంగాణ వైద్య విధాన పరిషత్ ని కార్పొరేషన్ స్థాయి నుంచి ప్రభుత్వ డైరెక్టరేట్‌గా మారుస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నప్పటికీ, ఆచరణలో మాత్రం ‘డైరెక్షన్’ కరువైంది.డైరెక్టరేట్ గా మార్చుతూ ఉత్తర్వులు ఇచ్చినా.. ఆ తర్వాత ప్రాసెస్ పెండింగ్ లోనే ఉన్నది.పైగా పదవీ విరమణ పొందిన కమిషనర్ పోస్టులో కొత్త అధికారిని నియమించలేదు. తద్వారా అడ్మినిస్ట్రేషన్ పూర్తిగా మందగించిందని ఉద్యోగులు చెప్తున్నారు. వైద్య విధాన పరిషత్ నిర్వహణను మరింత బలోపేతం చేయడానికి, ఉద్యోగుల ప్రయోజనాలను కాపాడటానికి దీనిని ప్రభుత్వ పరిధిలోని డైరెక్టరేట్‌గా కన్వర్ట్ చేశారు. ఈ మార్పుతోనైనా వ్యవస్థలో వేగం పెరుగుతుందని, ఆస్పత్రుల నిర్వహణ మెరుగవుతుందని అందరూ ఆశించారు.
కానీ, క్షేత్రస్థాయిలో పరిస్థితి దానికి భిన్నంగా ఉంది. కార్పొరేషన్ నుంచి డైరెక్టరేట్‌గా మారిన తర్వాత నూతన బాస్ ను ఇప్పటికీ నియమించలేదు. అంతేగాక డైరెక్టరేట్ పరిధిలో వర్క్ డివిజన్ ఎలా ఉంటుంది? అధికారులు ఏ విధంగా పనిచేయాలి? అనే అంశాలపై ప్రభుత్వం నుంచి స్పష్టత రాలేదు.ఈ నేపథ్యంలో కొత్త రూల్స్, పాత పద్ధతుల మధ్య సమన్వయం కుదరక ఫైళ్ల కదలిక పూర్తిగా ఆగిపోయిందని ఆ విభాగాపు అధికారులే చెప్తున్నారు. పాలనాపరమైన అనుమతులు ఇవ్వాలన్నా, నిధులు విడుదల చేయాలన్నా ఫుల్-టైమ్ కమిషనర్ లేకపోవడం పెద్ద శాపంగా మారింది. ఫైళ్లపై సంతకాలు పెట్టే గతి లేక, టీవీవీపీ హెడ్‌క్వార్టర్స్‌లో ఫైళ్లు పేరుకుపోతున్నట్లు తెలుస్తున్నది.
Also read: పొలిటికల్ ఎంట్రీపై రాఘవ లారెన్స్ ఊహించని ట్విస్ట్.. 16 నిమిషాల సుదీర్ఘ వీడియోతో!
డైరెక్టరేట్‌లో నెలకొన్న ఈ సిచ్వేషన్ తో ఉద్యోగుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది.రెగ్యులర్ ఫైళ్లతో పాటు పదోన్నతులు వంటి కీలకమైన ఫైళ్లు కూడా ఆగిపోయాయని అధికారులు చెప్తున్నారు. ఆస్పత్రుల్లో సిబ్బంది కొరత వేధిస్తున్నా, కొత్త నియామకాలకు సంబంధించిన ఫైళ్లు క్లియరెన్స్ కావడం లేదు. దీనివల్ల ఉన్న సిబ్బందిపై పనిభారం విపరీతంగా పెరుగుతోంది.ప్రభుత్వ నిర్ణయం వల్ల తమకు మేలు జరుగుతుందని భావించిన ఉద్యోగులు, ఇప్పుడు నెలకొన్న అనిశ్చితిని చూసి తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జీతభత్యాల చెల్లింపులు, పీఎఫ్, గ్రాట్యుటీ వంటి సాంకేతిక అంశాల్లో కూడా స్పష్టత కరువైందని వారు వాపోతున్నారు.”కార్పొరేషన్ నుంచి డైరెక్టరేట్‌గా మార్చడం మంచిదే, కానీ దానికి తగ్గట్టుగా పరిపాలనా యంత్రాంగాన్ని వెంటనే చక్కదిద్దాలి. కమిషనర్‌ను నియమించకుండా, ఫైళ్లను పెండింగ్‌లో పెడితే వ్యవస్థ ఎలా నడుస్తుంది?” అని ఉద్యోగ సంఘాల నేతలు ప్రశ్నిస్తున్నారు.
వైద్య విధాన పరిషత్ పరిధిలోని వందలాది ఆస్పత్రులు, లక్షలాది మంది రోగుల భవిష్యత్తు దీనిపైనే ఆధారపడి ఉంది. ప్రభుత్వం వెంటనే స్పందించి పూర్తి స్థాయి కమిషనర్/డైరెక్టర్ ను వెంటనే నియమించాలి.డైరెక్టరేట్ పరిధిలోని అడ్మినిస్ట్రేటివ్ గందరగోళాన్ని తొలగించి, పెండింగ్ ఫైళ్లను యుద్ధప్రాతిపదికన క్లియర్ చేయాలి.అంతేగాక ఉద్యోగుల ప్రమోషన్లు, కొత్త రిక్రూట్‌మెంట్ల ప్రక్రియను వేగవంతం చేయాలి.అప్పుడే డైరెక్టరేట్‌కు నిజమైన ‘డైరెక్షన్’ దొరుకుతుంది, ప్రజలకు మెరుగైన వైద్యం అందుతుంది. ఇటీవల జరిగిన నర్సింగ్ రిక్రూట్ మెంట్ లో టీవీవీపీకి సుమారు 400 మంది నర్సింగ్ ఆఫీసర్లను కేటాయించారు. అయితే వీరికి ఇప్పటికీ కౌన్సిలింగ్ నిర్వహించలేదు. పబ్లిక్ హెల్త్, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ లో కౌన్సిలింగ్ పూర్తయి, పోస్టింగ్ ఆర్డర్లు కూడా ఇచ్చేశారు. కానీ వైద్య విధాన పరిషత్ లో క్లారిటీ లేదు. ఆయా అభ్యర్ధులకు సరైన సమాచారం ఇవ్వడం లేదు. దీంతో నర్సింగ్ ఆఫీసర్లు కూడా గందరగోళంలో ఉన్నారు.
Also read: కాంగ్రెస్ రైతు ఆశీర్వాద సభ కాదు.. రైతు వంచన సభ-హరీష్‌రావు ఎద్దేవా