
Korutla deepti case live updates(Telangana news today):
జగిత్యాల జిల్లా కోరుట్లలో దీప్తి అనుమానాస్పద మృతి కేసులో ఇంకా మిస్టరీ వీడలేదు. తాను అక్కని చంపలేదంటూ, దీప్తి చెల్లెలు చందన తమ తమ్ముడు సాయికి ఆడియో మెసేజ్ పంపడంతో.. దాని ఆధారంగా పోలీసులు విచారణ వేగవంతం చేశారు. కోరుట్ల బస్టాండులో చందనతో పాటు సీసీ ఫుటేజ్‌లో కనిపించిన వ్యక్తి ఆమె బాయ్‌ఫ్రెండ్ కాదని ప్రాథమికంగా నిర్ధారణ కావడంతో.. ఆ దిశగా దర్యాప్తు చేపట్టారు.
చందన బాయ్‌ఫ్రెండ్ కారులో వచ్చి ఉండొచ్చనే అనుమానంతో.. పోలీసులు ఆమె ఇంటి పరిసరాల్లోని సీసీ ఫుటేజ్‌లను పరిశీలిస్తున్నారు. చందన పంపిన వాయిస్ మెసేజ్ వచ్చిన సెల్‌ఫోన్ లొకేషన్ ఆధారంగా హైదరాబాద్ చేరుకున్న రెండు బృందాలు.. ఆమె కోసం గాలిస్తున్నాయి. చందన సెల్‌ఫోన్ లొకేషన్ ఎక్కడెక్కడ చూపించింది? అనేది పరిశీలిస్తుండగా.. ఒకసారి నెల్లూరులో చూపినట్లు సమాచారం. దాంతో.. చందన ఎవరెవరితో మాట్లాడుతోంది? అనేది తెలుసుకోవడంతో పాటు.. ఆమె తన బాయ్‌ఫ్రెండ్‌కి కాల్ చేసి ఉంటే, అతని నెంబర్‌ని కూడా ట్రేస్ చేసే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు.
మరోవైపు.. దీప్తి ఇంట్లో ఉన్న 2 లక్షల రూపాయల నగదు, సుమారు అరకేజీ బంగారం మాయమైనట్లు సమాచారం. ఇంట్లో నుంచి తాను డబ్బు మాత్రమే తీసుకెళ్తున్నట్లు చందన వాయిస్ మెసెజ్ పెట్టినా.. బంగారం కూడా ఆమె తీసుకెళ్లి ఉంటుందని అనుమానిస్తున్నారు. చందన తన క్లాస్‌మేట్‌తో సన్నిహితంగా ఉంటుందని, అతడితోనే వెళ్ళిపోయి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. మద్యం మత్తులో దీప్తి తన బాయ్‌ఫ్రెండ్‌ను ఇంటికి రమ్మన్నదని చందన చెప్పడం కూడా కేసును తప్పుదోవ పట్టించేలా ఉందని అనుమానిస్తున్నారు. తాను ఇంటి నుంచి వెళ్లిపోయాక గుర్తుతెలియని వ్యక్తులు ఇంటికి వచ్చారేమోనని.. చందన మెసేజ్ ద్వారా తెలిపే ప్రయత్నం చేయడంతో.. దీప్తి మరణంతో తనకు గానీ, తన బాయ్‌ఫ్రెండ్‌కి గానీ సంబంధం లేదని ఆమె నమ్మించే ప్రయత్నం చేస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దీప్తి సెల్‌ఫోన్ కాల్ డేటా ఆధారంగా కూడా దర్యాప్తు జరుపుతున్నారు.
ఇక.. చనిపోయిన దీప్తి శరీరంపై గాయాలు ఉన్నట్లు పోస్ట్‌మార్టం చేసిన డాక్టర్లు గుర్తించారని సమాచారం. దీప్తి టీ షర్ట్ లోపలివైపున కమిలిపోయిన గుర్తులు, చెంపలపై గీసుకుపోయి గుర్తులు ఉన్నట్లు చెబుతున్నారు. ఆమె మణికట్టు దగ్గర కూడా గాయాలు ఉండటంతో.. దీప్తి చేతులు కట్టేశారనే అంచనాకు వచ్చారు. పోస్ట్‌మార్టం షార్ట్ రిపోర్ట్ వచ్చినా.. పోలీసులు మాత్రం పూర్తి పోస్ట్‌మార్టం రిపోర్ట్ కోసం ఎదురుచూస్తున్నారు.