Rythu Bheema Scam: ఈ కలికాలంలో అన్యాయం నాలుగు పాదాల మీద నడుస్తున్నట్లుంది పరిస్థితి. ఎందుకంటే డబ్బు కోసం ఎంతకైనా దిగజారుతున్నారు కొందరు మూర్ఖులు. మెదక్ జిల్లాలో రైతు బీమా డబ్బుల కోసం.. ఏకంగా చావు నాటకం ప్లే చేశారు. బతికున్న ఇద్దరు రైతులు చనిపోయినట్టు డెత్ సర్టిఫికెట్ సృష్టించి రైతు బీమా సొమ్మును కాజేశారు. ఇటీవల మెదక్ మండలం గుట్టకిందిపల్లిలో జరిగిన ఇంటింటి సమగ్ర కుటుంబ సర్వేతో బాగోతం బట్టబయలైంది.
ఈ చావు నాటకంలో కీలక సూత్రధారి మాజీ సర్పంచ్ కుమారుడు వెంకటేష్. మల్లేశం, శ్రీను అనే ఇద్దరు రైతులు చనిపోయినట్లు..వెంకటేష్ డెత్ సర్టిఫికేట్లు క్రియేట్ చేశాడు. అధికారులు వచ్చినప్పుడు ఎవరికీ అనుమానం రాకుండా వారి భార్యలను.. జులు తీసేసి, బొట్టు చెరిపేయమన్నాడు. అంతేకాకుండా నలుగురు వ్యక్తులతో సాక్ష్యం కూడా చెప్పించాడు.
2021 లో శ్రీను, 2023లో మల్లేశం చనిపోయినట్టు నమ్మించి గ్రామ పంచాయతీ అధికారుల నుంచి డెత్ సర్టిఫికెట్ తీసుకొని రైతు బీమాకి దరఖాస్తులు పెట్టాడు. ప్రక్రియంతా ముగిసాక రైతుల పేరుపై 10 లక్షల రూపాయల బీమా డబ్బు రాగా..అందులో కొంత మొత్తాన్ని వెంకటేష్ గుంజుకున్నాడు. తర్వాత గ్రామంలో కొన్నాళ్లపాటు శ్రీను, మల్లేశాలు ఎక్కడికో వెళ్లిపోయారు. డబ్బు కోసం ఈ డ్రామాలో రైతుల భార్యలు కూడా పాత్రదారులు కావడం విశేషం.
Also Read: నార్సింగి సోలార్ రూఫ్ టాప్ సైకిల్ ట్రాక్ పై ఫేక్ ప్రచారం.. హెచ్ఎండీఏ స్పందన ఇదే!
ఇదిలా ఉంటే కుటుంబ సర్వేకు వచ్చినప్పుడు భర్తలు చనిపోయారని భార్యలు చెప్పడంతో…స్థానికులు షాకై నిలదీశారు. దీంతో సర్వే అధికారులకు అనుమానం రావడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక పోలీసులు వచ్చేలోపే శ్రీను, మల్లేశం కుటుంబాలు…ఇళ్లకు తాళాలు వేసుకుని పారిపోయారు.