E-Paper
Advertisement

ధాన్యం కొనుగోళ్లలో తెలంగాణ నంబర్-1.. కిషన్ రెడ్డిపై ఉత్తమ్ ఫైర్!

ధాన్యం కొనుగోళ్లలో తెలంగాణ నంబర్-1..  కిషన్ రెడ్డిపై ఉత్తమ్ ఫైర్!

Uttam Kumar Reddy: స్వేచ్ఛ బ్యూరో: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి బాధ్యత రాహిత్య వ్యాఖ్యలు చేస్తున్నారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బిజెపి నేతలు రైతులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం మానుకోవాలని హితవు పలికారు. తెలంగాణలో రికార్డు స్థాయిలో ధాన్యం ఉత్పత్తి జరుగుతుండగా, కేంద్ర ప్రభుత్వం మాత్రం రాష్ట్రానికి కేటాయించే ధాన్యం సేకరణ లక్ష్యాలను క్రమంగా తగ్గిస్తూ రైతులకు అన్యాయం చేస్తోందని మండిపడ్డారు.

మీడియాతో మాట్లాడుతూ..

సచివాలయంలో మంగళవారం మీడియాతో మాట్లాడారు. ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ విజయవంతంగా సాగుతుంటే బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ఉద్దేశపూర్వకంగా రైతుల్లో గందరగోళం సృష్టించే ప్రయత్నం చేస్తున్నాయని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాల్సిన బీజేపీ నాయకులు కొనుగోలు కేంద్రాల యాత్రల పేరుతో రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించడం హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు.

కేంద్ర ప్రభుత్వంపై ఉత్తమ్ కుమార్ ఫైర్

తెలంగాణలో ధాన్యం ఉత్పత్తి గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి కేటాయించిన ధాన్యం సేకరణ లక్ష్యాన్ని పెంచాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తాను పలుమార్లు కేంద్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ఆహార శాఖను, భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ) అధికారులను కోరినట్లు తెలిపారు.రాష్ట్ర రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ధాన్యం సేకరణ లక్ష్యాన్ని పెంచాలని పదేపదే విజ్ఞప్తి చేసినప్పటికీ కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదని ఆయన మండిపడ్డారు.

భారీ స్థాయిలో ధాన్యం కొనుగోలు

రైతుల అవసరాలను పక్కనబెట్టి కేవలం పరిమిత లక్ష్యాలను విధించడం వల్ల రాష్ట్రంపై అదనపు భారం పడిందని అన్నారు.అయితే కేంద్రం నిర్లక్ష్యం కారణంగా రైతులు నష్టపోకూడదనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం సాహసోపేత నిర్ణయం తీసుకుని కేంద్రం నిర్దేశించిన లక్ష్యాలకు మించి భారీ స్థాయిలో ధాన్యం కొనుగోలు చేసిందని తెలిపారు.

చరిత్ర సృష్టించి తెలంగాణ

రబీ 2025-26 సీజన్‌లో తెలంగాణలో 65.91 లక్షల ఎకరాల్లో వరి సాగు జరగగా, సుమారు 141 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి అంచనా వేయబడిందని మంత్రి తెలిపారు. కేంద్ర ప్రభుత్వం కేవలం 52 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్య సేకరణ లక్ష్యాన్ని మాత్రమే నిర్దేశించినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం రైతులను ఆదుకునేందుకు ఇప్పటివరకు 75 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి చరిత్ర సృష్టించిందన్నారు.ఈ కొనుగోళ్ల విలువ రూ.17,917 కోట్లకు చేరుకుందని, రైతులకు నేరుగా కనీస మద్దతు ధర చెల్లించామని తెలిపారు.

దేశ రబీ ధాన్యం కొనుగోళ్లలో తెలంగాణదే 61 శాతం

దేశవ్యాప్తంగా జరుగుతున్న రబీ ధాన్యం కొనుగోళ్లలో తెలంగాణ ఒక్కటే 61 శాతం వాటా కలిగి ఉందని మంత్రి వెల్లడించారు.ఆంధ్రప్రదేశ్ 25.03 లక్షల టన్నులు కొనుగోలు చేస్తే తెలంగాణ 75 లక్షల టన్నులు కొనుగోలు చేసి దాదాపు మూడు రెట్లు అధికంగా సేకరించిందన్నారు.
రబీ ధాన్యం కొనుగోళ్లలో దేశంలో నంబర్-1 రాష్ట్రంగా తెలంగాణ నిలవడం రైతుల కృషి, ప్రభుత్వ సమర్థ ప్రణాళికల ఫలితమని పేర్కొన్నారు. ఖరీఫ్, రబీ సీజన్లను కలిపి 2025-26 సంవత్సరంలో తెలంగాణ ప్రభుత్వం 147 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి రాష్ట్ర చరిత్రలోనే కాకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనూ అత్యున్నత రికార్డు నమోదు చేసిందన్నారు.

3 వేలకు పైగా కొత్త కొనుగోలు కేంద్రాలు

మొత్తం 295 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్య ఉత్పత్తిలో 147 లక్షల మెట్రిక్ టన్నులను కొనుగోలు చేసి రైతులకు రూ.35,077 కోట్ల కనీస మద్దతు ధర చెల్లించామని చెప్పారు. 25.20 లక్షల రైతు లావాదేవీలు విజయవంతంగా పూర్తయ్యాయని వివరించారు.రైతు ఇంటి వద్దకే కొనుగోలు సేవలు అందించాలనే లక్ష్యంతో ఖరీఫ్‌లో 8,448 కొనుగోలు కేంద్రాలు, రబీలో 8,575 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని తెలిపారు.దేశంలో రెండో స్థానంలో ఉన్న ఉత్తరప్రదేశ్‌లో 4,850 కేంద్రాలు మాత్రమే ఉండగా తెలంగాణలో వాటికంటే 1.7 రెట్లు ఎక్కువ కేంద్రాలు పనిచేశాయని చెప్పారు. గత రెండు సంవత్సరాల్లోనే 3,000కుపైగా కొత్త కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

కేంద్రంపై విమర్శలు

తెలంగాణలో రబీ ధాన్యం ఉత్పత్తి 28 శాతం పెరిగినప్పటికీ కేంద్ర ప్రభుత్వం కొనుగోలు లక్ష్యాన్ని 79 లక్షల టన్నుల నుంచి 52 లక్షల టన్నులకు తగ్గించిందని విమర్శించారు.ఈ నిర్ణయం వల్ల రైతులు నష్టపోకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం గత రెండు సంవత్సరాల్లో అదనంగా 57 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి రూ.16,645 కోట్ల మద్దతు ధర చెల్లించిందన్నారు. కొనుగోళ్ల కోసం మొత్తం 20.86 కోట్ల గన్నీ సంచులను సిద్ధం చేశామని, వాటిలో 18.75 కోట్ల సంచులను వినియోగించినప్పటికీ ప్రస్తుతం 2.11 కోట్ల సంచులు నిల్వలో ఉన్నాయని తెలిపారు. గన్నీ సంచుల కొరత లేదని స్పష్టం చేశారు.

వర్షాలకు తడిసిన ధాన్యాన్ని కూడా ఆదుకున్నాం

అకాల వర్షాలతో తడిసిన 12,557 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ప్రత్యేక చర్యల ద్వారా బాయిల్డ్ రైస్ మిల్లులకు తరలించి రైతులను ఆదుకున్నామని మంత్రి తెలిపారు. ఆ ధాన్యానికి 12 గంటల వ్యవధిలోనే మద్దతు ధర చెల్లించి రైతులను నష్టాల నుంచి కాపాడామని చెప్పారు.

ప్రతి గింజను కొనుగోలు చేయాలనే లక్ష్యం

ధాన్యం కొనుగోళ్ల నిర్వహణలో మహిళా స్వయం సహాయక సంఘాలు కీలక పాత్ర పోషించాయని మంత్రి కొనియాడారు. ఐకేపీ, పీఏసీఎస్ తదితర సంస్థల ద్వారా 147 లక్షల టన్నుల ధాన్యం సేకరణ జరిగిందని, వారికి రూ.470.40 కోట్ల కమిషన్ లభించిందని వెల్లడించారు.రైతు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేయాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి స్పష్టం చేశారు. ధాన్యం కొనుగోలు పూర్తయ్యే వరకు కొనుగోలు కేంద్రాలు కొనసాగుతాయని తెలిపారు.

బీజేపీ, బీఆర్ఎస్ ఆరోపణలు

బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు రాజకీయ ఆరోపణలు చేయడం మానుకుని కేంద్రంపై ఒత్తిడి తీసుకువచ్చి తెలంగాణ రైతులకు న్యాయం జరిగేలా కృషి చేయాలని మంత్రి సూచించారు. సమావేశంలోమంత్రులు వాకిటి శ్రీహరి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, లోక్‌సభ సభ్యులు రఘువీరారెడ్డి, ఎమ్మెల్సీ శంకర్ నాయక్, ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు, కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి పాల్గొన్నారు.

Also Read: ఇది మెట్రో స్టేషనా? తిరుమల క్యూ లైనా? హైదరాబాద్ వాన బీభత్సం విజువల్స్ చూస్తే షాక్ అవుతారు!

Related News

తెలంగాణను ‘స్కిల్ క్యాపిటల్’గా మార్చడమే లక్ష్యం.. FTCCI వేడుకల్లో శ్రీధర్ బాబు కీలక వ్యాఖ్యలు!

Hyderabad: మీనాక్షీ నటరాజన్‌ రాజ్యసభ నామినేషన్‌ తిరస్కరణ.. ఇంతకీ ఆ కేసు ఏమిటంటే..

ఆఫర్ లెటర్ ఇచ్చి వదిలేయం.. జాబ్‌లో చేరేవరకు మాదే గ్యారెంటీ.. మంత్రి అజారుద్దీన్ హామీ

ఇది మెట్రో స్టేషనా? తిరుమల క్యూ లైనా? హైదరాబాద్ వాన బీభత్సం విజువల్స్ చూస్తే షాక్ అవుతారు!

Flexi Rules: ఫ్లెక్సీలు కట్టాలా అయితే మున్సిపాలిటీకి ఫీజు కట్టాల్సిందే.. రాష్ట్రంలో కొత్త అడ్వర్టైజ్‌మెంట్ పాలసీ!

Huzurabad: హుజురాబాద్‌లో ప్రభుత్వ కళాశాల స్థలం ఆక్రమణకు కుట్ర..!

Swechcha Effect: స్వేచ్ఛ ఎఫెక్ట్.. మంత్రి పొన్నం ప్రభాకర్ ఇలాకాలో నిద్రలేచిన అధికారులు!

×