Uttam Kumar Reddy: తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ప్రచార పర్వం ముగింపు సందర్భంగా రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి పట్టణ స్థానిక సంస్థల అభివృద్ధిపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఫిబ్రవరి 11న జరగనున్న పోలింగ్ నేపథ్యంలో ఆయన తన వారం రోజుల ముమ్మర ప్రచారాన్ని ముగించారు.
తెలంగాణలో పెరుగుతున్న పట్టణీకరణ దృష్ట్యా పట్టణ పాలనకు అత్యంత ప్రాధాన్యత ఉంటుందని ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర జనాభాలో మూడో వంతు కంటే ఎక్కువ మంది పట్టణాల్లోనే నివసిస్తున్నారని ఆయన గుర్తు చేశారు. 3.50 కోట్ల మొత్తం జనాభాలో సుమారు 1.36 కోట్ల మంది పట్టణ ప్రాంతాల్లో ఉన్నారని, ఈ నేపథ్యంలో పట్టణ మౌలిక సదుపాయాల కల్పనకు భారీగా నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చారు.
తాగునీటి సరఫరా, ఇతర పౌర సౌకర్యాల మెరుగుదలకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తామని మంత్రి స్పష్టం చేశారు. లక్షలాది కొత్త రేషన్ కార్డులను మంజూరు చేసి, నాణ్యమైన బియ్యం పంపిణీ ద్వారా ఆహార భద్రతను కల్పిస్తున్నామని కాంగ్రెస్ ప్రభుత్వ విజయాలను వివరించారు. ఎన్నికల తర్వాత కూడా ప్రజల మధ్యే ఉండి, వారి ప్రతి ఫిర్యాదును తక్షణమే పరిష్కరించాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.
నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్-చార్జ్‌గా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి, అంతర్గత సర్వేల ప్రకారం పలు ప్రాంతాల్లో కాంగ్రెస్ ‘క్లీన్ స్వీప్’ చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ముఖ్యంగా నిజామాబాద్ వంటి కీలక ప్రాంతాల్లో కాంగ్రెస్ అభ్యర్థులే మున్సిపల్ పీఠాలను కైవసం చేసుకుంటారని జోస్యం చెప్పారు.
సూర్యాపేట జిల్లాలోని తిర్మలగిరి, హుజూర్‌నగర్, కోదాడతో పాటు నిజామాబాద్ అర్బన్, ఆర్మూర్ వంటి ప్రాంతాల్లో మంత్రి హెలికాప్టర్ పర్యటనలు, బైక్ ర్యాలీలు నిర్వహించారు. అసంతృప్త నేతలను స్వయంగా కలిసి, పార్టీ ఐక్యత కోసం కృషి చేయాలని కోరారు. 123 పట్టణ స్థానిక సంస్థల్లో రేపు (ఫిబ్రవరి 11) పోలింగ్ జరగనుండగా, ఫిబ్రవరి 13న ఫలితాలు వెల్లడి కానున్నాయి.