Hanumantharao: కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. మోదీ సర్కార్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఓబీసీలకు న్యాయం జరగాలంటే కుల గణన జరగాల్సిందేనని మనసులోని మాట బయటపెట్టారు.
శనివారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన, ఓబీసీలకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నా పట్టించుకోలేదన్నారు. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు రాహుల్ గాంధీ పాదయాత్ర చేశారని, సమాజంలో ఎవరి శాతం ఎంతనేది తెలియాలంటే కుల గణన చేయాలని డిమాండ్ చేసిన విషయాన్ని గుర్తు చేశారు.
తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలో బీసీ కుల గణన బిల్లును అసెంబ్లీలో పాస్ చేసిందని, అక్కడ 85 శాతం సర్వే పూర్తయిందన్నారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం ఎందుకు దృష్టి సారించలేదని ప్రశ్నించారు. బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేయడం బీజేపీకి ఇష్టం లేదా అంటూ ప్రశ్నించారు.
ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు 10 శాతం రిజర్వేషన్లు పెట్టారని, అమలు చేసినప్పుడు మేము ఏమి అడ్డుపడలేదన్నారు వీహెచ్. తాను ప్రధాని నరేంద్రమోడీని ఇప్పటివరకు మూడుసార్లు కలిశానని, ఓబీసీలకు న్యాయం జరగాలంటే కుల గణన చేయాలని తెలిపినా పట్టించుకోలేదన్నారు.
ALSO READ: కసి మీద పెద్ద పులి.. ఆ ఏరియాల్లో 144 సెక్షన్
కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలన్నారు వీహెచ్. బడుగు బలహీన వర్గాల యువత వైద్య విద్య అభ్యసించాలంటే ఖర్చుతో కూడిన పనిగా చెప్పారు. మెడికల్ సీటు ఏడాదికి 25 లక్షలు కట్టాలని యాజమాన్యాలు చెబుతున్నాయని, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు ఏ విధంగా వాటిని కడుతారని ప్రశ్నించారు. ఇప్పటికైనా ఓ బీసీల విషయంలో కేంద్రం మనసు మార్చుకుని కుల గణన చేపట్టాలని డిమాండ్ చేశారు.