Velimala Land Scam: సంగారెడ్డి జిల్లా, రామచంద్రపురం మండలం, వెలిమల తండాలో వెలుగు చూసిన ల్యాండ్ స్కామ్ ఇష్యూ ఎస్టీ కమిషన్ దృష్టికి చేరింది. దాదాపు 70 ఏళ్లుగా గిరిజన రైతులు సాగు చేసుకుంటున్న భూములపై బడా రియల్ వ్యాపారుల కన్ను పడింది. గత ప్రభుత్వం గిరిజన రైతులకు అన్యాయం చేస్తూ.. కొత్త సర్వే నెంబర్లతో అనర్హులకు ఈ భూములను కట్టబెట్టిందనే ఆరోపణలున్నాయి. ఈ విషయంపై గతంలోనే బాధితులు కేంద్ర ఎస్టీ కమిషన్‌ను ఆశ్రయించారు. గత నవంబర్‌లో ఈ వివాదంపై ఎస్టీ కమిషన్ బాధిత రైతులతో పాటు రెవెన్యూ అధికారులను ఢిల్లీ పిలిపించి విచారించింది.
బాధిత గిరిజన రైతులు సాగు చేసుకుంటున్న భూముల్లో బడా బాబులకు కొత్త పాసు పుస్తకాలను ఎలా ఇష్యూ చేస్తారని అధికారులను ప్రశ్నించింది ఎస్టీ కమిషన్. అయితే, ఉన్నతాధికారుల ఆదేశాలతోనే ఈ ప్రక్రియ పూర్తి చేసినట్లు వివరించారు అధికారులు. కాగా, అధికారుల సమాధానాలపై ఎస్టీ కమిషన్ సీరియస్ అయినట్టు తెలుస్తోంది. ఈ పూర్తి వ్యవహారంపై సమగ్ర నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించినట్లు సమాచారం.
స్థానిక రెవెన్యూ అధికారులతో పాటు జిల్లా కలెక్టర్, CCLA కమిషనర్ వరకు బడా బాబులకు సహకరిస్తున్నారని కమిషన్ దృష్టికి బాధితులు తీసుకెళ్లారు. ఈ వ్యవహారంపై సీరియస్ అయిన ఎస్టీ కమిషన్ తప్పు తేలితే జిల్లా కలెక్టర్‌తో సహా బాధ్యులైన అధికారులపై కూడా క్రిమినల్ కేసులు నమోదు చేయిస్తామని కమిషన్ హెచ్చరించినట్టు సమాచారం.
వెలిమల గ్రామ రెవెన్యూ పరిధిలోని 88 ఎకరాల బిల్లా దాకాల మిగులు భూములున్నాయి. ఈ భూముల్లో దాదాపు గత 70 ఏళ్లుగా గిరిజన రైతులు సాగు చేసుకుని జీవనం కొనసాగిస్తున్నారు. అయితే ఈ భూములపై కన్నేసిన బడా వ్యాపారులు నిత్యానంద రెడ్డి, కళ్యాణ్ రెడ్డి, విక్రమ్ కుమార్ రెడ్డి ఈ భూమిని తమ వశం చేసుకోవాలని స్కెచ్ వేశారు. గత ప్రభుత్వ అండదండలతో కొత్త సర్వే నెంబర్లతో.. తప్పుడు రిజిస్ట్రేషన్లు చేయించుకొని భూములను కాజేశారని వెలిమల తండా గిరిజనులు ఆరోపిస్తున్నారు.
ఈ భూదందాను పదుల సార్లు స్థానిక అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోవడంతో.. గత నవంబర్ నెలలో కేంద్ర ఎస్టీ కమిషన్ ఆశ్రయించారు గిరిజనులు. గిరిజన రైతులకు న్యాయం చేయాలని ఎస్టీ కమిషన్ అధికారులకు సూచించించింది. అయినప్పటికీ.. అధికారులు పట్టించుకోకపోవడంతో బాధితుల ఫిర్యాదుతో.. తాజాగా మరోసారి ఎస్టీ కమీషన్ విచారణకు పిలిచి, అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.
Also Read: గులాబీలో గుబులు.. సిరిసిల్లలో బయటికొస్తున్న భూకబ్జాలు
తాము దశాబ్దాలుగా సాగుచేసుకుని జీవిస్తున్న భూముల్లో భారీ పోలీసుల బందోబస్తు నడుమ.. వందలాది ప్రైవేట్ సైన్యంతో కొందరు బడాబాబులు అక్రమంగా చొరబడే ప్రయత్నం చేస్తున్నారని వెలిమల గిరిజన రైతులు ఆందోళన కొనసాగిస్తున్నారు. గత రెండేళ్ల కింద రెవెన్యూ అధికారులు తమకు పట్టాలు అందిస్తామని ప్రలోభాలకు గురిచేసి తమతోనే సర్వేనెంబర్ 424 చుట్టూ ఫెన్సింగ్ వేయించారని తెలుపుతున్నారు.
ఇప్పుడు తమను మోసం చేసి.. పక్కన ఉన్న మిగిలిన భూములను కూడా.. విక్రం రెడ్డి తోపాటు నిత్యానంద రెడ్డి, కళ్యాణ్ రెడ్డికి కట్టబెడుతున్నారని ఆగ్రహంవ్యక్తం చేస్తున్నారు. తమ భూములు తమకు దక్కే వరకు పోరాటం ఆగదని.. తమ ప్రాణాలు పోయినా భూములను వదిలే ప్రసక్తే లేదంటున్నారు. సీఎం రేవంత్ రెడ్డి తమపై కరుణ చూపి.. తమ భూముల్ని తమకు అప్పగించేలా చేయాలని ఆవేదన వ్యక్తం చేశారు.