Warangal: తెల్లదొరలకు ఈ ఎయిర్ పోర్ట్ అంటే ప్రాణం. ఔను వారి పాలిట ఇదొక వరం. ఈ ఎయిర్ పోర్ట్ గురించి తెలియని తెల్లదొరలు లేరంటే అతిశయోక్తి కాదు. ఇంతటి ఘన చరిత్ర గల ఎయిర్ పోర్ట్ తెలంగాణలో ఉంది. అయితే ఈ ఎయిర్ పోర్ట్ ఇప్పుడిప్పుడే మళ్లీ నాటి వైభవాన్ని పొందేందుకు సిద్ధమవుతోంది. ఇంతకు ఇంతలా తెల్లదొరలు ఇష్టపడ్డ ఆ విమానాశ్రయం ఏది? ఎక్కడుంది? అసలు ఆ చరిత్ర ఏమిటి తెలుసుకుందాం.
విమానాశ్రయం చరిత్ర..
తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ జిల్లాలో మమ్నూర్ విమానాశ్రయం, 1930లో నిర్మించబడింది. ఇది భారతదేశంలో స్వాతంత్ర్యానికి ముందు కాలంలో నిర్మించబడిన అతిపెద్ద విమానాశ్రయాలలో ఒకటి. ఈ విమానాశ్రయం 1930లో హైదరాబాద్ నిజాం మిర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఆధ్వర్యంలో నిర్మించబడింది. ఇది కాగజ్‌నగర్‌లోని కాగిత పరిశ్రమలు, వరంగల్‌లోని ఆజాం జాహీ మిల్స్ వంటి పరిశ్రమలకు సేవలందించడానికి ఏర్పాటు చేశారు.
1875 ఎకరాల విస్తీర్ణం..
ఈ విమానాశ్రయం, స్వాతంత్ర్యానికి ముందు కాలంలో భారతదేశంలో అతిపెద్ద విమానాశ్రయంగా గుర్తించబడింది. ఇది 1875 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించారు. అలాగే 6.6 కిలోమీటర్ల పొడవైన రన్‌వే, పైలట్ శిక్షణ కేంద్రం, సిబ్బంది నివాసాలు, బహుళ టెర్మినల్స్ వంటి సౌకర్యాలను కలిగి ఉంది.
తెల్లదొరల ప్రేమకు కారణం ఇదే..
రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో, ఈ విమానాశ్రయం బ్రిటిష్ సైన్యం చేత ఉపయోగించబడింది. 1962లో ఇండో – చైనా యుద్ధం సమయంలో, ఢిల్లీ విమానాశ్రయం టార్గెట్ కావడంతో, మమ్నూర్ విమానాశ్రయం ప్రభుత్వ విమానాల కోసం హ్యాంగర్‌గా ఉపయోగించబడింది. యుద్ధ సమయంలో తెల్లదొరలకు ఉపయోపగబడ్డ ఎయిర్ పోర్ట్ కావడంతో పాపం తెల్లదొరలకు ఈ ఎయిర్ పోర్ట్ అంటే తెగ అభిమానమట. ఇక్కడి నుండి వెళ్లే సమయంలో బ్రిటిష్ దొరలు తెగ ఫీలైనట్లు చరిత్రకారులు చెబుతారు. ఈ విమానాశ్రయం ద్వారా అనేక మంది ప్రధానమంత్రులు, రాష్ట్రపతులు ప్రయాణించారు. 1981 వరకు ఇది వాణిజ్య విమాన సేవలను అందించి రికార్డు సృష్టించింది. 1981లో వాణిజ్య కార్యకలాపాలు నిలిపివేయబడిన తర్వాత, ఈ విమానాశ్రయం అనేక దశాబ్దాలుగా నిరుపయోగంగా ఉంది.
ప్రస్తుత పరిస్థితి ఇదే
ప్రస్తుతం, ఈ విమానాశ్రయం నేషనల్ కేడెట్ కార్ప్స్ (NCC) శిక్షణ కార్యక్రమాల కోసం ఉపయోగించబడుతోంది. ఇక్కడ గ్లైడింగ్, స్కీట్ షూటింగ్, ఏరో మోడలింగ్ వంటి కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి. 2023లో, తెలంగాణ రాష్ట్ర కేబినెట్ మమ్నూర్ విమానాశ్రయాన్ని పునరుద్ధరించేందుకు 253 ఎకరాల భూమిని సేకరించేందుకు నిర్ణయం తీసుకుంది. 2024 నవంబర్‌లో, ఈ భూమి సేకరణ కోసం రూ. 205 కోట్లు మంజూరు చేశారు. విమానాశ్రయాన్ని ఆధునీకరించేందుకు, 1.8 కిలోమీటర్ల రన్‌వేను 3.9 కిలోమీటర్లకు విస్తరించడం, కొత్త టెర్మినల్ భవనం నిర్మించడం, ఆధునిక ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ATC) సదుపాయాలు, నావిగేషన్ పరికరాలను ఏర్పాటు చేయడం వంటి చర్యలు చేపట్టబడుతున్నాయి. 2025 ఫిబ్రవరిలో, కేంద్ర ప్రభుత్వం మమ్నూర్ విమానాశ్రయ అభివృద్ధికి అనుమతి ఇచ్చింది. ఈ ప్రాజెక్టు 2.5 సంవత్సరాల్లో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.
Also Read: Naa Anvesh: నా అన్వేష్ ఆటగాడా? పోటుగాడా? జస్ట్ ఆస్కింగ్..
తెలంగాణకే గర్వకారణం
మమ్నూర్ విమానాశ్రయం, తన గొప్ప చరిత్రతో పాటు, భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రానికి విమానయాన రంగంలో కీలక కేంద్రంగా మారే అవకాశం ఉంది. ఇది రాష్ట్ర అభివృద్ధికి, పరిశ్రమల పెరుగుదలకు, ప్రాంతీయ కనెక్టివిటీకి దోహదపడేలా ఉంది. ప్రస్తుతం తెలంగాణలో గల శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు ధీటుగా ఈ ఎయిర్ పోర్ట్ నిర్మితం కానుందని చెప్పవచ్చు. సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించి, ఈ ఎయిర్ పోర్ట్ అభివృద్ధి కోసం కేంద్రాన్ని ఒప్పించారని చెప్పవచ్చు. అంతేకాదు ఎయిర్‌పోర్ట్ విస్తరణ కోసం 253 ఎకరాల భూమిని సేకరించేందుకు తెలంగాణ ప్రభుత్వం రూ.205 కోట్లు మంజూరు చేసింది.