KTR: బీఆర్ఎస్ రజతోత్సవ కార్యక్రమం.. ప్రజా ఉత్సవంగా జరపాలని నిర్ణయించామని పార్టీ మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. తెలంగాణ భవన్ లో మాజీ సీఎం కేసీఆర్ అధ్యక్షతన పార్టీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం జరిగిన విషయం తెలిసిందే. సమావేశం అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడారు.
విప్లవ పోరాటం, ప్రజా ఉద్యమాలకు పురటిగడ్డ తెలంగాణ అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. తెలంగాణ పోరాటంలో ప్రాణ త్యాగాల గురించి సమావేశంలో గుర్తు చేసుకున్నామని అన్నారు. రాబోయే కాలంలో పార్టీ కార్యక్రమాలపై కేసీఆర్ దిశానిర్దేశం చేశారని చెప్పారు. అధికారమే పరిమావధిగా పని చేసే యోచన తమకు లేదని పేర్కొన్నారు. తెలంగాణ అస్తిత్వం, ప్రజల ప్రయోజనాలే తమకు ముఖ్యమని తెలిపారు. బీఆర్ఎస్ రజతోత్సవాలను ఏడాది పాటు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఉత్సవాల నిర్వహణకు సీనియర్ నేతల ఆధ్వర్యంలో త్వరలోనే కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్లు మాజీ మంత్రి కేటీఆర్ చెప్పుకొచ్చారు.
పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ ముఖ్యులు 30 మంది మాట్లాడారని కేటీఆర్ చెప్పారు. ‘రాష్ట్రానికి ఏనాటికైనా బీఆర్ఎస్సే రక్షణ కవచం.. గతంలో తెలంగాణ ప్రజలను కాంగ్రెస్ పార్టీ ఎలా అవమానించిందో తమ పార్టీ అధినేత కేసీఆర్ గుర్తుచేశారు. ప్రజా పోరాటంలో బీఆర్ఎస్ వెనక్కి తగ్గదు.. ఎంతో మంది త్యాగాలు చేసి పోరాటం చేస్తే తెలంగాణ వచ్చింది. 2001 ఏప్రిల్ 27న జలదృశ్యంలో మొదలైన పార్టీ 25 ఏట అడుగుపెడుతుంది.గతంలో జరిగిన పోరాటాలు అన్నింటినీ గుర్తు చేస్తూ కేసీఆర్ మాట్లాడారు. ప్రస్తుత రాజకీయ పరిణామాలు మా నేతల అందరికీ దిశానిర్దేశం చేశారు. రజతోత్సవ నిర్వహణ కోసం వారం రోజుల్లో కొన్ని కమిటీలు వేయబోతున్నాం. పార్టీ సంస్థాగతంగా నిర్మాణం చేయాలి అనుకున్నాం. ఏప్రిల్ 10న ప్రతినిధుల సభ ఉంటుంది’ అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.
ALSO READ: Fact Check: సీనియర్ సిటిజన్స్‌కు రైల్వే 50 శాతం రాయితీ కల్పిస్తోందా?
ఏప్రిల్ 27న రాష్ట్రంలో బహిరంగ సభ పెట్టబోతున్నామని కేటీఆర్ చెప్పారు. గ్రామ, మండల, జిల్లా కమిటీలు వేసుకుని.. అక్టోబర్ నాటికి అధ్యక్షుని ఎన్నిక నిర్వహిస్తామన్నారు. రాష్ట్ర ప్రయోజనాలు సాధించాలంటే ఒక్క బీఆర్ఎస్ తోనే సాధ్యమని పేర్కొన్నారు. తమకు అధికారం ముఖ్యం కాదని.. తెలంగాణ పరిరక్షణ ముఖ్యమని తెలిపారు. బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ వేడుకలు ఘనంగా నిర్వహిస్తామని చెప్పారు. ఉద్యమ సహచరులను ఒక్కటిగా చేసి ముందుకెళ్లడమే తమ లక్ష్యమని బీఆర్ఎస్ మాజీ మంత్రి కేటీఆర్ చెప్పుకొచ్చారు.