కేసీఆర్ ఆరోగ్యం ఎలా ఉంది?
ఆయన కులాసాగానే ఉన్నారా?
ఇటీవల వరుసగా ఆయన ఎందుకు అనారోగ్యంపాలవుతున్నారు?
కనీసం పార్టీ తరపున అయినా ఆయన హెల్త్ అప్ డేట్ ఎందుకు ఇవ్వట్లేదు?
ఇవన్నీ పార్టీ కేడర్ ని వేధిస్తున్న ప్రశ్నలు. తాజాగా ఈ అనుమానాలకు బలం చేకూరుస్తూ కేసీఆర్ జూబ్లీహిల్స్ ప్రచారానికి కూడా రాకుండా ఆగిపోయారు. కేసీఆర్ ఎందుకు రాలేదో కేటీఆర్ కూడా చెప్పలేదు. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి కూడా కేసీఆర్ ఆరోగ్యం సరిగా లేదని, ఆయన యాక్టివ్ పాలిటిక్స్ లో లేరంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. అయినా కూడా బీఆర్ఎస్ మౌనంగానే ఉంది. అంటే దీని అర్థం ఏంటి?
కేసీఆర్ ఎలా ఉన్నారు?
ఆమధ్య కేసీఆర్ అనారోగ్యంపై వార్తలు గుప్పుమనడంతో.. వరుసగా నేతలంతా వెళ్లి ఆయన్ను ఫామ్ హౌస్ లో కలసి వచ్చారు. ఆ తర్వాత అడపాదడపా ఆయన మీడియాకు కనపడుతున్నా గతంలో లాగా సుదీర్ఘంగా మాట్లాడలేకపోతున్నారు. కాంగ్రెస్ విమర్శల్ని సైతం ఆయన తిప్పికొట్టడం లేదు. ఇటీవల హరీష్ రావు తండ్రి మరణంతో కేసీఆర్ మరోసారి బయటకు వచ్చారు. జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో స్టార్ క్యాంపెయినర్ల లిస్ట్ లో ఆయన పేరున్నా కూడా బయటకు రాకపోవడం విశేషం.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కేసీఆర్ ప్రచారం చేసి ఉంటే బీఆర్ఎస్ అభ్యర్థి సునీతకు మరిన్ని ఓట్లు పడి ఉండేవనేది ఆ పార్టీ నేతల అభిప్రాయం. కానీ ఆయన మాత్రం ప్రచారానికి రాలేదు, ఎందుకు రాలేదు అనే ప్రశ్నకు కేటీఆర్ కూడా సమాధానం చెప్పడం లేదు. ప్రచారమంతా తానొక్కడే చేపట్టారు కేటీఆర్. హరీష్ రావు వ్యక్తిగత కారణాలతో ప్రచారానికి రాలేకపోయారు.
సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు..
కేసీఆర్ ఆరోగ్యంపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం కేసీఆర్ ఆరోగ్యం సరిగ్గా లేదని చెప్పారు. అందుకే క్రియాశీలక రాజకీయాల్లో కేసీఆర్ చురుగ్గా ఉండలేకపోతున్నారని, రాజకీయాల్లో క్రియాశీలంగా లేని కేసీఆర్ పై తాను ఎటువంటి విమర్శలు చేయనని స్పష్టం చేశారు రేవంత్ రెడ్డి.
Also Read: కేసీఆర్ ఆరోగ్యం సరిగ్గా లేదు.. సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు
బీఆర్ఎస్ స్పందన ఏంటి?
రేవంత్ రెడ్డి వ్యాఖ్యల పట్ల బీఆర్ఎస్ నుంచి ఎటువంటి స్పందన లేదు. ఒకవేళ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు అసత్యం అయితే.. కేసీఆర్ ఆరోగ్యంపై లేనిపోని అపోహలు సృష్టిస్తున్నారంటూ బీఆర్ఎస్ ఎదురుదాడికి దిగేది. కానీ అలా చేయలేదు. అంటే కేసీఆర్ ఆరోగ్యం సరిగా లేదని ఆ పార్టీ ఒప్పుకున్నట్టే లెక్క. అయితే ఆ వివరావో అధికారికంగా చెబితే అభిమానుల్లో ఆందోళన ఉండదు కదా. పక్క పార్టీ నేతలు కేసీఆర్ ఆరోగ్యంపై వ్యాఖ్యలు చేస్తున్నా బీఆర్ఎస్ మౌనంగా ఉండటం, కేటీఆర్ సైలెంట్ గా ఉండటంతో కేసీఆర్ అభిమానుల్లో ఆందోళన మొదలైంది. కేసీఆర్ ఆరోగ్యం ఎలా ఉంది, ఆయన ఏదైనా ట్రీట్ మెంట్ తీసుకుంటున్నారా? లేక బెడ్ రెస్ట్ లో ఉన్నారా అనే విషయాలు అధికారికంగా బీఆర్ఎస్ నేతలు ప్రకటిస్తే బాగుంటుందని అంటున్నారు ఆ పార్టీ కార్యకర్తలు.
Also Read: క్రెడిట్ చోరీ.. తన లోపాల్ని తానే బయట పెట్టుకుంటున్న జగన్