వెళ్దామా? వద్దా?
⦿ ఈడీ విచారణకు హాజరుకావడంపై డైలమా
⦿ లాయర్ల సూచనల మేరకు నిర్ణయం
⦿ మంత్రిగా నేనే నిర్ణయం తీసుకున్నా
⦿ కేబినెట్ సమావేశంలో చర్చ జరగలేదు
⦿ మీడియాతో చిట్‌చాట్‌లో కేటీఆర్ కామెంట్స్
⦿ ఈ నెల 7న ఎంక్వయిరీకి రావాలని ఈడీ నోటీస్
తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: Formula Car Race Case: ఫార్ములా ఈ – రేస్ వ్యవహారంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఇచ్చిన నోటీస్ మేరకు ఈ నెల 7న విచారణకు హాజరు కావడంపై కేటీఆర్ డైలమాలో పడ్డారు. హాజరువుతారా? లేదా? అనే చర్చలు జరుగుతున్న సమయంలో ఇంకా నిర్ణయం తీసుకోలేదంటూ వ్యాఖ్యానించారు. ఈ విషయమై లాయర్లు ఆలోచిస్తున్నారని, వారు ఇచ్చిన సూచన మేరకు హాజరు కావడంపై తాను నిర్ణయం తీసుకుంటానని అన్నారు. ఇప్పటివరకైతే హాజరు కావాలో వద్దో డిసైడ్ చేసుకోలేదని చెప్పారు. ఫార్ములా ఈ – రేస్ 10వ సీజన్ నిర్వహణపై అప్పటి పురపాలక శాఖ మంత్రిగా తానే నిర్ణయం తీసుకున్నానని, అప్పటి మంత్రివర్గంలో దీనిపై చర్చ జరగలేదన్నారు.
ఈ – రేస్ నిర్వహణలో ఎలాంటి అవకతవకలు లేవని, అవినీతి జరగలేదని, ఈ రెండూ లేనప్పుడు అవినీతి నిరోధక చట్టం కింద ఏసీబీ పెట్టిన కేసుకు అర్థమేముందని వ్యాఖ్యానించారు. మీడియా ప్రతినిధులతో చిట్‌చాట్ సందర్భంగా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు కేటీఆర్. ఏసీబీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్‌లో ఏ మాత్రం పస లేదని, అందువల్లనే దీన్ని క్వాష్ చేయాలంటూ హైకోర్టును ఆశ్రయించానని, న్యాయస్థానాలపై తనకు గౌరవం, నమ్మకం ఉన్నదని అన్నారు.
క్వాష్ పిటిషన్‌పై విచారణ సందర్భంగా న్యాయమూర్తి లేవనెత్తిన అనేక ప్రశ్నలకు ప్రభుత్వం తరఫు న్యాయవాది నుంచి సంతృప్తికరమైన సమాధానమే రాలేదని చెప్పారు. హైకోర్టులో దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై వాదనలు ముగిసి తుర్పును న్యాయమూర్తి రిజర్వు చేసినందున ఎలాంటి తీర్పు వస్తుందో వేచి చూద్దామన్నారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న అప్పటి పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శిగా పనిచేసిన ఐఏఎస్ ఆఫీసర్ అరవింద్ కుమార్, హెచ్ఎండీఏకు చీఫ్ ఇంజినీర్‌గా పనిచేసిన బీఎల్ఎన్ రెడ్డిలకు సైతం ఈడీ నోటీసులు జారీ చేసి విచారణకు హాజరు కావాల్సిందిగా ఆదేశాలు ఇచ్చింది ఈడీ.
వారి హాజరుపై మాట్లాడడానికి నిరాకరించిన కేటీఆర్, ఈ నెల 7న ఈడీ ముందు స్వయంగా ఆయన హాజరు కావడంపై మాత్రం స్పష్టమైన నిర్ణయాన్ని తీసుకోలేదని చెప్పారు. విచారణకు హాజరు కాకుండా ఉన్న లీగల్ మార్గాలపై లాయర్లు అన్వేషిస్తున్నారు. ఆలోపు హైకోర్టు తీర్పు వస్తుందని ఆశిస్తున్నారా? ఒకవేళ రాదని తెలిస్తే ఈడీ విచారణకు హాజరు కావడంపై మరోసారి న్యాయస్థానాలను ఆశ్రయిస్తారా? లాంటి సందేహాలు తలెత్తుతున్నాయి.
Also Read: CM Revanth Reddy: పనితీరు మెరుగుపరుచుకోండి.. మంత్రులకు, ఎమ్మేల్యేలకు సీఎం రేవంత్ రెడ్డి సూచన
ఇతర దేశాల్లోనూ ఫార్ములా ఈ – రేస్ రద్దు జరిగిందని వ్యాఖ్యానించిన కేటీఆర్, తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో సుమారు రూ.600 కోట్ల మేర నష్టం జరిగిందని, ఏకపక్షంగా రద్దు చేయాలని రాష్ట్ర సర్కార్ తీసుకున్న నిర్ణయం తప్పు అని వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందాన్ని ప్రస్తుత ప్రభుత్వం తప్పు పడుతున్నదని, విదేశీ కరెన్సీలో డబ్బులు అందుకున్న ఫార్ములా ఈ ఆపరేషన్స్ అనే కంపెనీని నిందితుల జాబితాలో ఎందుకు చేర్చలేదని ప్రశ్నించారు