అంబేద్కర్ జయంతి సందర్భంగా కేటీఆర్, కాంగ్రెస్ ప్రభుత్వానికి పలు ప్రశ్నలు సంధించారు. కాంగ్రెస్ హయాంలో దళితులకు అన్యాయం జరుగుతోందన్నారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ ఎస్సీ, ఎస్టీలకు డిక్లరేషన్లు ఇచ్చిందని వాటి సంగతి ఏమైందని ప్రశ్నించారాయన. దళిత బంధు కింద రూ. 12 లక్షలు ఇస్తామని చెప్పారని, ఇప్పటికైనా ఇస్తారా అని అడిగారు కేటీఆర్. సొంత ఇంటి నిర్మాణం కోసం ఆరు లక్షల రూపాయలు దళితులకు ఇస్తామనే హామీ కూడా ఇచ్చారని, అసైన్డ్ భూములకు పట్టాలు ఇస్తామని చెప్పారని, కాంట్రాక్టుల్లో గిరిజనులకు, దళితులకు 28శాతం వాటా ఇస్తామని చెప్పారని.. వాటి సంగతేమైందని ప్రశ్నించారు. విద్యాజ్యోతి పథకం కింద దళితులకు ఇస్తామని చెప్పిన ఆర్థిక ప్రోత్సాహకాలు ఎక్కడికి పోయాయన్నారు. కేటీఆర్ ప్రశ్నలు వినడానికి బాగానే ఉన్నా.. ఆ ప్రశ్నలు అడిగే అర్హత అసలు కేటీఆర్ కి లేదని అంటున్నారు కాంగ్రెస్ నేతలు.
దళిత ముఖ్యమంత్రి ఎక్కడ..?
తెలంగాణ ఏర్పడితే దళితుడిని తొలి ముఖ్యమంత్రిగా చేస్తామని ఆనాడు కేసీఆర్ గొప్పగా చెప్పిన మాటలు అందరికీ గుర్తుండే ఉంటాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు కేసీఆర్ కానీ, ఆ పార్టీ నేతలు కానీ ఆ వ్యాఖ్యల గురించి ప్రస్తావిస్తే నీళ్లు నములుతారు. అసలు కేసీఆర్ తానెప్పుడూ దళిత ముఖ్యమంత్రి గురించి మాట్లాడలేదనే కవర్ చేసుకునే ప్రయత్నాలు చేస్తుంటారని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. దళిత ముఖ్యమంత్రి గురించి ముందు కేసీఆర్ ని నిలదీసిన తర్వాతే కేటీఆర్, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని అంటున్నారు ఆ పార్టీ నేతలు.
ఉప ఎన్నికల సందర్భంగా కేవలం ఎన్నికల హామీగానే దళితబంధుని కేసీఆర్ ప్రకటించారని, ఆ తర్వాత అన్ని నియోజకవర్గాల్లో అమలు చేస్తామని చెప్పి ఎన్నికల వరకు కాలం గడిపారని గుర్తు చేస్తున్నారు కాంగ్రెస్ నేతలు. దళితబంధు విషయంలో ఎన్నో రాజకీయాలు జరిగాయని, దళితులను లబ్ధిదారులుగా గుర్తించే విషయంలో కూడా అన్యాయం జరిగిందని ఆరోపించారు. దళితబంధుతో నిజమైన పేద దళితులెవరికీ న్యాయం జరగలేదని, ఆ పేరుతో కేవలం ఎన్నికల డ్రామా నడిచిందని అంటున్నారు. దళితబంధు గురించి బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించడం హాస్యాస్పదం అంటున్నారు.
దళితులకు మంత్రి పదవులు ఇచ్చినా పెత్తనం మాత్రం కేసీఆర్, ఆయన కుటుంబానిదే ఉండేదని.. కాంగ్రెస్ హయాంలో దళిత నాయకుడికి ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చారని గుర్తు చేస్తున్నారు హస్తం పార్టీ నేతలు. బీఆర్ఎస్ హయాంలో దళితులకు ఎన్నో అవమానాలు జరిగాయని, కేవలం వారిని ఓటుబ్యాంకు రాజకీయాలకోసమే వాడుకున్నారని ఆరోపిస్తున్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు ఒక దళిత నాయకుడని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. అదే సమయంలో బీఆర్ఎస్ పార్టీకి ఒక దళితుడిని అధ్యక్షుడిగా చేయగలరా అని సూటిగా ప్రశ్నిస్తున్నారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా దళితుల గురించి మాట్లాడి, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేయాలని చూడటం కేటీఆర్ కే చెల్లిందని, ఇకనైనా ఇలాంటి ఆరోపణలు మానుకోవాలని హితవు పలికారు కాంగ్రెస్ నేతలు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత దళితులతో సహా అన్ని వర్గాల్లోని పేదలకు మేలు చేకూర్చే పథకాలు అమలు చేస్తోందని, దళితులకు ఇచ్చిన అన్ని హామీలను నెరవేరుస్తామని అంటున్నారు ఆ పార్టీ నేతలు.