KCR: స్వేచ్ఛ బ్యూరో: అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్నాయంటే గులాబీ అధినేత కేసీఆర్(KCR) ప్రస్తావన ఉండేది. సమావేశాలు ముగిసేవరకు కేసీఆర్ పేరును అధికార, ప్రతిపక్ష సభ్యులు సైతం ఏదో ఒక సందర్భంలోనూ ప్రస్తావించేవారు.. కేసీఆర్ చుట్టూ రాజకీయం నడిచేది. ఆయన సభకు హాజరవుతున్నారా? లేదా? అని మీడియా సైతం ప్రచారం చేసింది. కానీ బడ్జెట్ సమావేశాల్లో మాత్రం ఆ ప్రస్తావనే రావడం లేదు. ఎల్ఓపీ లీడర్ సభకు రావాలని అధికార కాంగ్రెస్ సైతం డిమాండ్ చేసేది. బీఆర్ఎస్ సభ్యులు సైతం వస్తారని, ఫలానా రోజూ హాజరు అవుతారని లీకులు సైతం ఇచ్చేవారు. కానీ ప్రస్తుతం ఆ అంశమే చర్చకు రాకపోవడం ఇప్పుడు పార్టీకేడర్ లోనూ ఏంజరుగుతుందనేది హాట్ టాపిక్ గామారింది.
బడ్జెట్ సమావేశాలు ఈ నెల 16న ప్రారంభం అయ్యాయి. అయితే మొదటి నుంచి కేసీఆర్ సభకు వస్తారా? రారా? అనే చర్చజరుగలేదు. అసలు కేసీఆర్ ను లైట్ గా తీసుకున్నారా? లేకుంటే రాజకీయ ఎత్తుగడలో భాగంగానే ఆయన సైలెంట్ గా ఉన్నారా? అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత అసెంబ్లీ సమావేశాలకు ఏదో ఒక సందర్భంలో ఇలా వచ్చి అలా వెళ్లిపోయేవారు. ఆ తర్వాత కేసీఆర్ చుట్టే రాజకీయ చర్చజరిగేది. కానీ ఈ బడ్జెట్ సమావేశాల్లో అలాంటిది లేదు. కేవలం గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ పై సెటైర్లు వేశారు. రాజ్యాలు పోయినా కొందరిలో రాచరిక పోకడలు పోలేదని, ఇంకా తమను తాము రాజులుగా భావిస్తున్నారని విమర్శలు చేశారు. గవర్నర్ కు ధాన్యవాదాలు చెప్పడానికి ప్రతిపక్ష నాయకుడు సభకు రాకపోవడం సభా సాంప్రదాయాలను గౌరవించకపోవడమేనని, ఇది రాష్ట్రానికి మాయని మచ్చ అని మండిపడ్డారు. ఎల్ఓపీ లీడర్ గా ఉంటూ ఇప్పటివరకు కోటి 6లక్షలకు పైగా జీతభత్యాలు తీసుకున్నారని, కానీ సభకు మాత్రం రావడం లేదని మండిపడ్డారు. అది తప్ప అసలు కేసీఆర్ ప్రస్తావనే రావడం లేదు. కేటీఆర్ మాత్రం కేసీఆర్ ఎప్పుడు రావాలో అప్పుడే వస్తారని పేర్కొన్నారు. కానీ గతానికి భిన్నంగా ఈ బడ్జెట్ సమావేశాల సమయంలో మాజీ సీఎంకేసీఆర్ ఉచ్చరణే లేకపోవడం ఇప్పుడు చర్చకు దారితీసింది.
బడ్జెట్ సమావేశాల బాధ్యతను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, డిప్యూటీ లీడర్లు హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి, పార్టీ విప్ గా కేపీ వివేకానందగౌడ్ ఉన్నారు. అయితే వీరు అధికార కాంగ్రెస్ పార్టీని ఎలా ఎదుర్కుంటారు? వారి పనితనంను తెలుసుకునేందుకే కేసీఆర్ సభకు రావడం లేదా? అనేది కూడా మరోవైపు చర్చజరుగుతుంది. అంతేకాదు ఈసారి బడ్జెట్ సమావేశాలకు ముందు ఎప్పుడైనా కేసీఆర్ ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలతో భేటి అయ్యి అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం చేసేవారు. కానీ ఇ సారి మాత్రం కేటీఆర్ భేటీ అయి వారికి సూచనలు చేశారు. అంటే పార్టీ బాధ్యతలు కేటీఆర్ కు అప్పగిస్తే ఎలా ముందుకు తీసుకెళ్తారని పరిశీలించేందుకే కేసీఆర్ సైలెంట్ అయ్యారా? అనేది కూడా ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చజరుగుతుంది.
Also Read: Telangana: తల్లిదండ్రులను పట్టించుకోని ఉద్యోగి జీతంలో 15 శాతం కోత.. అసెంబ్లీలో కీలక బిల్లులు
బడ్జెట్ పై అధికార కాంగ్రెస్ పై విమర్శలకు స్పీడ్ పెంచారు. కానీ గత కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమాన్ని ఆశించిన స్థాయిలో వివరించడం లేదని, ప్రజలకు సైతం బలంగా సభా వేదికగా చెప్పడం లేదనే ప్రచారం జరుగుతుంది. మరోవైపు సభలో సైతం బీఆర్ఎస్ సభ్యులకు ఆశించిన స్థాయిలో సమయం ఇవ్వకపోవడం, క్వచ్చన్ అవర్ లో సైతం మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడంతోనే తాము చెప్పలేక పోతున్నామని సభ్యులు పేర్కొంటున్నారు.
కేసీఆర్ ఏం చేస్తున్నారనేదానిపై కేడర్ లో తీవ్ర చర్చజరుగుతుంది. ప్రజల్లోనూ ఇదే చర్చఊపందుకుంది. గతంలో ఏదో ఒక సమయంలో కేసీఆర్ బయటకు వచ్చి ప్రజాసమస్యలపై గళం ఎత్తేవారు. పార్టీ నేతలకు సైతం మాట్లాడాలని ఆదేశాలు ఇచ్చేవారు. కానీ గత కొంతకాలంగా కేసీఆర్ సైలెంట్ అయ్యారు. ఇరిగేషన్ పై నల్లగొండ, మహబూబ్ నగర్ సభను పెడతారని పార్టీ నేతలు చెప్పారు. అందుకు ఉమ్మడి జిల్లాల నేతల భేటీ సైతం జరిగింది. కానీ ఈ సభల ప్రస్తావన లేదు. కేసీఆర్ సైతం పార్టీ నేతలతో సమావేశాలు సైతం నిర్వహించడం లేదు. పార్టీని ఎలా ముందుకు తీసుకెళ్తారనేది సైతం చెప్పడం లేదు. అంతేకాదు పార్టీ కమిటీలు సైతం వేయకపోవడం..అసలు వేస్తారా? లేదా? అనే ఆందోళన సైతం పార్టీ నేతల్లో నెలకొంది. అంతేకాదు పార్టీని ఎప్పటివరకు బలోపేతం చేస్తారు? అనేది సైతం క్లారిటీ లేకపోవడంతో కేడర్ లో ఆందోళన నెలకొంది. కేసీఆర్ అసెంబ్లీగానీ, బయటకు గానీ వస్తేనే బీఆర్ఎస్ పార్టీకి మనుగడ అని ఇప్పటికే కవిత పలు సందర్భాల్లో అభిప్రాయం వ్యక్తం చేశారు. లేకుంటే పార్టీ ఉనికి కష్టమని పేర్కొన్నారు. ఏది ఏకమైనప్పటికీ కేసీఆర్ లైవ్ లో లేకపోవడంతో పార్టీలో ఏంజరుగుతుందోనని కేడర్ లో మాత్రం ఆందోళన నెలకొంది. దానికి కేసీఆర్ ఎప్పటివరకు క్లారిటీ ఇస్తారనేది చూడాలి.
Also Read: Nara Lokesh: అసెంబ్లీకి రాకుండా బెంగళూరు వెళ్లడమేంటి? జగన్‌పై మంత్రి లోకేష్ ఘాటు విమర్శలు!