
CM KCR latest updates(Political news in telangana) :
తెలంగాణ సీఎం కేసీఆర్ రెండు స్థానాల్లో పోటీపై పునరాచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఒక్కస్థానానికే పరిమితం అయ్యే ఆలోచనలో ఉన్నారట గులాబీ బాస్. రెండు చోట్ల నుంచి కేసీఆర్ పోటీ చేస్తుండడంపై గజ్వేల్ కేడర్‌లో అసంతృప్తి నెలకొంది. గజ్వేల్ టికెట్ వంటేరు ప్రతాపరెడ్డికి ఇస్తానంటూ ఇప్పటికే కేసీఆర్ హామీ ఇచ్చారు. మరోపక్క గజ్వేల్‌లో క్రమంగా కేసీఆర్ గ్రాఫ్ తగ్గుతున్నట్టు సమాచారం. దీంతో కామారెడ్డి నుంచి మాత్రమే పోటీ చేస్తే బెటర్ అన్న ఆలోచనలో ఉన్నారు బీఆర్‌ఎస్ అధినేత. ఈ క్రమంలోనే కామారెడ్డిలోనే ఎక్కువగా ప్రచారం చేస్తున్నారు కేసీఆర్ కుమార్తె ఎమ్మెల్సీ కవిత.
మరోవైపు బీఆర్‌ఎస్‌లో టికెట్ల లొల్లి మరింత ముదురుతోంది. అన్ని జిల్లాల్లోనూ సిట్టింగ్‌లు తిరుగుబాటును ఎదుర్కొంటున్నారు. ఈ వ్యవహారాలు గులాబీ బాస్‌కు తలనొప్పిగా మారాయి. సిట్టింగ్‌లకు టికెట్ ఇస్తే ఓడిస్తామంటూ బహిరంగంగానే ప్రకటనలు చేస్తున్నారు.
10-15 స్థానాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను మార్చే అవకాశముందని తెలుస్తోంది. నియోజకవర్గంలో వ్యతిరేకత ఎక్కువగా ఉన్న సిట్టింగులను పక్కన పెడతారని అంటున్నారు. అలాంటి చోట్ల అభ్యర్థుల మార్పు ఉంటుందని సమాచారం. ఇక ఇప్పటికే ఈ లిస్ట్ రెడీ అయిందంటూ పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. సీఎం కేసీఆర్ మనసు మార్చుకోవడంతో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల్లో టెన్షన్ మొదలైంది. ఎవరి సీటుకు కోత పడుతుందోనన్న టెన్షన్‌లో ఉన్నారు.