TPCC Protest: ఇటీవల అమెరికా నుండి భారత పౌరులను బేడీలు వేసి మరీ అమెరికా మిలటరీ విమానంలో తీసుకువచ్చిన విషయం తెలిసిందే. ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కాగా, కేంద్రంపై పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ ఘటనపై కాంగ్రెస్ పార్టీ నేడు దేశవ్యాప్త నిరసనకు పిలుపునిచ్చింది.
ఏ తప్పు చేయని భారత పౌరులను అమెరికా నుండి నిర్దాక్షిణ్యంగా బేడీలు వేసి బలవంతంగా తరలించడంపై తెలంగాణ కాంగ్రెస్ భగ్గుమంది. అమెరికాలోని భారతీయులను అక్రమ వలసదారులుగా పేర్కొంటూ అవమానకరంగా కాళ్ళకు, చేతులకు బేడీలు వేసి ఇండియాకు తరలించడంపై ఏఐసీసీ పిలుపుమేరకు టీపీసీసీ ఆధ్వర్యంలో గాంధీ భవన్ వద్ద శుక్రవారం భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ, మాజీ ఎంపీ హనుమంతరావు, పలువురు నేతలు పాల్గొన్నారు.
నిరసన కార్యక్రమంలో షబ్బీర్ అలీ మాట్లాడుతూ.. అమెరికా నూతన అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కు ప్రధాని నరేంద్ర మోడీ భయపడుతున్నారని, విశ్వ గురువులుగా పేరుగాంచిన మోడీ ఇప్పుడెందుకు భయపడుతున్నారంటూ ప్రశ్నించారు. కేంద్ర విద్యా శాఖ మంత్రి జైశంకర్ పూర్తిగా విఫలమయ్యారని, అమెరికాను ప్రశ్నించే దమ్ము విదేశాంగ మంత్రికి కూడా లేనేలేదన్నారు. రష్యా, ఉక్రెయిన్ దాడులను నిరోధించినట్లు గొప్పలు చెప్పుకున్న ప్రధాని, ప్రస్తుతం అమెరికాలో ఉన్న భారతీయులను బేడీలు వేయకుండా తీసుకురాలేరా అంటూ ప్రశ్నించారు.
అమెరికా ఎన్నికల సమయంలో.. భారతీయులకు ఎటువంటి ఇబ్బందులు ఉండవని ప్రచారం చేశారని, ఎన్నికైన అనంతరం మాట మార్చారన్నారు. అమెరికాలో ఉంటూ సరైన పత్రాలు లేని 104 మంది భారతీయులను అమెరికా ప్రభుత్వం ఇండియాకు పంపగా, భారతీయులను టెర్రరిస్టుల వలె బేడీలు వేసి తీసుకురావడం ఎంతవరకు సబబన్నారు. కుంభమేళాను చూపిస్తున్న మోడీ మీడియాకు, 14 మంది భారతీయుల పరిస్థితి కనిపించడం లేదా అన్నారు. ఇప్పటికైనా అమెరికాకు గులాంగిరి చేసే విధానాన్ని బీజేపీ మానుకోవాలని అలీ హితువు పలికారు. కేంద్ర ప్రభుత్వం ఇండియన్స్ ని సేఫ్ గా తరలించడంలో విఫలం అయిందని కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు.
Also Read: Pregnent women : గర్భవతిపై లైంగిక దాడి – కదులుతున్న రైలు నుంచి తోసేసిన దుండగుడు
కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన 44,000 మందిని విదేశాల్లో ఉన్న జైళ్ల నుండి రాష్ట్రానికి తీసుకువచ్చామని, కేంద్రంలో కాంగ్రెస్ ఉన్నట్లయితే ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదంటూ షబ్బీర్ అలీ అన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు చేతులకు బేడీలు వేసుకుని నిరసన వ్యక్తం చేశారు.