
Nara Lokesh padayatra update(AP political news):
టీడీపీని తిరిగి అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ముందుకు కదులుతున్నారు. ఆయన చేపట్టిన యువగళం పాదయాత్ర 200 రోజులకు చేరింది. గురువారం ఏలూరు జిల్లా కొయ్యలగూడెంలో టీడీపీ నేతలు యాపిల్ మాలతో లోకేశ్‌కు స్వాగతం పలికారు. తనయుడికి ప్రోత్సాహం అందిస్తూ తల్లి భువనేశ్వరి పాదయాత్రలో పాల్గొన్నారు. నందమూరి, నారా కుటుంబ సభ్యులు యాత్రలో సందడి చేశారు.

జనవరి 27న యువగళం యాత్రను లోకేశ్ ప్రారంభించారు. ఇప్పటికే రాయలసీమ జిల్లాలను చుట్టేశారు. ఆ తర్వాత నెల్లూరు, ప్రకాశం , గుంటూరు, కృష్ణా జిల్లాల్లో పాదయాత్ర పూర్తి చేశారు. ప్రస్తుతం ఏలూరు జిల్లాలో పాదయాత్ర కొనసాగుతోంది. ఇప్పటివరకు 77 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 2,710 కిలోమీటర్లు లోకేశ్ నడిచారు.
తనయుడి పాదయాత్రపై తండ్రి టీడీపీ అధినేత చంద్రబాబు ప్రశంసలు కురిపించారు. యువత గళం నుంచి ప్రజల గొంతుకగా యువగళం మారిందన్నారు. పాదయాత్ర 200వ రోజుకు చేరుకోవడంతో తనయుడికి అభినందనలు చెప్పారు. యువగళం బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారానికి చేపట్టిన మంచి పనిని కొనసాగించాలని కోరారు.
యువగళం పాదయాత్ర 200 రోజులు పూర్తి చేసుకున్న వేళ రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో టీడీపీ నేతలు 3 కిలోమీటర్లు సంఘీభావ పాదయాత్రలు చేపట్టారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు ఈ యాత్రలో పాల్గొన్నారు. టీడీపీ మేనిఫేస్టోలో పొందుపరిచిన హామీల ప్లకార్డులను ప్రదర్శించారు.