రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి. మొదట్లో కోల్డ్‌వార్. ఇప్పుడు క్లోజ్‌వార్! ఇటీవల ఆ ఇద్దరు ఒక్కటయ్యారు. ఈయన ఆయన్ను పొగుడుతున్నారు. ఆయన ఈయన్ను కీర్తిస్తున్నారు. మనం మనం కాంగ్రెస్‌వాదులం అంటూ గల్లీ నుంచి ఢిల్లీ వరకు కలిసి పోరాడుతున్నారు. నల్గొండ సభలో, పొంగులేటి చేరికలో, ఉచిత విద్యుత్ పోరులో, ఢిల్లీ నిరసనలో.. ఇటీవల అనేక అంశాల్లో రేవంత్, కోమటిరెడ్డిలు అసలుసిసలు కాంగ్రెస్ యోధులుగా కలిసి పని చేస్తున్నారు. మొన్నటికి మొన్న ఢిల్లీలో కోమటిరెడ్డి ఇంటికి వెళ్లి మరీ కలిశారు రేవంత్. ఎన్నికల వ్యూహాలపై చర్చించారు. బయటికి వచ్చి కృష్ణార్జునుల్లా పార్టీని నడుపుతామని ప్రకటించారు. కట్ చేస్తే.. మళ్లీ ఏదో జరిగిందనే అనుమానం?
హస్తం పార్టీలో కొత్త చిచ్చు మొదలైందా? దీనికి కారణం వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీ కాంగ్రెస్‌లో విలీనం అవుతోందనే ప్రచారం. ఇప్పటికే విలీనానికి సంబంధించి తెరవెనుక జరగాల్సిన పనులు చాలా వేగంగా జరుతున్నాయని అంటున్నారు. షర్మిల రాకను ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఓపెన్‌గానే వెల్‌కమ్ చెప్పడం తాజా ఇష్యూకు కారణంగా కనిపిస్తోంది.
గతంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.. షర్మిల ఎంట్రీపై కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ఉన్నంత వరకు టీకాంగ్రెస్‌లోకి షర్మిల వచ్చే సవాలే లేదని తేల్చి చెప్పారు. ఏపీకి చెందిన షర్మిల వచ్చి తెలంగాణలో నాయకత్వం వహిస్తానంటే ఎలా ఊరుకుంటామని ప్రశ్నించారు. షర్మిల నాయకత్వం తెలంగాణలో రానివ్వనని.. ఏపీ కాంగ్రెస్ పగ్గాలు చేపడితే.. పొరుగు రాష్ట్ర పీసీసీ చీఫ్‌గా ఆమెకు సహకరిస్తానని చెప్పారు రేవంత్ రెడ్డి.
రేవంత్ చేసిన ఆ వ్యాఖ్యలు కోమటిరెడ్డికి తెలియనివి కాదు. మరి, ఇప్పుడెందుకు ఆయన భిన్నమైన కామెంట్స్ చేశారు? షర్మిలను కాంగ్రెస్‌లోకి ఎందుకు రారమ్మని పిలుస్తున్నారు?
పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి అలా.. ఎంపీ కోమటిరెడ్డి ఇలా.. పరిస్థితి చూస్తుంటే హస్తం పార్టీలో మళ్లీ ముసలం పుట్టిందా అనే చర్చ మొదలైంది. కృష్ణార్జునుల్లా పార్టీని నడుపుతామని ప్రకటన చేసిన రెండు రోజుల్లోనే.. షర్మిల విషయంలో కోమటిరెడ్డి.. రేవంత్‌రెడ్డిని విభేదిస్తూ స్టేట్‌మెంట్ ఇవ్వడం పార్టీలో గుసగుసలకు కారణంగా మారుతోంది. కావాలనే రేవంత్‌కు వ్యతిరేకంగా పావులు కదుపుతున్నారా? షర్మిలను తీసుకొస్తున్నారా?