Zepto Delivery Worker: స్వేచ్ఛ బ్యూరో : నగరంలోని కార్ఖానా ప్రాంతంలో జెప్టో డెలివరీ కార్మికుడు ఆశిష్ కుమార్‌పై జరిగిన దాడిని తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్‌ఫామ్ వర్కర్స్ యూనియన్(టీజీపీడబ్ల్యూయూ) తీవ్రంగా ఖండించింది. ఈ ఘటనపై నిష్పక్షపాతంగా, వేగంగా దర్యాప్తు జరిపి బాధ్యులపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని యూనియన్ డిమాండ్ చేసింది.
డెలివరీ బాయ్ పై దాడి..
ఈనెల 3న ఆర్డర్ డెలివరీ చేసేందుకు వెళ్లిన సమయంలో కార్ఖానాలోని ఓ అపార్ట్‌మెంట్‌లో ఆశిష్ కుమార్‌పై దాడి జరిగినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారని టీజీపీడబ్ల్యూయూ వ్యవస్థాపక అధ్యక్షుడు షేక్ సలావుద్దీన్ తెలిపారు. తనను బలవంతంగా ఫ్లాట్‌లోకి తీసుకెళ్లి వస్తువులతో కొట్టడంతో పాటు శారీరకంగా దాడి చేసి, అక్కడి నుంచి బయటకు వెళ్లకుండా అడ్డుకున్నారని బాధితుడు ఆరోపించినట్లు పేర్కొన్నారు. గిగ్, ప్లాట్‌ఫామ్ కార్మికులు ప్రతిరోజూ రోడ్లపై పనిచేస్తూ లక్షలాది మంది వినియోగదారులకు అవసరమైన సేవలు అందిస్తున్నారని ఆయన వెల్లడించారు.
బాధ్యులపై కఠిన చర్యలు..
విధులు నిర్వహిస్తున్న కార్మికులను అవమానించడం, దూషించడం లేదా శారీరకంగా దాడి చేయడం ఏమాత్రం సమర్థనీయం కాదని పేర్కొన్నారు. ఈ ఘటనపై వేగంగా, నిష్పక్షపాతంగా విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్‌తో పాటు పోలీస్ శాఖను ఆయన కోరారు. బాధితుడికి అవసరమైన రక్షణ, వైద్య, ఇతర సహాయాన్ని అందించాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో గిగ్, ప్లాట్‌ఫామ్ కార్మికులపై దాడులు, బెదిరింపులు, వేధింపులకు సంబంధించిన ఘటనలు తరచూ వెలుగులోకి వస్తున్నాయని సలావుద్దీన్ వెల్లడించారు. ఇలాంటి ఘటనలను అరికట్టేందుకు గిగ్ కార్మికుల కోసం ప్రత్యేక భద్రతా యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని, అత్యవసర పరిస్థితుల్లో వేగంగా స్పందించే వ్యవస్థను తీసుకురావాలని ప్రభుత్వం, పోలీస్ శాఖను డిమాండ్ చేశారు.
ఘటనపై జెప్టో యాజమాన్యం స్పందన..
ఇదిలా ఉండగా, ఘటనపై జెప్టో యాజమాన్యం స్పందించకపోవడాన్ని కూడా టీజీపీడబ్ల్యూయూ తప్పుబట్టింది. తమ వ్యాపార కార్యకలాపాలను నిర్వహించే కార్మికుల భద్రత, గౌరవం, సంక్షేమం పట్ల ప్లాట్‌ఫామ్ కంపెనీలకు బాధ్యత ఉందని పేర్కొంది. జెప్టో యాజమాన్యం వెంటనే స్పందించి బాధిత కార్మికుడికి అవసరమైన సహాయం అందించడంతో పాటు పోలీసుల దర్యాప్తుకు పూర్తిగా సహకరించాలని డిమాండ్ చేసింది.
Also Read: రామాయంపేట బడుల్లో ఎమ్మెల్సీ మల్క హల్‌చల్.. కేజీబీవీ విద్యార్థులకు కీలక హామీ!