BigTV English
Advertisement

Charlie Chaplin: కొత్త ఏడాదిలో చాప్లిన్ సందేశం విందాం..!

Charlie Chaplin: కొత్త ఏడాదిలో చాప్లిన్ సందేశం విందాం..!

Charlie Chaplin: వ్యక్తిగత జీవితంలో అనంతమైన విషాదాన్ని భరిస్తూనే.. ప్రపంచాన్ని కడుపుబ్బ నవ్వించిన మేలిరకం హాస్యనటుడు.. చార్లీ చాప్లిన్. ‘నాకు వర్షం అంటే ఇష్టం. ఎందుకంటే వర్షంలో నిలబడినప్పుడు నా కన్నీళ్లు ఎవరికీ కనిపించవుగా’ అని చెప్పుకున్న ‘వరల్డ్‌ గ్రేటెస్ట్‌ ఎంటర్‌టెయినర్‌’ చాప్లిన్. రెండవ ప్రపంచయుద్ధ కాలంలో యూదుల పట్ల చూపిన కర్కశ చర్యల మీద తీసిన ‘ద గ్రేట్‌ డిక్టేటర్‌’ అనే సినిమాలో ఆయన డ్యూయల్ రోల్ చేశాడు. వీటిలో ఒకటి అసలు హిట్లర్ పాత్ర కాగా.. రెండవది హిట్లర్ మాదిరిగా కనిపించే ఒక బార్బర్ పాత్ర. ఈ సినిమాలో హిట్లర్‌ను చాప్లిన్‌ విమర్శించాడు. కానీ చాప్లిన్‌ నటన అంటే హిట్లర్‌కు చచ్చేంత ఇష్టం.


ఇక సినిమాలోని సీన్ విషయానికి వస్తే.. అక్కడ హిట్లర్‌కు గౌరవ వందనం సమర్పించబోయే కార్యక్రమానికి వందలాది మిలిటరీ అధికారులు రెడీగా ఉంటారు. ఇంతలో హిట్లర్‌లా కనిపించే బార్బర్ అటుగా వస్తాడు. అతడిని చూసి నిజమైన హిట్లర్ అనుకున్న సైనికాధికారులు ఆయనను సగౌరవంగా తీసుకుపోయి.. గౌరవ వందనం సమర్పిస్తారు. అనంతరం ఆయనను ప్రసంగించాల్సిందని కోరతారు. జర్మనీలో జరుగుతున్న దారుణాల గురించి సామాన్య మానవుల మనసులోని భావాలను హిట్లర్‌లా కనిపించే ఆ బార్బర్ చెప్పుకొస్తాడు.

‘మన్నించండి.. నాకు చక్రవర్తి కావాలని లేదు. ఎవరినో జయించాలని గానీ, ఎవరి మీదనో పెత్తనం చేయాలని గానీ లేదు. నలుపు, తెలుపు తేడాలు లేవు. అందరికీ చేయగలిగిన సాయం మాత్రం చేయాలని ఉంది. ఒకరికొకరం సాయం చేసుకుంటూ.. మనం ముందుకు సాగాలి. ఎదుటివారి సంతోషమే మనకు స్ఫూర్తిని, సంతృప్తినీ ఇస్తాయి తప్ప వారి దుఃఖం కాదు. ఒకరిని అసహ్యించుకోవడం, అవహేళన చేయడం మనకొద్దు. ఈ విశాల ప్రపంచం అందరిదీ. మన జీవితం స్వేచ్ఛాసంతోషాలకు ప్రతిరూపంగా మారాల్సిన సమయమిది. కానీ.. ఎక్కడో మనం దారి తప్పాం. స్వార్థం మన అంతరాత్మను విషపూరితం చేస్తోంది. కపటం, కుత్సితం మన ప్రపంచాన్ని చిన్నదిగా చేస్తోంది. మనం వేగాన్ని అందుకున్నాం. కానీ.. మనుషులుగా మనం లోలోపల ముడుచుకుపోతున్నాం. ఎన్నో ఆవిష్కరణలు వస్తున్నా.. మన కోర్కెల దాహం మాత్రం తీరడం లేదు.


మన సైన్స్.. మనల్ని తోటివారిని ద్వేషించేవారిగా మారుస్తోంది. మన తెలివి తేటలు మనల్ని నిర్దయులుగా, కఠినాత్ములుగా చేస్తున్నాయి. యంత్రాలిచ్చే సౌకర్యం కంటే.. మనకు మానవత్వమే ప్రధానం కావాలి. అవసరానికి మించిన తెలివి కంటే.. మర్యాద, మన్నన, దయగల హృదయం కావాలి. ఇవిలేని జీవితం.. భయంకరమైనది. మనిషిలోని మంచితనం వల్ల ఆవిష్కరణలైన రేడియో, విమానం మనల్ని ఒకచోటికి చేరుస్తున్నాయి. విశ్వమానవ సౌభ్రాతృత్వానికి ఇవి బాటలు పరుస్తున్నాయి. ఈ ఈర్ష్య ద్వేషాలు ఎల్లకాలం ఉండవు. నియంతలు నశిస్తారు. ప్రజల నుండి లాక్కున్న అధికారం మళ్ళీ, తిరిగి ప్రజలకే దక్కుతుంది. స్వేచ్ఛా, స్వాతంత్య్రాలు నిలబడతాయి. తాత్కాలికంగా అణచబడ్డా, అవి సంకెళ్ళు తెంపుకొని ధైర్యంగా బతుకుతాయి. సైనికులారా ఆలోచించండి! మీకు తిండి పెట్టి, కసరత్తులు చేయించి, మిమ్మల్ని పూర్తిగా వాడుకునేవాడు ఎలాంటివాడో ఒకటికి రెండుసార్లు బాగా ఆలోచించండి.

మీరు పశువులు కాదు. గడ్డి పోచలు కాదు. మానవత్వం పట్ల మీకు అచంచల విశ్వాసం ఉంది. వీర సైనికులారా! స్వేచ్ఛ కోసం పోరాడండి. బానిసత్వం కోసం కాదు. మూర్ఖులకు అధికారం ఇవ్వొద్దు. వాళ్లు అబద్ధాలు చెబుతారు. వారికి మానవత్వం ఉండదు. వారు యంత్రాల్లా ఆలోచిస్తారు. మనుషులుగా మనం యంత్రాలై పోవద్దు. మనుషులుగా నిలదొక్కుకునే ఆత్మశక్తి మీలోనే ఉంది. మీ బిడ్డల భవిష్యత్తు గురించి ఆలోచించండి. రండి! మనమంతా కలిసి ప్రజాస్వామ్యం పేరిట ఏకమై, నూతన ప్రపంచాన్ని సృష్టించుకుందాం! దురాశ, దుఃఖం, అసూయ, క్రూరత్వాలకు తావులేని ఆ నవలోకం రావాలి. శాస్త్ర సాంకేతికాభివృద్ధి సాధించే ప్రగతివైపు పయనిద్దాం.. రండి! అందరం ఏకమౌదాం!!’’ ఇది చాప్లిన్‌ ఉపన్యాసం. ఈ సినిమా వచ్చి ఇన్నేళ్లయినా.. నేటికీ ప్రాసంగికత కలిగిన ఈ సీన్‌ను చూడాలనుకుంటే.. యూట్యూబ్‌లో నేటికీ అందుబాటులో ఉంది.

Tags

Related News

NTR: సారీ నన్ను క్షమించండి.. ఈవెంట్ తర్వాత ఎన్టీఆర్ స్పెషల్ వీడియో

Mother’s Love: అమ్మకు ప్రేమతో.. హ్యాపీ మదర్స్ డే..!

Cm Revanth Reddy: నేడు పాల‌మూరుకు సీఎం.. రూ.110 కోట్ల‌తో ఎలివేటెడ్ కారిడార్ రోడ్డుకు శంకుస్థాప‌న‌!

Pawan Kalyan: ఇష్టం వ‌చ్చిన‌ట్టు మాట్లాడితే తొక్కిప‌ట్టి నార‌ తీస్తాం.. రోజా, కోడాలికి ప‌వ‌న్ స్ట్రాంగ్ వార్నింగ్!

Chadrababu Naidu vs YS Jagan: తిరుమల డిక్లరేషన్ రగడ.. గెలిచిందెవరు?

Chiranjeevi: చిరు చేసిన పనికి గుండె ఆగిపోయినంత పనైంది- తెలుగు హీరోయిన్..!

Krithi Shetty: లైంగిక వేధింపులపై ఉప్పెన బ్యూటీ ఊహించని కామెంట్స్.. అది కావాలంటూ..!

Bigg Boss8 Day 17 Promo: కొట్టుకు చస్తున్న కంటెస్టెంట్స్.. ఇదెక్కడి గేమ్ రా బాబూ..!

Big Stories

×