వారిద్దరు భిన్నధృవాలు. దారులు వేరే కానీ పయనమొకటే. ఇద్దరూ దెబ్బతిన్న పులులే. సీనియర్లే. అవమానం వారిని కుంగదీసింది. ఆత్మగౌరవం అక్కడ లేనప్పుడు.. తామే ఆత్మగౌరవాన్ని వెతుక్కుంటున్నారు. అందుకే ఒకరు కొత్త పార్టీ పెట్టేందుకు అడుగులు వేస్తుండగా.. ఇంకొకరు పార్టీతో ఉన్న దశాబ్దాల బంధాన్ని కూడా కాదని, తనను వెతుక్కుంటూ వచ్చి తగిన గౌరవాన్నిస్తామని ఎర్ర తివాచీ పరిచిన పార్టీలోకి వెళ్లేందుకు రెడీ అయ్యారు. ఇప్పటికే తెలిసిందనుకుంటా. నేనెవరి గురించి చెబుతున్నానో. ఒకరు కవిత. మరొకరు జీవన్‌రెడ్డి.
కవితను ఆ కుటుంబం అవమానించింది. తండ్రి ఆమెను వెన్నుతట్టక పోగా.. కొడుకు మీద ప్రేమతో కూతురును దూరం చేయాలనుకున్నాడు. రాజకీయంగా ఆమెను పూర్తిగా భూస్థాపితం చేయాలనుకున్నాడు. అన్నీ భరించింది. ఒక సమయం వచ్చింది. నిర్ణయం తీసుకోవాల్సే వచ్చింది. తీసుకున్నది. పార్టీ నుంచి వెళ్లగొట్టడం అధికారికమే. కానీ ఆమెను పార్టీ అనధికారికంగా బహిష్కరించి చాలా ఏండ్లే అయ్యింది.
ఇప్పుడామె సొంతంగా నిర్ణయాలు తీసుకోగలదు. రాజకీయంగా తన బలమేమిటో తెలిసిన నేతగా.. భవిష్యత్ రాజకీయాల్లో కీలకంగా మనగలననే ఆత్మ విశ్వాసం ప్రోది చేసుకోగలదు. సొంత పార్టీ పెట్టి తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకోగలదు. ఎంతో మంది కొత్త రాజకీయ భవిష్యత్ ప్రసాదించగలదు. అంతకు మించి… తను ఎదుర్కొన్న అవమానం, తనను గెంటేసిన అవహేళన, చిన్నచూపుల అనుభవాన్ని చవిచూసిన నేతగా.. ఇతరులకు అట్లాంటి పరిస్థితిని తన ద్వారా రాకుండా చూసుకోగలదు. అప్పుడామె స్వేచ్చా విహంగం. తన ప్రపంచాన్ని తాను ఏర్పాటు చేసుకునే క్రమంలో రాజకీయంగా రెండో ఇన్నింగ్స్ ప్రారంభించేందుకు రెడీగా ఉన్నది. ప్రాక్టీస్ పూర్తయ్యింది. ఇక ప్రాక్టికలే మిగిలుంది.
జీవన్‌రెడ్డికి 14 సార్లు కాంగ్రెస్ భీఫామ్ ఇచ్చిందన్నారు పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్. ఇంకేమి చేయగలం మేం అని కూడా ప్రశ్నించారు. అవును, నిజమే. చాలా చేశారు ఆయనకు. ఆయన కూడా పార్టీ నుంచి బాగానే లబ్ది పొందారు. ఆత్మగౌరవం, మర్యాద, మన్ననలతో పాటుగా. కానీ కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. అప్పటి పరిస్థితులు వేరు. ఇప్పటి దుస్థితులు వేరు. మరి అప్పుడంతగా మర్యాదిచ్చి, సీనియారిటీకి విలువచ్చిన చోటే, డోంట్ కేర్.. ఉంటే ఉండు పోతే పో.. అనే విధంగా ప్రవర్తిస్తే… తట్టుకోగలడా? మరి ఇంతకాలం అనుభవించావుగా ఇక.. చాలదా…. ఇంకెంత చేయాలె.. అంటున్నారిప్పుడు కాంగ్రెస్ నేతలు. కానీ ఆ చెప్పే విధానంలో, వ్యవహరించిన ప్రవర్తనలోనే తేడా ఉన్నది. అదే ఆ జీవన్‌రెడ్డికి నచ్చలేదు. కలుగులో ఎలుకకు పొగ పెట్టిన చందంగా.. నోటితో నవ్వుతూ నొసటితో వెక్కిరించిన మాదిరిగా పార్టీ పెద్దల చర్యలు అతనికి చిరాకు తెప్పించారు. అంతకు మించి అవమానంతో రగిలిపోయేలా చేశాయి. అందుకే గతంలో తన శత్రువైనా.. అతడు తనకు విలువిస్తున్నాడు.
తన విలువేంటో తెలిసిన వ్యక్తిగా మర్యాదతో కూడిన ఆహ్వానం పంపాడు. అంతే.. ఇది చాలు నాకు అనుకున్నాడు జీవన్‌రెడ్డి. పార్టీ మారేందుకు రెడీ అయ్యాడు. పనిలో పనిగా రేవంత్‌పై దుమ్మెత్తి పోశాడు. కామనే… ప్రతిపక్ష పాత్ర పోషించేందుకు రెడీ అయినప్పుడు.. దుమ్మెత్తిపోస్తారు… నిలదీస్తారు. ప్రశ్నిస్తారు. పాత్ర మారింది. ఆ కొత్త పాత్రలో నిజాయితీగా జీవించడమే మిగిలుంది.
ఈ ఇద్దరికీ అవమానం జరగకుండా ఉండి ఉంటే… ఇలా జరిగేదా? అవమానం జరిగినా ఓపిక పట్టడం వారి చేతగానితనంగా చూడటంతోనే ఇదంతా జరిగిందా? అదే వారికి కొత్త దారులు వెతుక్కునేలా చేశాయా? అవును. కచ్చితంగా అదే జరిగింది. కానీ ఈ ఇద్దరూ ఇలా వేర్వేరు దారులు చూసుకోకుండా ఆపేందుకు ఓ ఇద్దరు ముందుకు వస్తే ఇదంతా జరగకపోయేదే. వారే ఒకరు కేసీఆర్. మరొకరు రేవంత్‌రెడ్డి.