Animal Adoption: ఉత్తరాఖండ్‌లోని నైనిటాల్‌లో ఉన్న పండిట్ జి.బి. పంత్ హై ఆల్టిట్యూడ్ జూ (Nainital Zoo) వన్యప్రాణుల సంరక్షణ కోసం ఒక అద్భుతమైన అవకాశాన్ని కల్పిస్తోంది. ఇక్కడ సామాన్య ప్రజలు కూడా పులులు, చిరుతలు, పక్షులు వంటి జంతువులను దత్తత తీసుకోవచ్చు. ఇంతకీ ఏ ఏ మృగాలు దత్తత తీసుకోవచ్చు? ఇందుకోసం అయ్యే ఖర్చు ఎంత? దత్తత వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి? ఈ కథనంలో పరిశీలిద్దాం.
ఈ జూలో హిమాలయ ప్రాంతానికి చెందిన ఎన్నో అరుదైన జంతువులు ఉన్నాయి. రాయల్ బెంగాల్ టైగర్, మంచు చిరుత (Snow Leopard), హిమాలయన్ నల్ల ఎలుగుబంటి, టిబెటన్ తోడేలు, సాంబార్ జింక, బార్కింగ్ డీర్, గోరల్ వంటి మృగాలు ఈ జూలో ఉన్నాయి. అలాగే సిల్వర్ ఫెసెంట్, గోల్డెన్ ఫెసెంట్, రోజ్ రింగ్డ్ పారాకీట్ వంటి రంగురంగుల పక్షులు సైతం జూలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. అయితే వీటన్నింటిని దత్తత తీసుకునే అవకాశాన్ని జి.బి. పంత్ హై ఆల్టిట్యూడ్ జూ నిర్వాహకులు కల్పిస్తున్నారు.
జంతువులను దత్తత తీసుకోవడమంటే వాటిని నేరుగా ఇంటికి ఇవ్వరు. వాటిపై ఎలాంటి భౌతిక యాజమాన్యం మీక ఉండదు. అయితే దానికి అవసరమయ్యే ఫుడ్, వైద్యం అవసరాలకు కావాల్సిన డబ్బును మీ నుంచి జూ అధికారులు తీసుకుంటారు. జంతువులను బట్టి దత్తత ఖర్చును అధికారులు నిర్ణయించారు. ఒక పులిని దత్తత తీసుకోవడానికి రూ.50,000, చిరుత అయితే రూ.25,000, పాముకు రూ.20,000 వేలు దత్తత ఖర్చుగా తీసుకోనున్నారు. అలాగే మెుసళ్లు, పక్షులు, నెమలి దత్తత ధరలను రూ.5,000-15,000 మధ్య నిర్ణయించారు. దత్తత ఖర్చుకు సంబంధించిన మరిన్ని వివరాలకు జూ వెబ్ సైట్ ను సంప్రదించాలని అధికారులు సూచించారు.
జంతువులను దత్తత తీసుకోవడం వల్ల కొన్ని ప్రయోజనాలు మీకు లభించనున్నాయి. ముందుగా మీరు చెల్లించే విరాళానికి అదాయపన్ను చట్టం సెక్షన్ 80G కింద మినహాయింపు లభిస్తుంది. అలాగే జూ ప్రవేశ ద్వారం వద్ద లేదా సంబంధిత జంతువు బోను వద్ద మీ పేరు (దత్తత తీసుకున్న వ్యక్తి/సంస్థ పేరు) ప్రదర్శిస్తారు. దత్తత తీసుకున్న వారికి, వారి కుటుంబ సభ్యులకు ఆ ఏడాది పొడవునా జూలోకి ఉచిత ప్రవేశం కల్పిస్తారు. వన్యప్రాణుల సంరక్షణలో భాగస్వాములైనందుకు జూ యాజమాన్యం నుండి మీకు ఒక ప్రత్యేక ప్రశంసా పత్రం అందుతుంది.
Also Read: Best Window ACs: ఏమి ఎండలు బాబోయ్? ఈ బడ్జెట్ ఏసీలు ట్రై చేయ్ భయ్యా.. సమ్మర్‌లో కూల్‌గా ఉండొచ్చు!